ఆచరణలోనూ ‘సేవా’లాల్!
ABN , First Publish Date - 2023-02-15T01:02:09+05:30 IST
ఈ సృష్టిలో రోజుకు ఎందరో పుడుతుంటారు, గిడుతుంటారు. కొందరు మాత్రమే మహనీయులుగా, అవతారపురుషులుగా, ఆరాధ్య దైవాలుగా చరిత్ర పుటల్లో నిలుస్తారు...

ఈ సృష్టిలో రోజుకు ఎందరో పుడుతుంటారు, గిడుతుంటారు. కొందరు మాత్రమే మహనీయులుగా, అవతారపురుషులుగా, ఆరాధ్య దైవాలుగా చరిత్ర పుటల్లో నిలుస్తారు. ఆ కోవకు చెందిన మహనీయుడే సేవాలాల్ మహారాజ్. ప్రజల శ్రేయస్సును కోరుకుంటూ, స్వశక్తితో జీవించే మార్గాన్ని చూపిస్తూ, తండా ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలను, సాంఘిక దురాచారాలను పారద్రోలి, నిరక్షరాస్యతను, ఆర్థిక అసమానత్వాన్ని రూపుమాపడానికి అనేక సంస్కరణలు చేపట్టి, బంజారా సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సేవాలాల్. తన పేరులోని సేవాభావాన్ని ఆచరణలో చూపించాడు. అందుకే నేడు వారిని ఆదర్శంగా తీసుకొని బంజారా సమాజం ఐక్యమత్యంగా ముందుకు సాగుతోంది.
సమస్త జీవకోటికి మాతృరూపమైన అమ్మ భవాని గురించి చెబుతూ ‘అమ్మను పూజించాలి కానీ ఫలితం ఆశించవద్దు’ అని బంజారాలకు బోధించాడు సేవాలాల్ మహారాజ్. అహింస పాపమని, మత్తు ధూమపానం శాపమని హితవు పలికాడు. నాటి బంజారా సమాజం వ్యాపారం నిమిత్తం యుద్ధ సామాగ్రులు, ముడి సరుకులను తరలించడం కోసం స్థిర నివాసం లేకుండా దేశవ్యాప్తంగా సంచార జీవనం సాగిస్తూ ఉండేది. ఆ క్రమంలో బ్రిటిష్ పాలకుల మత ప్రచారం వల్ల బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయింది. జాతి యావత్తూ అంధకారంలో ఉన్న ఈ పరిస్థితుల్లో సేవాలాల్ మహరాజ్ అనేక సంస్కరణల ద్వారా బంజారాలను చైతన్యపరిచాడు. అభివృద్ధి బాటలో నడిపించాడు.
బంజారా తండాలో పరిస్థితులు అస్తవ్యస్తమైనప్పుడు తండా ప్రజలందరూ కలిసి మా బంజారా జాతిని ఐక్యం చేసి ఒక తాటిపై తీసుకువచ్చే మహానుభావుడు జన్మించేలా వరం ఇవ్వమని స్వాత్ భవానీలను వేడుకుంటారు. స్వాత్ భవానీలు బంజారా ప్రజల కోరిక మేరకు ఆ వరం ఇస్తారు. సంతానం లేక తపస్సు చేస్తున్న ధర్మనీ, భీమానాయక్ దంపతులకు వరప్రసాదంగా 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్ జిల్లా రాంజీ నాయక్ తండాలో సేవాలాల్ జన్మించాడు. సేవాలాల్ పెరిగిన తర్వాత మేరమ్మగా పిలవబడే జగదాంబ ఆయనకు ప్రత్యక్షమైంది. అమ్మవారి అనుగ్రహంతో శక్తి మహిమలను ప్రసాదిస్తూ సేవాలాల్ జీవించాడు. సేవాలాల్ అనేక అద్భుతమైన మహిమలను ప్రదర్శించారని ఎన్నో కథనాలు ఉన్నాయి. పురుషుడిని స్త్రీగా మార్చడం, ఒక ముంత బియ్యంతో వందమందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని మూడు నెలల తర్వాత బతికించడం, విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీర్యం చేయడం, వాగులో నీటి ప్రవాహాన్ని ఆపి తండా ప్రజలను ఆవులను దాటించడం, ఆయనకు అపకీర్తి తేవాలని ప్రయత్నించిన వారి కుట్రలను పటాపంచలు చేయడం... ఇలా ఆయన ప్రదర్శించిన మహిమలు ఎన్నో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి పండుగను ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం బంజారాల ఆత్మగౌరవానికి లభించిన గుర్తింపుగా భావించవచ్చు. దేశ వ్యాప్తంగా సుమారు 20 కోట్ల జనాభా ఉన్న బంజారాలకు ఆధ్యాత్మిక గురువైన సేవాలాల్ జయంతిని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా చేపట్టడం ప్రతి ఒక్క బంజారాకు గర్వకారణం. దీన్ని ఆదర్శంగా తీసుకున్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడిప్పుడే సేవాలాల్ జయంతిని అధికారికంగా చేపట్టేందుకు శ్రీకారం చుట్టాయి. సేవాలాల్ చూపిన బాటలో పయనించి తండాల్లో ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అన్ని రంగాల్లోనూ రాణించాలి. యువత తమ తండాలకు తామే కథానాయకులుగా మారాలి. తమ భాషా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ జాతి ఐక్యత కోసం పాటుపడాలి. సేవాలాల్ చూపిన మార్గంలో అందరూ భాగస్వాములై ఆయన 284వ జయంతి మహా భోగ్ బండరో కార్యక్రమాన్ని నిర్వహించాలి. బంజారాల సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటే విధంగా జయంతి పండుగను జరుపుకోవాలి.
గుగులోతు శంకర్ నాయక్
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్
(నేడు సంత్ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి)