Education: నవ్విపోదురుగాక...! ‘టీచర్ రిసోర్స్ బుక్’కూ వైసీపీ రంగులే!
ABN , First Publish Date - 2023-09-25T13:15:59+05:30 IST
వైసీపీ రంగుల పిచ్చి పతాక స్థాయికి చేరింది (YCP Government). గతంలో సచివాలయాలకు పార్టీ రంగులేసి అభాసుపాలైన ప్రభుత్వం... ఇప్పుడు విద్యాశాఖలోనూ (Education) అవే రంగులు కనిపించేలా
లోపల తరగతి గది ఫొటోలోనూ అవే
ఎస్‌సీఈఆర్‌టీ అత్యుత్సాహంపై విమర్శలు
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ రంగుల పిచ్చి పతాక స్థాయికి చేరింది (YCP Government). గతంలో సచివాలయాలకు పార్టీ రంగులేసి అభాసుపాలైన ప్రభుత్వం... ఇప్పుడు విద్యాశాఖలోనూ (Education) అవే రంగులు కనిపించేలా పుస్తకాలు రూపొందిస్తోంది. ఉపాధ్యాయుల బోధనా విధానం, స్వీయ అంచనా, పాఠ్య ప్రణాళికలు, మోడల్ లెస్సన్ ప్లాన్స్ తదితర అంశాలపై ఇటీవల ‘టీచర్స్ రిసోర్స్ బుక్’ను విడుదల చేసింది. ప్రతి తరగతికి వేర్వేరుగా ఈ పుస్తకాలను ఏపీ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎ్‌ససీఈఆర్‌టీ) వీటిని రూపొందించింది. అయితే వీటి రూపకల్పనలోనే అత్యుత్సాహం ప్రదర్శించింది. బోధనా పద్ధతుల మెరుగు, పాఠ్య ప్రణాళికల కోసం టీచర్లకు ఇచ్చే ఈ పుస్తకాలకు పూర్తిగా వైసీపీ రంగులేసింది. మొదటి పేజీలోనే ప్రభుత్వ లోగో, సీఎం, విద్యాశాఖ మంత్రి ఫొటోలను నీలం, ఆకుపచ్చ రంగుల్లో కనిపించేలా తయారుచేసింది. ఆ తర్వాత ప్రతి పేజీలోనూ పై భాగంలో అవసరం లేకపోయినా ఆ రెండు రంగులు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేసింది.
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, సమగ్రశిక్ష ఎస్పీడీ, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ల పేర్లకు బ్యాక్‌గ్రౌండ్‌లో నీలం, ఆకుపచ్చ రంగులు వేసింది. తరగతి గది ఎలా ఉండాలనే దానిపై ఓ కార్టూన్ ఫొటో రూపొందించింది. అందులో బోర్డును ఆకుపచ్చ మయం చేసింది. బోధిస్తున్న టీచర్ ఆకుపచ్చ అంచున్న నీలం రంగు చీర కట్టినట్లు వేసింది. టీచర్స్ రిసోర్స్ పుస్తకం ఇండికేటర్లకు కూడా అధికార పార్టీ రంగులే కనిపించేలా డిజైన్ చేసింది. గతంలో పదో తరగతి విద్యార్థులకు జిల్లాపరిషత్ స్థాయిలో ముద్రించిన పుస్తకాల్లోనూ అనేకచోట్ల నవరత్నాలు బొమ్మలు, వైసీపీ రంగులేశారు. ఇప్పుడు ఏకంగా టీచర్లకు కూడా అవే రంగులున్న పుస్తకాలు ఇస్తున్నారు. కాగా, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రతా్‌పరెడ్డే దీనికి కారణమనే వాదన వినిపిస్తోంది. ఆయన సతీమణి అధికార పార్టీలో ఉన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన వైసీపీ కోసం పనిచేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.