ఇష్టం లేనంత ఇష్టం...
ABN , First Publish Date - 2023-10-28T04:42:34+05:30 IST
అవును. సూర్యకాంతం అంటే నాకు ఇష్టం లేదు. పైగా కోపం కూడా. నా భార్యను నానా ఇబ్బందులు (సినిమాల్లోనే సుమా) పెడుతూంటే చూసే భాగ్యం లేకుండా ఆమె కడుపున జన్మించే అవకాశం...
అవును. సూర్యకాంతం అంటే నాకు ఇష్టం లేదు. పైగా కోపం కూడా. నా భార్యను నానా ఇబ్బందులు (సినిమాల్లోనే సుమా) పెడుతూంటే చూసే భాగ్యం లేకుండా ఆమె కడుపున జన్మించే అవకాశం ఇవ్వనందుకు సూర్యకాంతం అంటే నాకు ఇష్టం లేదు. ప్రపంచానికి వెలుగులు పంచే ఆ పేరు నా కూతురుకి పెట్టుకోకుండా ఆమె ఒక్కరికే సార్ధకం చేసుకున్నందుకు కూడా సూర్యకాంతం అంటే ఇష్టం లేదు. ఆ మహాతల్లి స్వహస్తాలతో చేసిన పులిహోరని మంచింగ్‌లా నంజుకునే అదృష్టం ఇవ్వనందుకు కూడా సూర్యకాంతం అంటే నాకు అస్సలంటే అస్సలు ఇష్టం లేదు. సూర్యకాంతం చేతి పులిహోర రుచిని ఊరించి ఊరించి చెప్పిన మహాదర్శకుడు బాపుని చూసి చచ్చేంత ఈర్ష్యపడడాన్ని మిగిల్చిన ఆ మహాతల్లి అంటే నాకు కోపం.
సూర్యకాంతం అంటే నాకు చచ్చేంత ఇష్టం. ‘ఈ లోకంలో నేను కొన్నాళ్లు ఉంటా... నా కోసం నువ్వు మరణిస్తావా’ అని ఆ తల్లి అడిగితే వేల మంది మరణశయ్యలపై చిరునవ్వుతో పడుకునేవారు. ఆమె అలా అడగరు. ‘నే లేకున్నా... అందరూ బాగుండాలి’ అనుకునే మనిషి కదా, అందుకే కొన్ని పాత్రల్ని మనకి మిగిల్చి వెళ్లిపోయారు. ఈ మధ్య ఆటోల వెనుక చూస్తున్నాం ‘అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి’– ఈ వాక్యం సూర్యకాంతం నుంచే పుట్టిందేమో!
‘మంచి నీళ్లు... మంచినీళ్లు... ఇంత ముద్ద ముందు పడేస్తారు. మంచినీళ్లు ఇవ్వరు... ఇదిగో నిన్నే మంచినీళ్లు... అమ్మ కోడళ్లో.. అమ్మ కోడళ్లో’ అంటూ తెలుగు వారి గుండెల్లో గోరంతదీపాన్ని చిరస్థాయిగా వెలిగించుకున్న మహా ఇల్లాలు సూర్యకాంతం. ‘కోనసీమ కొబ్బరికి పెసిద్దయితే మన వొటేలు కొబ్బరిపచ్చడికి పెసిద్దనుకో’ అంటూ గాజుల కిట్టయ్య సినిమాలో వినాయక కాఫీ– భోజన విడిది యజమాని వియ్యాల వీరమ్మ పాత్రలో సూర్యకాంతం వడ్డనలో భోజనం చేయడం సూపర్ స్టార్ కృష్ణ చేసుకున్న అదృష్టం. కనీసం ఆ సినిమాలో అన్నపూర్ణలా అందరికీ ప్రేమగా వడ్డించే సూర్యకాంతాన్ని చూడడం తెలుగు ప్రేక్షకులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం.
మాయాబజార్ సినిమాలో హిడింబి పాత్రలో సూర్యకాంతం... సుభద్ర పాత్రలో ఉన్న రుష్యేంద్రమణితో ‘ఐశ్వర్యాలు పోతే మాత్రం ప్రతాపాలు ఎక్కడకి పోతాయి’ అని అంటారు. మనం ఈ మాటని ‘సూర్యకాంతం లేకపోతే మాత్రం ఆవిడ పాత్రలు ఎక్కడికి పోతాయి’ అనుకోకుండా ఉండగలమా!? బాపు గారి ‘అందాల రాముడు’ సినిమాలో ‘అప్పు ఇవ్వను అరువిస్తాను’ అన్న అమాయకపు సూర్యకాంతమే, పాలకోసం వచ్చిన పిల్లాడ్ని నాగభూషణం పీఏ మిక్కిలినేని గోదారిలో తోసేసిన తర్వాత ‘ఓరి నీ జిమ్మడిపోను. నువ్వు మనిషివా పశువ్వా.. కడుపుకి వన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా.. మా పిల్లాడికేవైనా అయ్యిందా... పానాలు తీసేస్తాను’ అంటూ తొడగొట్టిన సూర్యకాంతం ఒక్కరేనా అని అనుమానం కలగకపోతే మనకి సినిమా చూడడం రానట్లే.
