అవినీతి చుట్టూ రాజకీయ కౌటిల్యం

ABN , First Publish Date - 2023-09-27T01:58:05+05:30 IST

యూపీఏ సర్కార్‌ను అట్టుడికించిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అప్పటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ నివేదిక ఇచ్చారు...

అవినీతి చుట్టూ రాజకీయ కౌటిల్యం

యూపీఏ సర్కార్‌ను అట్టుడికించిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అప్పటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ నివేదిక ఇచ్చారు. అయితే తనపై ఒత్తిడి తెచ్చి లక్షల కోట్ల నష్టం వచ్చినట్లుగా చెప్పమన్నారని స్పెక్ట్రమ్ లావాదేవీల లెక్కల్ని ఆడిట్ చేసిన బృందానికి నాయకత్వం వహించిన ఆర్‌పి సింగ్ చెప్పారు. చివరకు అసలు కుంభకోణమే లేదని, ప్రభుత్వ కోశానికి నష్టం సంభవించలేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ నిర్వహించిన దర్యాప్తు తేల్చి చెప్పింది. ‘కొందరు వ్యక్తులు కొన్ని సత్యాలను కళాత్మకంగా ఒక చోట చేర్చి మనం గుర్తించలేనంతగా ఖగోళ స్థాయిలో విషయాలను తీవ్రంగా వక్రీకరించారు’ అని 2017 డిసెంబర్ 21న న్యూఢిల్లీలోని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. డిఎంకే నేతలు రాజా, కనిమొళితో పాటు మొత్తం 28 మంది నిందితులను విడుదల చేయమని ఆదేశించింది. అయితే అప్పటికే ఈ కుంభకోణాలపై ప్రచార హోరు వల్ల ప్రయోజనం పొందిన బీజేపీ, నరేంద్రమోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. వినోద్ రాయ్‌కు మోదీ సర్కార్ అనేక పదవులతో పాటు పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించింది.

దేశ రాజకీయాల లోతుల గురించి తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదంతాన్ని అర్థం చేసుకుంటే చాలు. మనకు పైకి కనపడే అవినీతి కుంభకోణాల వెనుక అనేక రాజకీయ పన్నాగాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అవినీతిని ఎవరూ సమర్థించబోరు. మోదీ సారథ్యంలోని బీజేపీ అవినీతిని ఒక అంశంగా మార్చి విజయం సాధించేందుకు కాంగ్రెస్ తప్పిదాలే కారణం కావచ్చు. అయితే అదే సమయంలో ఒక అవినీతి గురించి న్యాయస్థానాలు తేల్చే లోపు వ్యక్తులకు, వ్యవస్థలకు తీరని నష్టం జరుగుతుందన్న విషయంలో సందేహం లేదు. అంతే కాదు, రాజకీయ పన్నాగాలను బట్టి ఏ నేత అవినీతి అయినా బయటపడుతుందని, అస్మదీయులైన తర్వాత అదే నేత అవినీతి తెర మరుగున పడుతుందని కూడా అనేక సందర్భాల్లో రుజువైంది. ఈ దేశంలో రాజకీయ నాయకుల అవినీతిని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు నిష్పక్షపాతంగా శోధించి, విచారించి సమన్యాయం పాటించిన దాఖలాలు లేవు.

‘పంజరంలో చిలుక’ అని సిబిఐ గురించి యూపీఏ హయాంలోనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 1990 దశకంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన దేవెగౌడను ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాలని లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. కినుక వహించిన దేవెగౌడ, లాలూను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా అప్పటి సిబిఐ డైరెక్టర్ జోగీందర్ సింగ్‌పై ఒత్తిడి చేశారని వార్తలు వచ్చాయి. ఈ విషయమై తాను దేవెగౌడను నిలదీస్తే ఆయన కన్నీరు పెట్టుకుని తన తప్పు ఒప్పుకున్నారని లాలూ స్వయంగా చెప్పుకున్నారు. దేవెగౌడ తర్వాత ప్రధాని అయిన గుజ్రాల్, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం తనను సిబిఐ నుంచి తప్పించి హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారని జోగీందర్ సింగ్ తర్వాత ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేస్తాయో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు.

