Amritpal Singh: భారీ భద్రత మధ్య డిబ్రూగఢ్ జైలుకు అమృత్‌పాల్
ABN , First Publish Date - 2023-04-23T18:31:12+05:30 IST
ఖలిస్తాన్ అనుకూల నేత, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ను భారీ భద్రత మధ్య అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు ..
డిబ్రూగఢ్: ఖలిస్తాన్ అనుకూల నేత, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)ను భారీ భద్రత మధ్య అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు (Dibrugarh Jail) తరలించారు. మోగా జిల్లాలో ఆదివారం ఉదయం 6.45 గంటల ప్రాతంలో అరెస్టు చేసిన అమృత్‌పాల్‌ను మధ్యాహ్నం విమానమార్గంలో డిబ్రూగఢ్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి డిబ్రూగఢ్‌లోని జైలుకు తరలించినట్టు అధికారులు తెలిపారు. జైలులోని ఐసొలేషన్ సెల్‌లో ఆయనను ఉంచారు. రా (RAW), ఐబీ (IB) అధికారులు ఆయనను ఇంటరాగేట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
అమృత్‌పాల్ ఆచూకీ కోసం మార్చి 18వ తేదీ నుంచి పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా, 36 రోజుల అనంతరం ఆదివారంనాడు ఆయన పట్టుబడ్డారు. అమృత్‌పాల్ అరెస్టుపై భిన్న కథనాలు వినిపించాయి. తామే స్వయంగా అరెస్టు చేసినట్టు పంజాబ్ పోలీసులు చెప్పగా, ఆయన శనివారం రాత్రి గురుద్వారకు వచ్చాడని, అమృత్‌పాల్ స్యయంగా ఫోన్ చేసి ఆ సమాచారం ఇచ్చారని, అనంతరం ఆదివారం ఉదయం గురుద్వారాలో ప్రార్థనల అనంతరం 7 గంటలకు లొంగిపాయారని రోడెవాలా గురుద్వారాలోని జ్ఞానీ జస్బీర్ సింగ్ తెలిపారు.
ప్రస్తుతం అమృత్‌పాల్‌ను తరలించిన డిబ్రూగఢ్ జైలులోనే ఆయన సన్నిహత సహచరులు ఉన్నారు. మార్చి మొదట్లో వీరిని పంజాబ్ జైలు నుంచి డిబ్రూగఢ్‌కు తరలించారు. జైలుపై దాడి, అజ్నాలా ఘటన పునరావృతం అయ్యే అవకాశాలున్నాయంటూ ఇంటెలిజెన్స్ సమాచారంతో వీరిని అక్కడికి తరలించారు. కాగా, అమృత్‌పాల్ గురించిన సమాచారాన్ని వార్తల్లో చూశామని, చట్టపరంగానే దీనిని ఎదుర్కొంటామని ఆయన తల్లిదండ్రులు తెలిపారు. తన కుమారుడు సింహం అని, సింహంలాగానే లొంగిపోయాడని అమృత్ పాల్ తల్లి బల్విందర్ కౌర్ స్పందించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తన కుమారుడు పోరాటం సాగించినట్టు అమృత్‌పాల్ తండ్రి సుఖ్‌చైన్ సింగ్ తెలిపారు. న్యాయపోరాటం సాగిస్తామన్నారు.