‘కట్నం ఇవ్వలేని అబ్బ... కూతురికి కాస్త వంట వండడమేనా నేర్పద్దూ’ అంటూ కంచం ముందు కూర్చుని చేతులు ఆడిస్తూ కోపావేశాలను ఏకకాలంలో పండించిన నటి ఒక్క సూర్యకాంతమే అనిపిస్తుంది వరకట్నం సినిమా చూస్తే. ఈ సీన్‌లోనే, పక్కనే ఉన్న గిన్నెలోంచి రెండు అరచేతుల అన్నాన్ని కంచంలో పెట్టుకున్న తర్వాత చేతిలో పోసిన చారుని తాగుతూ ‘ఎంత బాగుందో’ అనిపించినట్లుగా ముఖంలో మూడంటే మూడే సెకన్లు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం ఇలాతలంలో ఆవిడకు తప్ప ఎవరికి సాధ్యం?
తోడికోడళ్లు సినిమా చూసొచ్చిన మా అమ్మ పక్కింటావిడతో ‘ఆ సూర్యకాంతం లాంటి తోటికోడలున్న ఇంటికి మా అమ్మాయిని ఇవ్వనుగాక ఇవ్వను. పెళ్లి మాట దేవుడెరుగు. కలో గంజో మాతోనే తింటుంది’ అన్న భయం చూశాక, సినిమా ప్రభావం ఎంతుంటుందో నాకు తెలిసొచ్చింది. మహిళలు కోపంగా ఉన్నప్పుడు వంటింట్లో కూరలు ఎలా తరుగుతారో తెలియాలంటే గంగ– మంగ చూడాలి. ఆ సినిమాలో వాణిశ్రీ మీద కోపంతో సూర్యకాంతం కూరలు తరగడం, పళ్లాన్ని విసిరికొట్టడం రాయడం కాదు... చూసి తీరాలి.
ఇదంతా సూర్యకాంతం తెర మీద పండించిన నటన. నిజ జీవితంలో సూర్యకాంతం గారిని తెలిసిన వారంతా దేవత అనే అంటారు. నాకు పరిచయం ఉండి... గతంలో సూర్యకాంతం గారిని బాగా దగ్గరగా చూసిన వారు కూడా ఇదే మాట చెప్పారు నాతో. సినీ వ్యాపకం కాకుండా సూర్యకాంతం చాలా పనులు చేసేవారు. బహుశా ఖాళీగా కాలం వెళ్లదీయడం ఇష్టం లేకపోవడమే కావచ్చు. ఆ వ్యాపకాల్లో ఒకటి వడ్డీ వ్యాపారం. ఇది జలగలా రక్తం పీల్చే వడ్డీ వ్యాపారుల్లాంటిది కాదు. సూర్యకాంతంగారి వడ్డీ వ్యాపారం అంటే, ఓ కుటుంబాన్నో, చిత్ర నిర్మాణసంస్ధనో, లేదూ ఓ నిర్మాత బరువునో కాసింత మోయడం. ఓ సంఘటన... ఓ పెద్దాయన చెప్పగా నా చెవిన పడింది. బాపు, రమణలకు సూర్యకాంతం ఓ చిత్రానికి డబ్బు అప్పిచ్చారట. అయితే, ఆ అప్పుకి సాధారణంగా తీసుకునే వడ్డీ కాకుండా కాసింత ఎక్కువ చెప్పి మరీ ఇచ్చారట. అనుకున్న ప్రకారం ప్రతీ నెలా కొంత వడ్డీతోనే అసల్ని కలిపి పంపేసేవారట బాపు రమణలు. కొన్ని నెలల తర్వాత ఎప్పటిలాగే వాయిదా డబ్బులు తీసుకుని ఈ పెద్దాయన సూర్యకాంతం ఇంటికి వెళ్ళారు. కాఫీ తర్వాత ఆ కబుర్లు, ఈ కబుర్లు అయ్యాక, డబ్బులు తీసుకువెళ్లినాయన ‘అమ్మా... రమణ గారు వాయిదా డబ్బులు పంపించారు’ అని జేబులోంచి డబ్బు తీసి ఆవిడకి ఇవ్వబోయారు.
