వైరా పొగ చూరుతోంది!
ABN , First Publish Date - 2023-04-19T22:35:23+05:30 IST
వైరా పొగచూరుతోంది. ఆ పొగ పీల్చిన ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇది ఒక్కరోజు మస్య కాదు..

వైరా, ఏప్రిల్ 19: వైరా పొగచూరుతోంది. ఆ పొగ పీల్చిన ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇది ఒక్కరోజు మస్య కాదు.. ఏళ్లుగా ఇదే పరిస్థితి. అయినప్పటికీ పురపాలకం పట్టించుకోదు. జిల్లా ప్రజాప్రతినిధులు విన్పించుకోరు. ప్రతి మునిసిపాలిటీలో విధిగా డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ వైరాలో మాత్రం డంపింగ్‌యార్డు సమస్య పరిష్కారానికి మోక్షం లభించడంలేదు. మునిసిపాలిటీ పాలకవర్గం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్యానికి హరించివేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పొగ వల్ల ప్రమాదాలు
కొంతకాలం వరకు జాతీయ ప్రధాన రహదారిలోని వైరా నది హైలెవల్ వంతెన కింద మునిసిపాలిటీ చెత్త పోసి నిప్పుపెట్టడంతో పొగ ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరిగాయి. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో డంపింగ్‌యార్డుకు కేటాయించిన వైరా రిజర్వాయర్ అలుగుల సమీపంలోని స్థలంలో మునిసిపాలిటీ చెత్తను డంప్ చేస్తున్నారు. ఈ చెత్తకు నిప్పంటించి వదిలేస్తున్నారు. దాంతో రాత్రి, ఉదయం వేళల్లో ఈ చెత్త నుంచి వెలువడుతున్న పొగ మేఘాలను తలపిస్తోంది. వైరా రిజర్వాయర్‌తో పాటు దాదాపు మూణ్నాలుగు కిలోమీటర్ల పరిధికి విస్తరిస్తోంది. ఈ పొగ వల్ల బ్రాహ్మణపల్లి వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మునిసిపాలిటీ పాలకవర్గం, అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.