Corruption: ఆ అధికారి అహంకారం ఖరీదు 11 కోట్లు
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:03 AM
రోడ్లు, భవనాల శాఖలో ఓ అధికారి అహంకారంతో టోల్ ఫీజు పెంపును నిర్లక్ష్యం చేసి, కోర్టు కేసు దాకా నడిపాడు. కోర్టు తీర్పుతో ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు మొత్తం ₹8.94 కోట్లు చెల్లించాల్సి వచ్చింది

టోల్ రుసుము పెంచడంలో నిర్లక్ష్యం
ఆర్‌అండ్‌బీ కాంట్రాక్టర్‌తో దురుసు ధోరణి
నిబంధనలతో కోర్టుకెళ్లిన కాంట్రాక్టర్
కింది స్థాయి నుంచి పైవరకూ గెలుపు
అన్ని కోర్టుల్లోనూ ఓడిన అధికారి వాదన
రూ.8.94 కోట్లు చెల్లించాలన్న కోర్టు
ఈ నెల 15 వరకు గడువు.. లేకపోతే
అతిథి గృహం అమ్మివ్వాలని ఆదేశం
రూ.2.06 కోట్ల ఖర్చులతో సహా రూ.11 కోట్ల భారం
2015 నాటి కేసుపై ఆర్‌అండ్‌బీలో తీవ్ర చర్చ
రోడ్లు భవనాల శాఖలో ఓ అధికారి చూపిన అహంకారం.. ఏకంగా రూ.11 కోట్లకు ఎసరు పెట్టింది. ఓ కాంట్రాక్టర్‌తో లడాయి పెట్టుకుని టోల్ ఫీజు రుసుము పెంచడంలో చూపిన నిర్లక్ష్యం కోర్టు మెట్లు ఎక్కేవరకు సాగింది. ప్రతిస్థాయిలోనూ సదరు అధికారి వాదన వీగిపోయి.. సర్కారు భారీ మూల్యం చెల్లించే వరకు తెచ్చింది. ఈ నెల 15 నాటికి కాంట్రాక్టర్‌కు 2.06 కోట్ల ఖర్చులతో సహా రూ.8.94 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. సొమ్ములు చెల్లించకపోతే అతిథి గృహాన్ని విక్రయించైనా ఇవ్వాలని తెగేసి చెప్పింది.
(అమరావతి/విజయవాడ-ఆంధ్రజ్యోతి)
‘కాంట్రాక్టర్ అంటే మా కింద పనిచేసేవాడు. మా చెప్పుచేతల్లో ఉండేవాడు’ అని కొందరు ఉన్నతాధికారులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడా లేని ఇగో, అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారు. ఆ తరహా వ్యవహారం రివర్స్ అయితే మాత్రం. తమకు సంబంధం లేదని తప్పించుకుంటారు. అంతిమంగా ప్రభుత్వంపై మోయలేని ఆర్థికభారం మోపుతుంటారు. ఇలాంటి వ్యవహారమే రోడ్లు భవనాల శాఖ(ఆర్ అండ్ బీ)లో వెలుగుచూసింది. ఒప్పందం ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా తన టోల్ ఫీజులు సవరించి పెంచాలని ఓ అధికారిని కాంట్రాక్టర్ కోరారు. నిబంధనల ప్రకారం ఫీజులు పెంచితే సరిపోయేది. కానీ, 2015లో నాటి ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారి అహంకారానికి పోయారు. ఇంకేదో మనసులో పెట్టుకొని కాంట్రాక్టర్‌తో లడాయికి దిగారు. దీంతో సదరు కాంట్రాక్టర్ న్యాయపోరాటం చేశారు. నగర స్థాయి కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా పోరాడారు.
అన్నిచోట్ల ఆర్‌అండ్‌బీ అధికారి వాదన వీగిపోయింది. ప్రభుత్వ పరువూ పోయింది. అంతేకాదు, కాంట్రాక్టర్‌కు 2015 నాటి బకాయిలను అసలు, వడ్డీలతో కలిపి చెల్లించాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఫలితంగా వడ్డీలతో కలిపి రూ.8.94 కోట్లను ఈనెల 15 నాటికి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే 15వ తేదీన విజయవాడలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని అమ్మకానికి పెట్టయినా సొమ్ములు సిద్ధం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక, ఈ న్యాయపోరాటంలో ఆర్‌అండ్‌బీ చేసిన ఖర్చు రూ.2.06 కోట్లపైమాటే. వెరసి మొత్తం ప్రభుత్వంపై రూ.11 కోట్ల భారం పడింది.
