GSLV F-12 Rocket: జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతం... శాస్త్రవేత్తల సంబరాలు

ABN , First Publish Date - 2023-05-29T11:25:29+05:30 IST

శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.

GSLV F-12 Rocket: జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతం... శాస్త్రవేత్తల సంబరాలు

నెల్లూరు: శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ (GSLV F-12 Rocket) ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం షార్ రాకెట్ ప్రయోగ కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా 10:42 గంటలకు నిప్పులు చెరుగుతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై నిర్ణీత సమయంలో ఎన్‌వీఎస్ - 01 ఉపగ్రహాన్ని రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ విజయవంతంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఉపగ్రహం దేశీయ నేవిగేషన్ సేవలు అందించనుంది. జీఎస్ఎల్వీ ఎఫ్ - 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు. 2,232 కిలోల బరువున్న ఎన్‌వీఎస్‌-01 జీవితకాలం 12 ఏళ్లు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అవడంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సహచర శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ (ISRO Chairman Dr. Somnath) అభినందించించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. ఇది ఇస్రో సభ్యుల కృషి వల్లే సాధ్యమైందన్నారు. ఎన్‌వీఎస్ - 01 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరిందని చెప్పారు. రాకెట్ ప్రయోగంలో క్రయోజనిక్ స్టేజి చాలా కీలకమైందని... ఆ స్టేజ్‌ కూడా సవ్యంగా సాగిందని ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ పేర్కొన్నారు.

సోమనాథ్ ఇంకా మాట్లాడుతూ... దేశీయ నావిగేషన్ వ్యవస్థ కోసం మరో నాలుగు ఉపగ్రహాలని పంపుతామని తెలిపారు. వాతావరణ పరిశోధన కోసం త్వరలోనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామన్నారు. క్రయోజనిక్ వ్యవస్థలో లోపాలని గుర్తించి సరిచేశామని తెలిపారు. చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. చిన్న ఉపగ్రహాల కోసం తమిళనాడులోని కులశేఖరపట్నంలో ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూన్నామన్నారు. భూ సేకరణ పూర్తి కావాల్సి ఉందన్నారు. మానవ రహిత ప్రయోగానికి సిద్ధమవుతున్నామని ఇస్రో చైర్మన్ వెల్లడించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-05-29T12:29:52+05:30 IST

News Hub