యూపీఏ ప్రభుత్వాల హయాంలో అవినీతి కుంభకోణాల ఆధారంగా 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా దర్యాప్తు ఏజెన్సీలను ఉపయోగించుకుని ప్రాంతీయ పార్టీలను అంతం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలున్నాయి. 2014లో జాతీయ స్థాయిలో మోదీ ప్రభంజనం వీచినప్పటికీ ప్రాంతీయ పార్టీలు ఆ ప్రభంజనాన్ని తట్టుకున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఢిల్లీ, బిహార్‌లలో బీజేపీ పరాజయం చెందింది. ముఖ్యంగా రాష్ట్రీయ జనతాదళ్ బిహార్‌లో, జనతాదళ్ (యు), కాంగ్రెస్ కలిసి 243 సీట్లలో 178 సీట్లు గెలిచిన తర్వాత బీజేపీ హతాశురాలైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి వచ్చిన ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో 5 శాతం మేరకు తగ్గిపోయాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ ఆ తర్వాత జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం స్పష్టంగా కనపడింది. ఎన్ని కేసులు మోపినా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని, ఢిల్లీలో ఆప్‌ను తుదముట్టించడం సాధ్యం కాదని తేలింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా తో పాటు అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ప్రతిబంధకంగా మారాయి.

ఈ విషయం గ్రహించినందువల్లే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలంటే ‘విభజించి పాలించు’ వ్యూహాన్ని లేదా ఒకరి వేలుతో మరొకరి కన్నును పొడిచే పద్ధతిని బీజేపీ అవలంబించింది. బిహార్‌లో తొలుత రాష్ట్రీయ జనతాదళ్ కథ ముగిస్తే లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత ఆ పార్టీ అంతం అవుతుందని, యాదవులు తమకే మద్దతిస్తారని బీజేపీ భావించింది. అందుకే జనతాదళ్ (యు)తో పొత్తు ఏర్పర్చుకుని నితీశీ కుమార్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో మాయావతిపై ఉన్న కేసుల ఆధారంగా ఆ పార్టీని నిర్వీర్యపరిచింది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్‌పి గత ఎన్నికల్లో కంటే 9.5 శాతం ఓట్లను కోల్పోయింది. బిఎస్‌పి మూలంగానే బీజేపీ, ఎస్‌పి కంటే 47 సీట్లు అధికంగా గెలిచేందుకు కారణమైంది. మహారాష్ట్రలో తొలుత ఎన్‌సిపిని చీల్చే ప్రయత్నం చేసిన బీజేపీ విఫలమైంది. తర్వాత శివసేనపై దృష్టి కేంద్రీకరించి, ఎన్‌సిపిని చీల్చడంలో సఫలమయింది. ఇందుకు ఈడీ, సిబిఐలు దోహదం చేశాయనడంలో సందేహం లేదు. ఎన్‌సిపి నేతల్లో అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్‌తో సహా అనేకమందిపై ఈడీ ఉచ్చు బిగించినందుకే వారు బీజేపీతో చేతులు కలిపారు. సంజయ్ రౌత్‌తో సహా ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన అనేక మందిపై ఆర్థిక నేరాలు దాఖలయ్యాయి. కర్ణాటకలో కూడా 2018లో జనతాదళ్ (ఎస్) నేతలపై ఆదాయ పన్ను కేసులు దాఖలు చేసి ఆ పార్టీని బలహీనపరిచే చర్యలు చేపట్టింది.


ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలను కూడా ఇదే జాతీయ దృష్టితో మనం అర్థం చేసుకోవాలి. కూపస్థమండూకాల్లా సంకుచిత దృష్టితో వ్యాఖ్యానించాల్సిన పరిణామాలు కావివి. 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి తప్పుకోవడంతో జగన్ నేతృత్వంలోని వైసీపీని గెలిపించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. ఆ తరువాత వైసీపీతో అవగాహన ఏర్పర్చుకుని జగన్ బలహీనం కాకుండా కాపాడుతూ వస్తోంది. ఒకప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆగ్రహం తెప్పించకపోతే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రిపై సిబిఐ, ఈడీ 17 ఛార్జిషీట్లు దాఖలు చేయగలిగేవి కాదని, ఆయన జైలు పాలయ్యేవారు కాదని, కనీసం ఆయనపై అవినీతి ఆరోపణల గురించి ప్రజలకు తెలిసేది కాదన్న విషయం ఎంత వాస్తవమో, గత నాలుగున్నర ఏళ్ల నుంచీ అదే సిబిఐ జగన్‌ను తాకలేకపోవడం, వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆయన బంధువు అవినాశ్ రెడ్డిని ముట్టుకోలేకపోవడం కూడా అంతే వాస్తవం. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబును ఏమీ చేయలేని జగన్ చివరకు అతి చిన్న కేసులో ఆయనను ముద్దాయిగా మార్చి జైలు పాలు చేయగలిగేందుకు కూడా మోదీ ఇచ్చిన ధైర్యమే కారణమని అత్యధికులు భావించడంలో ఆశ్చర్యం లేదు. ఇవన్నీ రానున్న సార్వత్రక ఎన్నికలకు ముందు ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయడమో, లేక తమ భావి ప్రణాళికలకు అనుగుణంగా దాసోహం చేసుకోవడమో లక్ష్యంగా మోదీ– షాలు పన్నిన వ్యూహరచనలో భాగమని చేసే విశ్లేషణ కూడా తిరస్కరించదగింది కాదు.

