CM Revanth Reddy: మంత్రులను తీసేస్తేనే పట్టున్నట్టా?
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:00 AM
పాలనపై పట్టు రావడమంటే.. ఇద్దరు మంత్రులను తొలగించడమో, ఇద్దరు అధికారులను జైలుకు పంపడమో కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

పారదర్శక పాలన అందిస్తేనే పట్టువచ్చినట్లు
కులగణన వల్లే బడుగులకు ఎమ్మెల్సీ సీట్లు
రాజీవ్ యువవికాసంతో యువతకు ఉపాధి
జూన్ 2న 5లక్షల మంది లబ్ధిదార్ల జాబితా
పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పాలనపై పట్టు రావడమంటే.. ఇద్దరు మంత్రులను తొలగించడమో, ఇద్దరు అధికారులను జైలుకు పంపడమో కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్లు అని, దానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించినా, నిత్యావసరాల ధరల నియంత్రణలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నా, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నా.. ఇంకా పాలనపై పట్టు వచ్చినట్లు లేదంటూ మీడియా మిత్రులు అంటున్నరు. కానీ, పట్టు రావడమంటే పారదర్శక పాలన అందించడమే. మేం ఆ దిశగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నాం’’ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంచే కార్యక్రమాలను ప్రారంభించుకున్నామని తెలిపారు. 10 నెలల్లో 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తొలి ఏడాదిలో ఇన్ని నియామకాలు చేపట్టలేదని అన్నారు. 65 లక్షల మంది స్వయం సహాయక గ్రూపుల మహిళలకు 1.30 కోట్ల నాణ్యమైన చీరలను అందించనున్నామని, పాఠశాలల నిర్వహణ బాధ్యతనూ ఈ సంఘాలకే అప్పగించామని పేర్కొన్నారు. ఆయా స్కూళ్లకు టీచర్లు సరిగా వస్తున్నారా, లేదా అన్నది చూడాల్సిన బాధ్యతను ఆ మహిళలే తీసుకోవాలని సూచించారు.
రాహుల్ హామీ మేరకు కులగణన..
రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం కులగణన సర్వేను పూర్తి చేశామని సీఎం రేవంత్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో బిల్లును ఆమోదించామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకూ మంగళవారం చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. కులగణన సర్వేతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో వచ్చిన చైతన్యాన్ని గమనించి.. ఇటీవల జరిగిన ఐదు ఎమ్మెల్సీ సీట్లను ఆ వర్గాలకే రాజకీయ పార్టీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది తొలి అడుగు మాత్రమేనన్నారు. రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని, అంచనాలు తప్పి.. ఆదాయం తగ్గి, అప్పులు అడ్డగోలుగా పెరిగి పోయాయని అన్నారు. అయినా ధైర్యం కోల్పోకుండా ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంలో దుబారా ఖర్చును తగ్గించేశామన్నారు. ‘‘గత ప్రభుత్వంలో వసూలు చేయాల్సిన పన్నులను వదిలేశారు. మేం వచ్చాక 14 నెలలపాటు ఇసుక విషయంలో పాత ప్రభుత్వ విధానాలనే కొనసాగించాం. ఆ విధానంలో రోజుకు రూ.1.20 కోట్ల నుంచి 1.50 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అయితే నెల రోజుల నుంచి అధికారులపై గట్టిగా ఒత్తిడి తెస్తే ఇసుక ద్వారా ప్రభుత్వానికి రోజుకు వచ్చే ఆదాయం రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు పెరిగింది’’ అని సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో, రాష్ట్ర స్వీయ ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఆదాయ పన్ను వసూళ్లలోనూ అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 8.8 శాతంగా ఉన్న నిరుద్యోగ సమస్యను 6.1 శాతానికి తగ్గించామన్నారు.
నియోజకవర్గానికి 5వేల మందికి ఉపాధి!
రాజీవ్ యువ వికాసం ద్వారా అన్ని అర్హతలు ఉన్నవారికి స్వయం ఉపాధి కోసం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఇందుకోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించుకున్నామన్నారు. జూన్ 2న ఐదు లక్షల మందితో లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి 4 వేల నుంచి 5 వేల మందికి ఉపాధిని కల్పించవచ్చునన్నారు. అయితే ఆయా లబ్ధిదారులకు అర్హత ఉందా, లేదా అన్నది ఎమ్మెల్యేలే చూసుకోవాలని సూచించారు. తెలిసిన వారని చెప్పి.. ఐదంతస్తుల భవనం ఉన్నోడికీ రూ.5 లక్షలు ఇస్తానంటే కుదరదని, గతంలో అలా చేసినోళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూడాలని అన్నారు. ఈ పథకం నిజమైన నిరుద్యోగులకు అందాలన్నారు. ఇక నియోజకవర్గానికొకటి చొప్పున వంద అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ను ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ ఇవ్వాలనుకుంటున్నామని సీఎం తెలిపారు. శిక్షణ పొందిన వారికి ఉద్యోగం దొరకకుంటే భవిష్యత్తులో రాజీవ్ యువ వికాసంలో ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీసీఎం భట్టివిక్రమార్కకు సూచించారు. రాష్ట్రంలో చిన్న చిన్న ప్రాంతాల్లోనూ గంజాయి, సింథటిక్ డ్రగ్స్, కొకైన్‌లకు యువత బానిసలవుతున్నారని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఉపాధి కల్పించి మత్తు పదార్థాలకు దూరం చేయాలని అన్నారు. భట్టి మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం యువత తలరాతను మార్చే పథకమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల చైర్మన్లు పాల్గొన్నారు.