ఈ ఘటనలు ఏ వైఫల్యాలకు సంకేతం?
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:30 AM
ప్రతీదాన్నీ వ్యతిరేక దృక్పథంతో చూడడం సరైంది కాదని లోకమంతా పచ్చగా ఉన్నదని నమ్మేవారు అంటారు కాని కొన్ని దృశ్యాలు చూసినప్పుడు మనసు కలచివేస్తుంటే మాట్లాడకుండా....

ప్రతీదాన్నీ వ్యతిరేక దృక్పథంతో చూడడం సరైంది కాదని లోకమంతా పచ్చగా ఉన్నదని నమ్మేవారు అంటారు కాని కొన్ని దృశ్యాలు చూసినప్పుడు మనసు కలచివేస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండగలం? అమెరికా నుంచి వందలాది భారతీయులను పెడరెక్కలు విరిచి కట్టి జంతువుల్లా సైనిక విమానాల్లో పడవేసి వెనక్కు పంపుతున్న దృశ్యాలు గతంలో కోవిడ్ సమయంలో వేలాది కూలీలు నగరాలనుంచి తమ ఊళ్లకు మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లిన దృశ్యాలను తలపించడం లేదా? 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా వస్తుందని, ఫలానా రోజు మునిగితే ఇంకా పుణ్యం వస్తుందని ప్రభుత్వమే ప్రచారం చేస్తే తండోపతండాలుగా తరలి వచ్చిన ప్రజలు తొక్కిసలాటకు గురై మృత్యువాత పడ్డ దృశ్యాలను చూసి బాధపడకుండా ఎలా ఉండగలం? ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఒకసారి ప్లాట్ ఫారంపైకి జనం వచ్చేలా చేసి ఒకర్నొకరు తొక్కుకుని అయిదుగురు పిల్లలతో సహా 18 మంది మరణించడానికి ఎవరు బాధ్యులు? బిహార్‌లో కిక్కిరిసిన రైలులో ఎక్కలేమన్న ఆగ్రహంతో ఏసీ కోచ్‌ల కిటికీల అద్దాలను రాళ్లతో పగులగొట్టి మరీ చొచ్చుకువచ్చిన దుండగులకు ఏ నదిలో మునిగితే మాత్రం పాపవిమోచనం లభిస్తుంది?
ఈ దృశ్యాలన్నీ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకుంటున్న భారతదేశానికి శుభసూచకాలు మాత్రం కాదని చెప్పగలం. తమ స్వంతదేశం నుంచి అమెరికాకు పొట్ట చేత బట్టుకుని వచ్చిన లక్షలాది మందిలో భారతీయులు సంఖ్యరీత్యా అయిదవ స్థానంలో ఉంటారని మైగ్రేషన్ పాలసీ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. నలుగురు భారతీయుల్లో ఒకరికి సరైన పత్రాలు ఉండవని సెంటర్ ఫర్ మైగ్రేషన్ స్టడీస్ వంటి సంస్థలు చెబుతున్నాయి. స్వంత ఊళ్లో పనిదొరక్క వలస కూలీలు పట్టణాలకు వలస వచ్చినట్లే స్వంతదేశంలో పని దొరక్క ఏదో ఒక ఏజెంట్‌కు డబ్బులు ముట్టచెప్పి అమెరికాలాంటి దేశాలకు వెళుతున్నారంటే దానికి కారణం ఏమిటి? సముద్రాలు, కొండలు, కోనలు, అడవులు దాటి భార్యాపిల్లలతో పాటు మైళ్లకు మైళ్లు నడిచి దొంగ మార్గాల్లో భారతీయులు అమెరికాలో ప్రవేశించేందుకు ఎందుకు తహతహలాడుతున్నారు? మన దేశంలో వారు శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని పొంది హుందాగా జీవించేందుకు అవకాశాలు దొరకనందువల్లే కదా? మన నిరుద్యోగ సమస్యను మనం పరిష్కరించుకోలేక, అమెరికా మన వారిని అమానుషంగా పంపిస్తున్న తీరును బహిరంగంగా ఖండించలేక మన నేతలు సతమతమవుతున్నారు. ‘అక్రమంగా వెళ్లిన వారిని వెనక్కు తీసుకుంటాం, మనుషులను అక్రమంగా రవాణా చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటాం’ అని వినిపిస్తున్న అధికారిక స్వరాల్లో బలహీన నిస్సహాయత ప్రతిధ్వనిస్తోంది. ‘మావారిని వెనక్కు పంపండి కాని వారి పట్ల మానవత్వంతో వ్యవహరించండి..’ అని అమెరికాను అభ్యర్థించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్‌లో చెప్పిన తర్వాత కూడా అదే విధంగా చేతులకు గొలుసులతో, కాళ్లకు సంకెళ్లతో భారతీయులను వెనక్కు పంపారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాకు వెళ్లి కీలకమైన వ్యాపార, రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుని వచ్చారు. గతంలో హౌడీమోడీ, నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాల్లో తాను, ట్రంప్ దిగిన ఫోటోలను ఆల్బమ్‌గా తయారు చేసి కలిసికట్టుగా మన ప్రయాణం పేరుతో మోదీ బహూకరిస్తే, ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యు ఆర్ గ్రేట్’ అని ట్రంప్ ఆ ఆల్బమ్‌పై సంతకం చేశారు. భారత, అమెరికా దేశాల స్నేహ సంబంధాలు ఇలా పరిఢవిల్లుతున్న సమయంలో వలసవెళ్లిన వారి గురించి అపస్వరాలు ఎందుకు వినిపిస్తాయి?
నిజానికి అమెరికా అంటేనే వలసవచ్చిన వారి దేశం. ప్రపంచంలోని అన్ని దేశాలనుంచి వచ్చిన వారి కష్టంతో బలపడ్డ దేశం. అక్కడి పారిశ్రామికీకరణకు చెమటోడ్చిన వలస కూలీలు, వినూత్న ఆవిష్కరణలకు తోడ్పడిన వివిధ దేశాలకు చెందిన మేధావులకు కృతజ్ఞత ప్రకటించాల్సిన దేశం. గూగుల్, యాహూ, ఇన్‌స్టా గ్రామ్, హఫింగ్టన్ పోస్ట్ అనేక సంస్థల్ని వలసవచ్చిన వారే స్థాపించారు. సిలికాన్ వాలీలో వందల కోట్ల డాలర్ల స్టార్టప్ లను స్థాపించిన సగం మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారే. ప్రపంచీకరణ మూలంగా ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం, లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం వల్ల అందుకు వలసవచ్చినవారిని నిందిస్తున్నారు కాని రీగన్ హయాంలో పత్రాలు లేని వారికి కూడా చట్టపరమైన హోదా కల్పించి ఇముడ్చుకున్న దేశం అమెరికా. ‘Coalition for Humane Immigrant Rights of Los Angeles’ (చిర్లా) అనే సంస్థ అక్రమంగా వలస వచ్చిన వారికి డాక్యుమెంట్లను తయారు చేసి అమెరికాలో గౌరవంగా స్థిరపడేందుకు తోడ్పడింది. స్కూళ్లకు పిల్లల్ని పంపడానికి, డాక్టర్ల వద్దకు వెళ్లడానికీ భయపడ్డ అనేకమంది ప్రవాసులకు డెమొక్రాటిక్ పార్టీ అండగా నిలిచిన రోజులున్నాయి.
ఏ కారణాల వల్ల నైతేనేం, ఇవాళ పత్రాలు సరిగా లేవని అనేకమందిని వారి వారి స్వదేశాలకు పంపిస్తున్న అమెరికాలో నేర న్యాయవ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నదో బైడెన్ హయాంలో ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హరిస్ తన ఆత్మకథ ‘The Truths We Hold: An American Journey’లో వివరించారు. కొన్ని దశాబ్దాల పాటు అటార్నీగా పనిచేసిన ఆమె అమెరికా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ అంతటా వివక్ష తాండవిస్తోందని రాశారు. తప్పుచేసిన కారు డ్రైవర్లలో 85 శాతం నల్లవారే పోలీసుల చర్యలకు లోనవుతారని, జైలు పాలయే నేరస్థుల్లో తెల్లవారి కంటే నల్లవారే ఆరు శాతం ఎక్కువ మంది ఉంటారని, తెల్లవారి కంటే 20 శాతం ఎక్కువగా నల్లవారికి సుదీర్ఘకాలం శిక్ష పడుతుందని, బెయిల్ కోసం తెల్లవారి కంటే 35 శాతం ఎక్కువగా వారు చెల్లించాల్సి ఉంటుందని ఆమె వివరించారు. పోలీసుల క్రూరత్వానికి తెల్లవారి కంటే నల్లవారే బలవుతారని ఆమె చెప్పారు. ‘వీధుల్లో పెట్రోలింగ్ చేసే పోలీసులు తమను చితకబాదుతారని, కొట్టి చంపుతారని ఒక వర్గం ప్రజలు భయపడితే మనం స్వేచ్ఛా సమాజంలో జీవిస్తున్నట్లా? మన న్యాయవ్యవస్థలో పోలీసుల క్రూరత్వానికి తగినట్లు శిక్షలు లేకపోతే మనం ఏ సందేశం పంపుతున్నట్లు?’ అని ఆమె ప్రశ్నించారు. ఒక బ్యాక్‌పాక్ దొంగిలించినందుకు అరెస్టయి, బెయిల్ వచ్చేందుకు 3వేల డాలర్లు చెల్లించలేక, మూడేళ్ల పాటు జైలులో ఒంటరి నిర్బంధానికి గురైన బ్రౌడర్ అనే 16 ఏళ్ల యువకుడి ఉదంతాన్ని ఆమె తన ఆత్మకథలో వివరించారు. అమెరికాలో నగదుకు బెయిల్ ఇచ్చే పద్ధతి సంపన్నులకు అనుకూలంగా, పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్పారు. ‘పేదరికంలో ఉన్నందుకు ప్రజలను శిక్షించేది ఒక న్యాయమా?’ అని ఆమె ప్రశ్నించారు. 2000-–14 సంవత్సరాల మధ్య జైళ్లలో ఉన్న 95 శాతం మంది విచారణ కోసం ఎదురు చూస్తూ గడిపారని తెలిపారు. నిర్బంధితుల్లో మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, గర్భిణీ స్త్రీలను కూడా గొలుసులతో బంధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు తన ఆత్మకథను విడుదల చేసి పతితులు, అభాగ్యులపై కమలా హారిస్ ఎంత ఆవేదన వ్యక్తపరిచినా ఆమెను ప్రజలు అమెరికా అధ్యక్షురాలిగా ఎంపిక చేసుకోకపోవడం, ట్రంప్‌ను గెలిపించడం వివిధ దేశాల్లో మారుతున్న ప్రజల ఆలోచనా విధానానికి నిదర్శనం.
భారతదేశంలో ఎన్ని ఘోర ప్రమాదాలు జరిగినా బాధ్యతను స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం, మరణాలను యథాలాపంగా తీసుకోవడం సాధారణమైంది. 1956లో మహబూబ్‌నగర్, తమిళనాడులో జరిగిన ఘోర రైలు ప్రమాదాలకు బాధ్యత వహించి అప్పటి రైల్వే మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. తర్వాతి కాలంలో నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, సురేశ్ ప్రభు కూడా ఇదే విధంగా రైలు ప్రమాదాలకు బాధ్యత వహించి రాజీనామా చేశారు. పీవీ హయాంలో మాధవరావు సింధియా కూడా ఒక విమాన ప్రమాదానికి బాధ్యత వహించి పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని చెప్పి తప్పించుకుంటున్నారు. ఒకే పేరుతో ఉన్న రెండు రైళ్లు వచ్చాయని, అందువల్ల ప్రమాదం జరిగిందని ఢిల్లీ పోలీసులు అంటే, ఎవరో కుట్రలో భాగంగా పుకార్లు ప్రచారం చేసినందువల్లే ప్రమాదానికి దారి తీసిందని రైల్వే మంత్రి చెప్పారు. ఎవరో మెట్లపై నుంచి కాలు జారిపడ్డారని, ఆ తర్వాత జనం ఒకరిపై మరొకరు పడ్డారని రైల్వే అధికారులు తెలిపారు. ఎర్రటి టోపీలతో కొందరు వచ్చి పడుకున్నవారిని లేపారని వారు భయంతో పారిపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని మరో ప్రచారం వినబడింది.
కుంభమేళాకు వెళ్లే రైళ్లు ఆలస్యం కావడం, రాత్రి 7.30 గంటల నుంచే భారీగా స్టేషన్‌లో జన సమూహం పోగు కావడం, ఎటువంటి ఆలోచన లేకుండా గంటకు 1500 టిక్కెట్ల చొప్పున వేల కొద్ది టిక్కెట్లు కౌంటర్‌లో అమ్మడం, అకస్మాత్తుగా ప్లాట్ ఫారం మార్పు గురించి ప్రకటనలు జారీ చేయడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది. ఇదంతా స్పష్టంగా నిర్వహణ లోపమన్న విషయం స్పష్టం కావడం లేదా? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? బాధ్యత వహించి తప్పిదాన్ని అంగీకరించడానికి బదులు కుట్ర జరిగిందని చెప్పడం ఏ మానసిక స్థితికి నిదర్శనం? కేజ్రీవాల్ హయాంలో దేశ రాజధాని ఢిల్లీలో అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయని ప్రచారం చేసినవారు తమ అధీనంలో ఉండే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రజలు కుంభమేళాకు వెళ్లేందుకు సాఫీగా ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? కోట్లాది మంది వస్తున్నారని తెలిసినా ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాటను ఎందుకు నివారించలేకపోయారు?
సంకెళ్లతో భారతీయులను అమెరికా నుంచి పంపించినా, ప్రయాగ్‌రాజ్, న్యూఢిల్లీలో జనం తొక్కిసలాటకు గురై మరణించినా, బిహార్‌లో రైళ్లపై జనం దాడి చేసినా ఇవన్నీ మన దేశంలో వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం. ప్రజలకు ఉపాధి కల్పించలేని వైఫల్యం ఒకవైపు యంత్రాంగాలను సక్రమంగా నిర్వహించలేని అసమర్థత మరోవైపు భారతదేశాన్ని వికసిత భారత్‌గా మార్చగలుగుతాయా అన్న సందేహాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Also Read:
నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి
మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..
2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!
For More Andhra Pradesh News and Telugu News..