Gulam Nabi Azad: అధికారమిస్తే.. కశ్మీర్‌ను వరల్డ్ క్లాస్ టూరిస్ట్ సెంటర్ చేస్తా..!
ABN , First Publish Date - 2023-08-27T20:54:55+05:30 IST
డెమోక్రటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీ కి ప్రజలు అధికారమిస్తే పర్యాటక రంగం అభివృద్ధిపై పూర్తి దృష్టి కేంద్రీకరించి కేంద్ర పాలిత ప్రాంతంలో యవతకు ఉపాధి కల్పించి, నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తామని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డీపీఏపీ చీఫ్ గులాం నబీ ఆజాద్ అన్నారు. పుల్వామా జిల్లాలో ఆదివారంనాడు జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
శ్రీనగర్: డెమోక్రటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీ (DPAP)కి ప్రజలు అధికారమిస్తే పర్యాటక రంగం అభివృద్ధిపై పూర్తి దృష్టి కేంద్రీకరించి కేంద్ర పాలిత ప్రాంతంలో యవతకు ఉపాధి కల్పించి, నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తామని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డీపీఏపీ చీఫ్ గులాం నబీ ఆజాద్ (Gulam Nabi Azad) అన్నారు. పుల్వామా జిల్లాలో ఆదివారంనాడు జరిగిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, పండ్లతోటలకు ప్రసిద్ధి గాంచిన పుల్వామాలో పండ్లతోటల రంగాన్ని మరింతగా ప్రోత్సహిస్తామని, అధునాతన పండ్ల మార్కెట్ల ఏర్పాటు, యాపిల్ పంటను దేశంలోని అన్ని ప్రాంతాలకు వేగంగా రవాణా చేసేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనతో పాటు, యాపిల్ పంట ఉత్పత్తిని గణనీయంగా ప్రోత్సహిస్తామని చెప్పారు.
పర్యాటకులను ఆకర్షించేందుకు అందమైన పచ్చికభూములు, సహజ జలపాతాలు, పర్వతాలు వంటివెన్నో ఈ ప్రాంతంలో ఉన్నాయని, కనీసవసతులైన ఆసుపత్రులు, రోడ్లు, ఇతర సౌకర్యాలను ఆధునీకరించి సామాన్యప్రజల జీవితాలు మెరుగుపరచేందుకు అన్నిరకాలైన చర్యలు తీసుకుంటామని ఆజాద్ చెప్పారు. రాంబాన్-బనిహాల్ మధ్య కొండచరియలు కారణంగా తరచు హైవే దిగ్బంధాలు తలెత్తుతున్నాయని, తాము అధికారంలోకి వస్తే ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ముఖ్యమంగా పర్యటకరంగ అభివృద్ధితో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని, యువకులు హోటళ్లు, రెస్టారెంట్లు ఓనర్లవుతారని, ఇతర సేవా రంగాల్లోనూ వారికి చేయూతనిస్తామని, స్థానికులకు అన్నిరకాలుగా ఉపాధి కల్పిస్తామని చెప్పారు. తద్వారా ఉద్యోగం కోసం యువత వేరే జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. రోడ్ల అనుసంధానం, విద్యుద్దీకరణతో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ సెంటర్‌గా కేంద్ర పాలిత ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ఆజాద్ హామీ ఇచ్చారు.