‘భవిష్యత్తులో ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు అనేవే ఉండవు. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతీయ పార్టీలను దేశ చిత్రపటం నుంచి నిర్మూలిస్తాం. ఏ పార్టీ మా ముందు నిలదొక్కుకోలేదు’ అని కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పార్టీ అనుబంధ సంస్థల సంయుక్త జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ చేసిన ప్రకటనను ఈ నేపథ్యంలో గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ‘ప్రాంతీయ పార్టీలనే కాదు, బీజేపీ మినహా అన్ని పార్టీలను నాశనం చేస్తాము. కేవలం సైద్ధాంతిక ఆధారిత బీజేపీయే మనుగడలో ఉంటుంది. కుటుంబ పార్టీలు మటుమాయమవుతాయి..’ అని కూడా ఆయన మరో సందర్భంలో చెప్పారు.

2024 సార్వత్రక ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కేంద్రంలో అధికార స్థాపనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిసినందువల్లే ఆ పార్టీలను నిర్మూలించేందుకు, అదుపులో పెట్టుకునేందుకు బీజేపీ పన్నాగాలు పన్నుతుందనడంలో సందేహం లేదు. అయితే ప్రాంతీయ పార్టీలను నిర్మూలించడం బీజేపీకి సాధ్యమవుతుందా? బిహార్‌లో నితీశ్ కుమార్ ఆ పార్టీ ప్రయత్నాలకు తన మహాకూటమి ద్వారా గండి కొట్టారు. మహారాష్ట్రలో ఎన్ని చేసినా ఎన్‌సిపి, శివసేన, కాంగ్రెస్‌ను పూర్తిగా దెబ్బతీయడం బీజేపీకి సాధ్యం కాకపోవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి ఓటు బ్యాంకులో సగానికి పైగా అఖిలేశ్‌కు బదిలీ అయిన సూచనలు కనపడుతున్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేయాలని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ పార్టీ ఇండియా కూటమికి అంత సన్నిహితంగా మారుతోంది. ఇండియా కూటమి రోజురోజుకూ మరింత సంఘటితమవుతున్నట్లు వార్తలు వస్తుండగా ఎన్డీఏలోని పార్టీలు డోలాయమాన స్థితిలో కనపడుతున్నాయి. ఎన్డీఏతో కలిసి ఉంటే అకాలీదళ్, శివసేన మాదిరి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఆ పార్టీల్లో కనపడుతోంది. బీజేపీ ఔద్ధత్యం భరించలేని అన్నాడిఎంకే చివరిగా ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకున్నట్లు ప్రకటిస్తే కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకోవడంతో బీజేపీ పట్ల తమిళనాడులో ఎంత వ్యతిరేకత ఉన్నదో స్పష్టమవుతోంది.

రాజకీయ పోరాటంలో ప్రజల మధ్యకు వెళ్లి, తమ నిర్ణయాలు, పాలన ఆధారంగా ప్రజల తీర్పును కోరాల్సిన పార్టీలు కుత్సిత మార్గాల ద్వారా ఒకదాన్నొకటి హరించుకునే ప్రయత్నం చేస్తే తమను ఏదో ఒకరోజు తిమింగలమే కబళించే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నడ్డా అన్న మాటలు అక్షరాలా రుజువవుతాయి. ఇవాళ బీజేపీ తనకు అండగా ఉన్నదని భావిస్తే అది రేపు ‘ధృతరాష్ట్ర కౌగిలి’గా మారక తప్పదు. రానున్న రోజులు దేశంలోని బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు పరీక్షా సమయమే. ఈ ప్రతికూల పరిస్థితిని అధిగమించేందుకు మరో కొద్ది నెలలు అవి ధైర్యంగా, సాహసంతో పోరాడక తప్పదు. ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ అయినా, మరో పార్టీ అయినా ఒంటరి కాదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-09-27T01:58:05+05:30 IST