Meghalaya Poll Results : అందరి చూపు ముకుల్ సంగ్మావైపు!

ABN , First Publish Date - 2023-03-02T10:22:48+05:30 IST

మేఘాలయ శాసన సభ ఎన్నికల్లో టీఎంసీ 10 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండటంతో అందరి చూపు ఆ పార్టీ సీనియర్ నేత ముకుల్ సంగ్మా వైపు

Meghalaya Poll Results : అందరి చూపు ముకుల్ సంగ్మావైపు!
Conrad Sangma, Mukul Sangma

న్యూఢిల్లీ : మేఘాలయ శాసన సభ ఎన్నికల్లో టీఎంసీ 10 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండటంతో అందరి చూపు ఆ పార్టీ సీనియర్ నేత ముకుల్ సంగ్మా వైపు పడింది. తాజా సమాచారం ప్రకారం 60 స్థానాలున్న ఈ శాసన సభలో అధికార పార్టీ అయిన ఎన్‌పీపీ 23 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. బీజేపీ 10, యూడీపీ 6, టీఎంసీ 10, కాంగ్రెస్ 6, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ఈ ఎన్నికల్లో ఇంటి పార్టీ ఎన్‌పీపీ అని, బయటి పార్టీ టీఎంసీ అని ప్రచారం జరిగింది. ఎన్‌పీపీ నేత కన్రాడ్ సంగ్మా కాగా, టీఎంసీ నేత ముకుల్ సంగ్మా. మేఘాలయలోని గారో హిల్స్ ప్రాంతంలో 24 శాసన నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి గెలిచిన పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే భావన ఉంది. గారో హిల్స్ నుంచి గెలిచినవారిలో ఎనిమిది మంది ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

ఎన్‌పీపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా చాలా ధీమాగా ఉండేవారు. తన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఆధిక్యత లభిస్తుందని గట్టిగా చెప్పేవారు. అయితే ప్రస్తుత ఫలితాలనుబట్టి చూస్తే ఆ పార్టీ 23 స్థానాల్లో మాత్రమే ముందంజలో కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.

టీఎంసీ నేత, మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ సరళినిబట్టి ప్రభుత్వ మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

కన్రాడ్ సంగ్మా ఈ ఎన్నికల ప్రచారంలో ముకుల్ సంగ్మాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గారో హిల్స్ ప్రాంతాన్ని ముకుల్ ఏమాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ముకుల్ సంగ్మా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆయనవైపు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Election results: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల కౌంటింగ్ ఆరంభ ట్రెండ్ ఇదే.. ఆధిక్యంలో ఉన్న పార్టీలివే..

Meghalaya Results : మేఘాలయలో రసవత్తర పోరు... టీఎంసీ జోరు...

Updated Date - 2023-03-02T10:30:42+05:30 IST