దానికి జవాబుగా సూర్యకాంతంగారు ‘ఇదిగో అబ్బాయి, వాళ్ల బాకీ ఇంతకు ముందు నెలలోనే తీరింది. ఆ రమణ, బాపు ఇద్దరికి కాసింత బాధ్యత నేర్పిద్దామని ఎక్కువ వడ్డీ చెప్పాను. ఈ డబ్బులు వాళ్లకి ఇచ్చేసి ఇక ముందు కూడా ఇలాగే బాధ్యతగా ఉండమన్నానని చెప్పండి’ అన్నారట. ఇదీ సూర్యకాంతం నిజాయితీ, ఎదుటి వారి పట్ల చూపించే అనురాగం.
ఇక రెండోది, విదేశాల నుంచి చాలా మంచి మేకప్ సామాన్లను తెప్పించి ఇక్కడి నటీనటులకు అమ్మడం. ఇందులో కూడా లాభాపేక్ష కంటే, తోటి నటీనటులు వాడే మేకప్ వల్ల గ్లామరస్ ప్రపంచంలో ఉన్న వారి అందం ఎక్కడ పాడవుతుందో అనే స్పృహే ఎక్కువ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వాడే మేకప్ సామగ్రిలో ఎక్కువ భాగం సూర్యకాంతం దగ్గర కొన్నవే. సూర్యకాంతం స్వర్గస్తులయ్యారని తెలియగానే ముఖ్యమంత్రి హోదాలోనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు జయలలిత.
మహాకవి కాళిదాసు కావ్యధర్మం గురించి చెబుతూ ముగింపు ఎలా ఉండబోతోందో ముందే కాసింత తెలిసేలా చేయాలి అంటారు. పాఠకుడో, ప్రేక్షకుడో, వీక్షకుడో... చూస్తున్న, చదువుతున్న, వింటున్న అంశంలోకి ప్రవేశించగానే ముగింపు గురించి ఓ ఆలోచనలో ఉండాలని కాళిదాసు భాష్యం. ఇది నటీనటులకు కూడా వర్తిస్తుంది. అందుకే చాప్లిన్ సినిమాలు నవ్విస్తూ ఏడిపిస్తాయి. ఏడిపిస్తూ నవ్విస్తాయి. ఉత్తరం వాడైన రాజ్‌కపూర్ కూడా అంతే. వీళ్లే కాదు మన సూర్యకాంతం కూడా ఇంతే. తెర మీద ఆమె నటన చూసిన వారికి కోపం తెప్పిస్తుంది. ఆ గయ్యాళితనాన్ని చూసిన రెండు కళ్లూ తెరపై ఉన్న మరో పాత్రని చూసి కన్నీరు కారుస్తాయి. ఆ పాత్ర పట్ల సానుభూతిని కలిగిస్తాయి.
చివరిగా ఓ మాట. ప్రభుత్వం ఏటా ఇచ్చే పద్మ అవార్డులు తీసుకున్న నటీనటులెందరో ఉన్నారు. వారందరికీ వందేళ్లు దాటుతాయి కానీ శత జయంతులు ఉండవు. అసలు సిసలు నాటు నటనతో మెప్పించిన సూర్యకాంతం గారికి మూడు వందల ఎనభై ఒకటో, పద్నాలుగు వందల ఇరవైరెండో ఆస్కార్‌లు రావాలి. అయినా, అనుకుంటాం కాని.... తెరమీద నటిస్తున్నాం అని కాకుండా ఇంట్లో ఉన్నాం అనుకుని పాత్రలో లీనం కావడం, ఇతరులను ప్రేమించడం, అభిమానించడం, కడుపుకి ఇంత వండి పెట్టడమే తెలిసిన సూర్యకాంతం గారికి లాబీయింగ్ ఏముంటుంది, అవార్డులు ఎందుకొస్తాయి? ఇదిగో ఇలా శత జయంతులు జరుగుతాయి. టీవీలో సూర్యకాంతం ఉన్న సీన్ కనపడగానే కళ్లు అతుక్కుపోతాయి. అవునూ.... ఇలా కళ్లు అతుక్కుపోవడాన్ని ఎన్ని పద్మాలు, ఆస్కారులతో కొలుస్తాం? కోడళ్ళూ... మీరు దురదృష్టవంతులు. సూర్యకాంతంలాంటి అత్తగారు లేకపోవడం మీరంతా ఏ జన్మలోనో చేసుకున్న పాప ఫలితం!
l ముక్కామల చక్రధర్
సీనియర్ జర్నలిస్టు
(నేడు సూర్యకాంతం శతజయంతి)