AP Water Projects: కుడికాలువ విస్తరణ లేదు
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:41 AM
పోలవరం-బనకచర్ల రెగ్యులేటర్ ప్రాజెక్టులో మార్పులు చేస్తూ, తాడిపూడి నుంచి జక్కంపూడి వరకు కొత్త సమాంతర కాలువ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.81,800 కోట్ల ప్రాజెక్టును స్వయం సమృద్ధిగా మార్చేందుకు 3,430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికను సిద్ధం చేసింది

తాడిపూడి నుంచి జక్కంపూడి దాకా సమాంతర కాలువ
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులో కీలక మార్పు
పథకం పొడవునా విద్యుత్కేంద్రాలు.. 2 హైడల్, మరో 2 పంప్డ్
అవసరమైన చోట్ల సోలార్ ప్లాంట్లు
మొత్తంగా 3,430 మెగావాట్ల ఉత్పత్తి
ప్రాజెక్టు నిర్వహణకు 3,377 మెగావాట్లు కావాలి
వాడకం పోను 53 మెగావాట్లు మిగులు
డీపీఆర్‌లో జల వనరుల శాఖ స్పష్టీకరణ
అంచనా వ్యయం రూ.81,800 కోట్లు
జూన్ 1న టెండర్లు పిలిచే అవకాశం
అమరావతి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి జలహారతి పేరిట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘పోలవరం-బనకచర్ల రెగ్యులేటర్’ ప్రాజెక్టులో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. పోలవరం కుడి ప్రధాన కాలువను విస్తరించడం కాకుండా తాడిపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి వరకు సమాంతర కాలువ నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసింది. రూ.81,800 కోట్ల భారీ అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్వహణ భారం కాకుండా స్వీయ స్వావలంబన సాధించేలా.. ప్రాజెక్టు పొడవునా విద్యుత్కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రాజెక్టు యాజమాన్య నిర్వహణకు 3,377 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా.. రెండు చోట్ల జలవిద్యుత్కేంద్రాలు (430 మెగావాట్లు), ఇంకో రెండు చోట్ల పంప్డ్ స్టోరేజీ (1,000 మెగావాట్లు).. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్ల (2,000 మెగావాట్లు) నిర్మాణంతో 3,430 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించింది. అలా చేస్తే 53 మెగావాట్లు మిగులుతాయని కూడా తెలిపింది. రెండు టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు 200 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించే ఈ పథకానికి జూన్ 1న టెండర్లను పిలిచే అవకాశం ఉంది.
బుడమేరుకు దూరంగా..
పోలవరం కుడి కాలువను విస్తరించి బుడమేరు గుండా వరద జలాలను ప్రకాశం బ్యారేజీలోకి తరలించాలన్న ఆలోచనను జల వనరుల శాఖ విరమించుకుంది. విస్తరణలో సమస్యలు ఎదురవుతాయని అంచనా వేసింది. తాజాగా తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద 15 కిలోమీటర్ల నుంచి 166.50 కిలోమీటర్ల వద్ద జక్కంపూడి గ్రామం దాకా సమాంతరంగా కాలువ తవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం 1,401 ఎకరాల భూమిని సేకరిస్తుంది. సమాంతర కాలువ ద్వారా బుడమేరుకు దూరంగా.. పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలను కృష్ణా నది(ప్రకాశం బ్యారేజీ)లోకి తరలిస్తారు. ఈ తొలి దశ పథకం కోసం రూ.13,800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. అనంతరం ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయరులోకి 33,000 క్యూసెక్కుల చొప్పున 83.40 కిలోమీటర్ల ఓపెన్ కాలువ గుండా ఆరు ఎత్తిపోతల ఏర్పాటుతో తరలిస్తారు. బొల్లాపల్లి రిజర్వాయరు వద్ద 230 మెగావాట్ల జల విద్యుత్కేంద్రాన్ని స్థాపిస్తారు. బొల్లాపల్లి నుంచి నల్లమల రిజర్వాయరుకు.. అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు 23,000 క్యూసెక్కుల చొప్పున తరలిస్తారు. మధ్యలో మూడు లిప్టులను ఏర్పాటు చేస్తారు. 200 మెగావాట్ల విద్యుత్కేంద్రాన్ని స్థాపిస్తారు. 27.10 కిలోమీటర్ల పొడవున టన్నెల్ నిర్మిస్తారు. సమీపంలోని సిద్దాపురం వద్ద జంట టన్నెల్స్ తవ్వుతారు. వాటి ద్వారా బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు జలాలు తరలిస్తారు.
విద్యుత్కేంద్రాలు ఇలా..
బొల్లాపల్లి రిజర్వాయరు వద్ద 230 మెగావాట్లు, సిద్దాపురం వద్ద 200 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రాలను నిర్మిస్తారు.
ప్రాజెక్టులో ఆరో స్టేజ్‌లో గుత్తికొండ వద్ద రెండు చోట్ల 400 మెగావాట్లు, 600 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్ట్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు.
ఇక ప్రాజెక్టు పొడవునా ఎంపిక చేసిన ప్రదేశాల్లో 2,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
3,430 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ఏటా రూ.2,954 కోట్ల ఆదాయం ఉంటుందని.. ప్రాజెక్టు నిర్వహణకు 3,377 మెగావాట్లు వినియోగిస్తే ఇంకో 53 మెగావాట్లు మిగులుతుందని జల వనరుల శాఖ స్పష్టం చేస్తోంది. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీలే భారమని.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు కోసం కరెంటు కొనాల్సిన పనే లేదని, ఏర్పాటుచేసే విద్యుత్ ప్లాంట్లు ఆ కొరత తీరుస్తాయని అంటోంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగానే ఈ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నందున.. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు కచ్చితంగా అందుతాయని అధికార వర్గాలు అంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News