Bill Gates Foundation: ఏపీకి బాసటగా గేట్స్ ఫౌండేషన్
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:02 AM
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశ్వవ్యాప్తంగా కొత్త శకానికి నాందిపలికిన బిల్ గేట్స్.. ఇప్పుడు కృత్రిమ మేధతో కీలకరంగాల్లో ప్రభుత్వాలకు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు.

ఐదు కీలక రంగాల్లో సహకారం
రేపు ఢిల్లీలో బిల్ గేట్స్, చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు
ఆరోగ్యం, విద్య, పరిపాలన, వ్యవసాయం, ఏఐపై ఒప్పందాలు
మెడ్‌టెక్ జోన్‌తో కలసి సమర్థంగా టెలీ మెడిసిన్
సాగుకు సాంకేతిక సాయం.. ఉపాధికి టెక్నాలజీ సహకారం
ముఖ్యమైన కార్యక్రమాలతో ముందుకొచ్చిన గేట్స్ ఫౌండేషన్
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశ్వవ్యాప్తంగా కొత్త శకానికి నాందిపలికిన బిల్ గేట్స్.. ఇప్పుడు కృత్రిమ మేధతో కీలకరంగాల్లో ప్రభుత్వాలకు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయం, ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం వంటి రంగాల్లో ప్రభుత్వాలకు తామందించే సహకారాన్ని గురించి వివరించేందుకు బిల్ గేట్స్ న్యూఢిల్లీకి వస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు. గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని అందిపుచ్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ సీఎం చంద్రబాబు కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో.. ఐదు కీలక రంగాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని తీసుకునేందుకు ఢిల్లీలో బుధవారం బిల్ గేట్స్, చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను చేసుకోనుంది. ఈ ఒప్పందాల ద్వారా ఆరోగ్యం, విద్యారంగం, పరిపాలన, వ్యవసాయం, ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ టెక్నాలజీపై అవగాహన కార్యక్రమాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుంది. వీటితో పాటు మరిన్ని అంశాల్లోనూ, కీలక రంగాల్లోనూ సాంకేతిక సహకారాన్ని అందిస్తామని ఫౌండేషన్ పేర్కొంది.
హెల్త్ కేర్: డిజిటల్ హెల్త్ కమాండ్ అండ్ కో ఆర్డినేషన్ సెంటర్ ద్వారా కేంద్రీకృత, సమీకృత హెల్త్ డేటా ప్లాట్‌ఫాంను, కృత్రిమమేధ ఆధారిత చికిత్సలను, సమర్థవంతమైన వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) ద్వారా అందిస్తారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇప్పటిదాకా సేకరించిన వ్యక్తిగత ఆరోగ్య డేటాతో క్రోడీకరిస్తారు. డిజిటల్ అమలు వ్యూహాలను వినియోగిస్తారు. ఏపీ మెడ్‌టెక్ జోన్‌తో కలసి టెలీ మెడిసిన్ వేదికలను మరింత సమర్థవంతంగా అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకరిస్తుంది. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. క్షయవ్యాధి వంటివాటి నివారణకు ప్రత్యేక సాంకేతిక, వైద్య సహకారాన్ని ఫౌండేషన్ సమకూరుస్తుంది.
విద్యారంగం: నేర్చుకునే తత్వాన్ని, పాఠ్యాంశాల్లో కుతూహలాన్ని విద్యార్థుల్లో పెంచేలా సాంకేతికపరమైన సహకారాన్ని అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత విద్యావిధానాలు, బోధనాంశాలను కృత్రిమ మేధ సహకారంతో బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యను నేర్చుకునే విధానాలు, బోధనా అంశాలను సమకూర్చుతుంది.
పరిపాలన: రాష్ట్ర వ్యాప్తంగా డేటా లేక్ అభివృద్ధి కోసం సాంకేతిక సహకారాన్ని బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తుంది. రాష్ట్రంలో కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ సంక్షేమాన్ని అందించే అత్యాధునిక విధానాలు అమలు చేస్తుంది.
వ్యవసాయం, గ్రామీణ జీవన వైవిధ్యం: వ్యవసాయం, గ్రామీణ జీవన వైవిధ్యంలోనూ బిల్‌గేట్స్ ఫౌండేషన్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. వ్యవసాయంలో డిజిటల్ విధానాలు, కృత్రిమ మేధ సహకారాన్ని అందిస్తుంది. సాంకేతిక నైపుణ్యాలపై రైతులు అవగాహన పెంచుకుని వ్యవసాయంలో అభివృద్ధిని సాధించేలా చూసు ్తంది. అత్యధిక దిగుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన సాంకేతిక పద్ధతులను సూచిస్తుంది. ఉపగ్రహ ఆఽధారిత వ్యవసాయ విధానాలకోసం ఏపీ స్పేస్ అప్లికేషన్స్ శాటిలైట్ సిస్టమ్స్‌ను ప్రారంభిస్తామని బిల్‌గేట్స్ ఫౌండేషన్ వెల్లడించింది.
ఉద్యోగ కల్పన.. ఏఐ టెక్నాలజీ: మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించేలా ప్రభుత్వ ఉద్యోగులకు బిల్ గేట్స్ ఫౌండేషన్ అవగాహన కల్పిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది.