Share News

‘ఉక్కుచట్రం’కు అవినీతి తుప్పు!

ABN , Publish Date - Feb 26 , 2025 | 06:15 AM

‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా?’ అన్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తలుచుకుంటే జరగనిది ఏమీ ఉండదని చెప్పవచ్చు. గత వారం ప్రధానమంత్రి తన కార్యాలయంలో రెండవ ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్‌ను నియమించారు...

‘ఉక్కుచట్రం’కు అవినీతి తుప్పు!

‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా?’ అన్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తలుచుకుంటే జరగనిది ఏమీ ఉండదని చెప్పవచ్చు. గత వారం ప్రధానమంత్రి తన కార్యాలయంలో రెండవ ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్‌ను నియమించారు. ఇలా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండగా మరొకరిని అదే హోదాలో నియమించడం ఇదే మొదటిసారి. శక్తికాంత దాస్‌ను ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. రిజర్వు బ్యాంకుకు స్వతంత్ర ప్రతిపత్తిని ఆశిస్తూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన రఘురామరాజన్, ఊర్జిత్ పటేల్ వంటి ఆర్థిక వేత్తలు ఎక్కువ కాలం రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవిలో కొనసాగలేకపోయిన తర్వాత ప్రవేశించిన శక్తికాంత దాస్ తన శక్తివంచన లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసినందువల్లే ఆయన ఆరు సంవత్సరాలు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా కొనసాగగలిగారు. అంతకు ముందు ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాలకు కారకుడయ్యారు. ఈ రెండు నిర్ణయాల వల్ల మాత్రమే కాదు, కోవిడ్ వల్ల కూడా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఆయనే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. రిజర్వులను మళ్లించడం వంటి ప్రభుత్వ విధానాలపై పెద్దగా విభేదించకుండా, రిజర్వు బ్యాంకు బోర్డులో ఎవర్ని నియమిస్తున్నారన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించకుండా జీడీపీ, ద్రవ్యోల్బణం, బ్యాంకులకు రుణాల ఎగవేత, నిరర్థక ఆస్థులు, భారీ ఎత్తున ప్రభుత్వ వ్యయం పెరగడం, పెరిగిపోతున్న ఆర్థిక లోటు మొదలైన అంశాలపై అంతగా ఆందోళన చెందకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ పడిపోతున్నా చెక్కుచెదరకుండా ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతం’ అన్నధోరణిలో వ్యవహరించినందువల్లే శక్తికాంత దాస్ కేంద్రానికి అత్యంత సన్నిహితుడు అయ్యారు. ఐఏఎస్ అధికారుల్లో ‘నొప్పించి తానొవ్వక’ అన్నట్లు ప్రభుత్వ ఆలోచనా విధానానికి అనుగుణంగా పనిచేసినవారే విజయవంతం కాగలుగుతారు. అలాంటి వారిలో శక్తికాంత దాస్ ఒకరని చెప్పక తప్పదు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేస్తారనడంలో సందేహంలేదు.


శక్తికాంత దాస్‌కు ముందు రిజర్వు బ్యాంకు గవర్నర్‌లుగా ఉన్న వై.వేణుగోపాల్ రెడ్డి, దువ్వూరి సుబ్బారావు, రఘరామరాజన్, ఊర్జిత్ పటేల్ బ్యాంకు స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకు తీవ్ర యత్నాలు చేశారు. పెద్ద నోట్ల రద్దు గురించి పార్లమెంటరీ కమిటీలో చర్చకు వచ్చినప్పుడు ‘ఈ నిర్ణయం గురించి మీతో ప్రభుత్వం చర్చించిందా?’ అని ఆ కమిటీ చైర్మన్‌గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ ఊర్జిత్ పటేల్‌ను ప్రశ్నించారు. ఊర్జిత్ పటేల్ జవాబివ్వకముందే ఆ కమిటీలో సభ్యుడుగా ఉన్నమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకుని ‘ఈ ప్రశ్నకు మీరు సమాధానమివ్వనక్కర్లేదు’ అని స్పష్టంగా చెప్పారు. తాను ఒక సంస్థగా రిజర్వు బ్యాంకు ప్రతిష్టను కాపాడేందుకే అలా చేశానని మన్మోహన్ సింగ్ వివరించారు. మన్మోహన్ సింగ్ కూడా ఒకప్పుడు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్నందువల్ల సంస్థ పరువు కాపాడాలని భావించారు. కాని సంస్థల పరువు ప్రతిష్ఠల గురించి ఇప్పుడెవరు పట్టించుకుంటారు?

ఎన్నికల రాజకీయాలకు అనుగుణంగా చర్యలు తీసుకునే ప్రభుత్వాధినేతలు ఉన్నంతవరకూ ప్రభుత్వానికి పెద్దగా ఆర్థికవేత్తలతో పని ఉండదు. ఆర్థికవేత్తలు ఆర్థిక సుస్థిరత గురించి ఆలోచిస్తారు. రిజర్వు బ్యాంకు సంస్థాగత స్వతంత్రత కోల్పోయిందని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వు బ్యాంకు మాజీ చైర్మన్ యాగా వేణుగోపాల్‌రెడ్డి ఒక సందర్భంలో ఆవేదన వ్యక్తపరిచారు. స్వతంత్రత అంటే ప్రభుత్వం నుంచి స్వతంత్రత కాదని, ప్రభుత్వ వ్యవస్థల్లో భాగంగా స్వతంత్రంగా వ్యవహరించాలనే నెహ్రూ నిర్వచనాన్ని అంగీకరించిన వేణుగోపాల్‌రెడ్డి ప్రపంచమంతా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొన్నా భారతదేశంలో పెద్దగా సమస్యలు లేకుండా చూశారు. రికార్డు స్థాయిలో మూడేళ్ల పాటు 9.5 శాతం జీడీపీని సాధించారు. ద్రవ్యోల్బణం 4.4 శాతం నుంచి 6.6 శాతం మధ్య ఉండేలా చూశారు.’ అమెరికా సెంట్రల్ బ్యాంకుకు కూడా ఇలాంటి అధినేత ఉంటే మా ఆర్థిక వ్యవస్థ ఇంత గందరగోళంగా ఉండేది కాదు’ అని ఆ దేశ ఆర్థికవేత్త జోసెఫ్ స్టిగ్లిజ్ సైతం వేణుగోపాల్‌రెడ్డిని ప్రశంసించారు. చిదంబరం, అరుణ్ జైట్లీ లాంటి వారితో కూడా స్పష్టంగా విభేదిస్తూ ఏది సరైనదో చెప్పగలిగిన వేణుగోపాల్‌రెడ్డి లాంటి ఐఏఎస్ అధికారులు చాలా అరుదుగా కనిపిస్తారు.


నిజానికి తమతో విభేదించినా అధికారులు సరైన విధంగా సలహా ఇస్తే స్వీకరించే ఉదాత్త వ్యక్తిత్వం గల నాయకులు కూడా రోజురోజుకూ తక్కువైపోతున్నారు. అంజయ్య హయాంలో సెక్రటరీగా ఉన్న యుబి రాఘవేంద్రరావుతో సమర్థులైన బృందాన్ని ఎన్టీఆర్ విశ్వాసంలోకి తీసుకుని తన ఆలోచనా విధానాలకు అనుగుణంగా పనిచేయించుకున్నారు. అధికారులు కూడా నిర్భయంగా ఆయన వద్ద తమ ఆలోచనలను పంచుకునేవారు. ఒక సమావేశంలో ఎన్టీఆర్ భారీ వార్షిక ప్రణాళిక కావాలనుకున్నారు. అందుకు అదనపు పన్నులు విధించాల్సి ఉంటుందని ప్రణాళికా బోర్డు డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న విఠల్ చెప్పారట. ఎన్టీఆర్ అందుకు అంగీకరించలేదు. విఠల్ చేసిన సూచనలేవీ ఎన్టీఆర్‌కు నచ్చలేదు. ‘విఠల్ గారూ, మీరు ప్రతిభాశాలి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణులు. మీరు కొత్త ఆలోచనలేవీ చెప్పలేరా.. లేదా ఎవరినైనా మంచి ఆలోచనలు చెప్పేవారిని సూచించండి’ అని ఎన్టీఆర్ అడిగారు. ‘అలా ఒక్కరే చేయగలరు..’ అని విఠల్ అన్నారు. ‘ఎవరాయన?’ అని ఎన్టీఆర్ ఆశ్చర్యంతో అడిగారు. ‘మీ వెనుకే ఉన్నారు చూడండి’ అని అనేసరికి ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూశారట. వెనక గోడకు పటంలో వేంకటేశ్వరస్వామి మందహాసం చేస్తూ కనిపించారు! అలా ప్రధానమంత్రికి గానీ, ముఖ్యమంత్రులకు గానీ స్వేచ్ఛగా చెప్పగలిగిన అధికారులు ఎవరైనా ఉన్నారా?


రాజకీయ నాయకులు సరైన నిర్ణయాలు తీసుకునేవిధంగా ఫైల్ నోట్స్ తయారు చేసి వివరించే అధికారులు తక్కువయిపోతున్నారని, పైగా తప్పులు చేసేందుకు నేతల్ని ప్రోత్సహించే అధికారులు ఎక్కువయిపోతున్నారని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక ఐఏఎస్ అధికారి ఆత్మకథను ఆవిష్కరిస్తూ వాపోయారు. శిక్షణా కాలంలోనే పంచాయితీలు చేసే అధికారులు కనపడుతున్నారని, ప్రజల్లోకి వెళ్లకుండా ఏసీ రూమ్‌లకే పరిమితమవుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఎవరు సరైన అధికారులో తేల్చుకోవడం, అందులో ఎవరు పాత ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తున్నారో కనిపెట్టడం రేవంత్‌కు సమస్యగా మారినట్లు కనిపిస్తోంది. మరో వైపు ఏపీలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు తన ఆలోచనా విధానానికి అనుగుణంగా పనిచేసే అధికారులను అన్వేషించేందుకు కొద్ది నెలల నుంచి ప్రయత్నిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న అయిదారు మంది సమర్థులైన అధికారులను రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై పంపాల్సిందిగా ఆయన గత నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినా ఫలితం కనపడడం లేదు.

మోదీ కూడా తాను చెప్పినట్లు నడుచుకునే అధికారులకోసం అధికారంలో వచ్చినప్పటి నుంచీ అనేక ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అందుకోసం ఆయన అవసరమైతే గుజరాత్ కేడర్ అధికారులపై కూడా ఎక్కువ ఆధారపడ్డారు. పికే మిశ్రా, శక్తికాంత దాస్ లాంటి వారు దొరకడం ఆయనకు కష్టమైపోయింది. అంతా ఐఏఎస్ అధికారులకే అప్పగించాలన్న ఆలోచన మోదీకి ఎప్పుడూ లేదు. కాని ఆయనకు కూడా ఐఏఎస్‌లపై ఆధారపడక తప్పడం లేదు. ‘అంతా బాబూ (ఐఏఎస్)లే చేయాలా? ఐఏఎస్ అయితే ఎరువుల ఫ్యాక్టరీలు కూడా నడిపించగలుగుతారా, దేశాన్ని బాబులకు అప్పజెబితే మనమేం చేస్తాం..’ అని ఒక సందర్బంలో మోదీ పార్లమెంట్‌లో వాపోయారు. అయినా ఐఆర్‌డిఏ, సెంట్రల్ ఎలెక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ, ఎన్నికల కమిషన్, సివిసి వంటి అనేక సంస్థలను ఆయన ఐఏఎస్‌లకే అప్పగించారు. కాకపోతే ఐఆర్‌ఎస్‌లకు పెద్ద పీట వేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రాజకీయ నాయకులకు దక్కాల్సిన కీలకమైన మంత్రిపదవులను కూడా ఆయన సివిల్ సర్వీసు నుంచి వచ్చిన అయిదారు మందికి అప్పగించారు. బాబులే అయితే విధేయంగా పనిచేస్తారని, నిబంధనలు విధించడం మాత్రమే కాదు, వాటిని ఎలా ఉల్లంఘించాలో అన్న విషయం కూడా వారికి తెలుసునని మోదీకి తెలియనిది కాదు. మోదీని మెప్పించే పైలును ఎలా తయారు చేయాలో అన్న కళను ఢిల్లీలో అధికారులు ఈ పదేళ్లలో క్రమంగా నేర్చుకున్నారు. క్రమంగా దేశ రాజధానిలో వ్యవస్థలు అణకువగా పనిచేయడం అలవాటు చేసుకున్నాయి.


ఐఏఎస్‌లు అవినీతిపరులా కాదా అన్నది పెద్దగా చర్చకు తావులేకుండా పోయింది. ఇటీవల ఒక ముఖ్యమంత్రి సేకరించిన అంతర్గత సమాచారం ప్రకారం అధికారులను సమర్థులు, అసమర్థులు, అవినీతిపరులుగా గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మూడో కేటగరీలో అత్యధికులు ఉన్నారు. వారికే ఢిల్లీలో ఎక్కువ పలుకుబడి ఉన్నట్లు తేలింది. అధికారుల్లో అవినీతి గురించి తెలంగాణ సిఎం మాట్లాడకముందే రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన ఆత్మకథలో 50 శాతం మంది ఐఏఎస్‌లు అసమర్థులని, 25 శాతం మంది సమర్థులని, మిగతా 25 శాతం పూర్తిగా అవినీతిపరులని రాశారు. సర్దార్ పటేల్ చెప్పినట్లు సివిల్ సర్వీస్‌ను ఒక ఉక్కుచట్రంలా భావించడానికి ఇప్పుడు ఎంతమాత్రమూ వీల్లేదు. అధికార వ్యామోహం లేని, అవినీతికి పాల్పడని ఎస్‌ఆర్ శంకరన్, యుగంధర్, కె.ఆర్. వేణుగోపాల్, అశోక్ ఖేమ్కా లాంటి అధికారులు వేళ్లపై లెక్కపెట్టగల సంఖ్యలో అప్పుడప్పుడు తటస్థిస్తారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలనే పూర్తిగా వదుల్చుకోలేకపోతున్న మనకు అప్పటి వ్యవస్థలను వదిలించుకోవడం సాధ్యమా?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)


ఇవి కూడా చదవండి...

మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!

ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 06:15 AM