Andhra Pradesh Rain Alert: రాష్ట్రం మొత్తం ఎండలు కుమ్మేస్తుంటే అక్కడ వర్షాలు.. వాతావరణ శాఖ చల్లటి కబురు
ABN , Publish Date - Apr 02 , 2025 | 07:12 AM
కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో వర్ష సూచన ఉంది బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం నుంచి తేమగాలుల ప్రభావంతో గాలులు వీస్తున్నాయి

సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతల నమోదు
అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ తీరం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీంతో ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 3న రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అక్కడక్కడా వడగళ్లు పడే అవకాశం ఉందని పేర్కొంది. 4న రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో, కోస్తాలో కొన్నిచోట్ల వర్షాలు కురవనున్నాయి. బుధవారం కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల మేఘాలు ఆవరించి ఉండే అవకాశం ఉన్నందున పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 30 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం కూడా 47 మండలాల్లో వడగాడ్పులు వీయనుండగా, అల్లూరి, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, మంగళవారం కర్నూలు జిల్లా ఉలిందనకొండ, విజయనగరం జిల్లా నెలివాడలో 39.8, కడప జిల్లా వేంపల్లె, నంద్యాల జిల్లా రుద్రవరంలో 39.5, అనకాపల్లి జిల్లా రావికమతంలో 39.2, అనంతపురం జిల్లా నాగసముద్రంలో 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.