AP High Court: డిస్ట్రిక్ట్ గెజిట్‌లో పంచాయతీల ఆస్తులు ప్రచురణకు చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:04 AM
ఆస్తుల పరిరక్షణకు తీసుకున్న చర్యలను తదుపరి విచారణలో తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తదితరులకు నోటీసులు జారీ చేసింది.

ఆస్తుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నారు?
వివరాలు మాముందు ఉంచండి
పంచాయతీరాజ్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ఆస్తులను గుర్తించి, వాటిని డిస్ట్రిక్ట్ గెజిట్‌లో ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆస్తుల పరిరక్షణకు తీసుకున్న చర్యలను తదుపరి విచారణలో తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ పంచాయతీకి ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయో గుర్తించి, డిస్ట్రిక్ట్ గెజిట్‌లో ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు పరిరక్షణ సమాఖ్య వేదిక అధ్యక్షుడు ఎస్. వీరవెంకట సత్యనారాయణ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఏలూరు శేష మహేశ్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ఏపీ గ్రామ పంచాయతీ (ఆస్తుల రక్షణ)-2011 నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీల ఆస్తులను గుర్తించి డిస్ట్రిక్ట్ గెజిట్‌లో ప్రచురించాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు. చట్టనిబంధనలను కోర్టు ముందు ఉంచారు. పంచాయతీ ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. గెజిట్ ప్రచురణ ద్వారా ఆక్రమణదారుల నుంచి ఆస్తులు కాపాడవచ్చని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం ఆస్తుల పరిరక్షణకు తీసుకున్న చర్యలను తదుపరి విచారణలో తమ ముందు ఉంచాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు స్పష్టం చేసింది.