విషయం ఏంటంటే
హైదరాబాద్-గుంటూరు మార్గం పూర్వం స్టేట్ హైవే-2(ఇప్పుడు ఎన్‌హెచ్-167 ఏజీ)గా ఉండేది. ఈ రోడ్డులో నాలుగు హైలెవల్ వంతెనల కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన కాంటెక్ సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. బిల్డ్ ఆపరేట్ ట్రాన్సిట్(బీఓటీ) విధానంలో చేపట్టింది. 2003లో ఒప్పందం చేసుకుని 2004 జూలై 12న పనులు పూర్తిచేసింది. టోల్ ఫీజుల వసూలు కాలపరిమితి 2004 నుంచి 2015 వరకు ఉండేలా ఒప్పందం కుదిరింది. టోల్ కాల వ్యవధిలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన ధరలను బట్టి టోల్ ఫీజులు పెంచాలి. ఒప్పందంలోనే ఈ అంశం ఉంది. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని 2013లో టోల్ ఫీజులను సవరించి పెంచాలని ఆర్‌అండ్‌బీని కాంట్రాక్టు సంస్థ కోరింది. దీనికి ఆనాటి ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారి ఒకరు అంగీకరించలేదు. ఒప్పందంలోని అంశాలను చూడకుండానే విన్నపాన్ని బుట్టదాఖలు చేశారు. దీంతో నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లారు. పెరిగిన ధరల మేరకు టోల్‌ఫీజులు లేకపోవడంతో తమకు భారీ నష్టం జరిగిందని, దీనిని భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. కాంట్రాక్టర్‌కు నష్టపరిహారం చెల్లించాలని ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఆర్‌అండ్‌బీ 2019లో కమర్షియల్ కోర్టులో సవాల్ చేసింది. అయినా ఫలితం దక్కలేదు. ట్రైబ్యునల్ ఉత్తర్వులు అమలు చేయాలని కమర్షియల్ కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. లేనిపక్షంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని(గెస్ట్ హౌజ్)ను అటాచ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
15 తుది గడువు!
ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుతోపాటు కమర్షియల్ కోర్టు ఆదేశాలను 2020లో ఆర్‌అండ్‌బీ హైకోర్టులో అప్పీల్ చేసింది. అయితే.. అక్కడ కూడా ఆర్‌అండ్‌బీ వాదన వీగిపోయింది. కాంట్రాక్టర్‌కు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేస్తూ.. ఆర్‌అండ్‌బీ పిటిషన్‌ను 2021, నవంబరులో డిస్మిస్ చేసింది. దీంతో గతంలో హెచ్చరించినట్లుగానే ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌ను కమర్షియల్ కోర్టు తన అటాచ్‌మెంట్ లిస్టులో చేర్చింది. కానీ, ఏ చర్యలు తీసుకోకుండా బిల్లుల చెల్లింపునకు ఆర్‌అండ్‌బీకి చివరి అవకాశం ఇచ్చింది. ఇక, ఇంత జరిగినా ఆర్‌అండ్‌బీ వెనక్కి తగ్గకపోగా.. చివ రి ప్రయత్నంగా 2022లో సుప్రీంకోర్టు మెట్లెక్కింది. కానీ, అక్కడా ఓటమిని మూటకట్టుకుంది. స్థానిక కమర్షియల్ కోర్టు ఇచ్చిన ఆదేశాన్నే అనుసరించాలని పేర్కొంటూ ఆర్‌అండ్‌బీ వేసిన పిటిషన్‌ను 2024, అక్టోబరు 18న డిస్మిస్ చేసింది. దీంతో కాంట్రాక్టర్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విజయవాడలోని స్పెషల్ కమర్షియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు చరిత్ర, పర్యావసనాలను పరిశీలించిన కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కాంట్రాక్టరుకు టోల్ ఫీజు పెంచకపోవడం వల్ల జరిగిన నష్టం, అసలు, వడ్డీతో కలిపి రూ.8.94 కోట్లను చెల్లించాలని ఆర్‌అండ్‌బీని గత నెల 25న ఆదేశించింది. లేనిపక్షంలో సీపీసీలోని సెక్షన్ 21, రూల్ 64(1) కింద విజయవాడలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌ను ఏప్రిల్ 15న అమ్మకానికి పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంటే, ఏప్రిల్ 15లోగా కాంట్రాక్టర్‌కు ఆర్‌అంబ్‌బీ 8.94 కోట్లు చెల్లించాలి. లేనిపక్షంలో ఈ నెల 15న గెస్ట్‌హౌజ్ కమర్షియల్ కోర్టు నియంత్రణలోకి వెళ్తుంది. ఆ భవనాన్ని కోర్టు అమ్మకానికి పెట్టి, వచ్చిన డబ్బును కాంట్రాక్టర్‌కు చెల్లిస్తుంది.
ఆర్‌అండ్‌బీలో ఇదే చర్చ
ఈ పరిణామం ఆర్‌అండ్‌బీ అధికారులను విస్మయానికి గురిచేసింది. 2013లో ఓ అధికారి చేసిన పొరపాటుకు ఇప్పుడు రూ.కోట్ల భారం మోయాల్సి వస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు విషయాన్ని ఇప్పటికే ఆర్‌అండ్‌బీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఇప్పుడు పైకోర్టులకు వెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో ఈ నెల 15లోపు డబ్బులైనా కట్టాలి. లేదంటే అతిథి గృహాన్నయినా వదులుకోవాల్సిందేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇకనైనా అధికారులు తమ సొంత పంతాలు, పట్టింపులు, అహంకారాలకు పోకుండా చట్టం, నిబంధనలు, ఒప్పందాల ప్రకారం నడుచుకుంటే మేలని ఆర్‌అండ్‌బీ వర్గాలు సూచిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News