Lalu Prasad Yadav: రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేశారు.. ప్రధాని మోదీపై లాలూ ప్రసాద్ యాదవ్ సెటైర్లు

ABN , First Publish Date - 2023-09-01T20:34:15+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో మోదీ ఇచ్చిన రూ.15 లక్షల హామీని గుర్తు చేస్తూ.. ఆయనపై...

Lalu Prasad Yadav: రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేశారు.. ప్రధాని మోదీపై లాలూ ప్రసాద్ యాదవ్ సెటైర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో మోదీ ఇచ్చిన రూ.15 లక్షల హామీని గుర్తు చేస్తూ.. ఆయనపై కౌంటర్ల వర్షం కురిపించారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లోకి వేస్తానని మోదీ హామీ ఇచ్చారని.. కానీ అది జరగలేదని మండిపడ్డారు. ఆయన మాటలు నమ్మి తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా మోసపోయారని ఛలోక్తులు పేల్చారు. ప్రధాని మోదీని గద్దె దింపడమే తమ ఇండియా కూటమి లక్ష్యమని వాదించారు.

ముంబైలో విపక్ష కూటమి ‘ఇండియా’ మూడో సమావేశం అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిరంతర పోరాటాల తర్వాత ఈరోజు పాట్నా, బెంగళూరు, ముంబైలలో సమావేశాలు నిర్వహించే స్థాయికి చేరుకున్నాం. ఒక నిర్ణయానికి వచ్చి ‘ఇండియా’ కూటమిని స్థాపించాం. అబద్ధాలు, వదంతులు ప్రచారం చేస్తూ.. మోదీ ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందో ప్రజలకు గుర్తుండే ఉంటుంది. నాతో పాటు ఇతర నేతలందరూ స్విస్ బ్యాంక్‌లో నల్లధనాన్ని జమ చేసినట్లు అప్పట్లో ప్రచారం చేశారు. మేము అధికారంలోకి వచ్చాక.. స్విస్ బ్యాంక్‌లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి, రూ.15 లక్షలు చొప్పున దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల ఖాతాల్లోకి వేస్తామని మోదీ చెప్పారు’’ అని పేర్కొన్నారు.


మోదీ చెప్పినట్లు నిజంగానే డబ్బులు వస్తాయన్న నమ్మకంతో.. తనతో పాటు భార్య, ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కలిపి మొత్తం 11 మంది బ్యాంక్ ఖాతాలు తెరిచామని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. 11 సంఖ్యను 15తో గుణిస్తే.. చాలా డబ్బు వస్తుందని ఆశించామన్నారు. తమలాగే దేశవ్యాప్తంగా ఉన్న పేదలందరూ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారని.. కానీ చివరికి మోదీ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఎందుకంటే.. స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఆ నల్లధనం అంతా బీజేపీ వాళ్లకు చెందినదేనని ఆరోపించారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ చేస్తున్న, చేయిస్తున్న అవినీతి, దుర్మార్గం.. తామెప్పుడూ చేయలేదని లాలూ ప్రసాద్ ధ్వజమెత్తారు.

అనంతరం రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల గురించి లాలూ యాదవ్ మాట్లాడుతూ.. తమ ఇండియా కూటమి 14 మంది సభ్యుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. తమ కూటమిలోని పార్టీల మధ్య సీట్లు పంచుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ విపక్షాలు కలిసి ఉండకపోవడాన్ని మోదీ సద్వినియోగం చేసుకున్నారని, కానీ ఇకపై మోదీకి ఆ అవకాశం ఉండదని హెచ్చరించారు. బీజేపీ పాలనలో మైనారిటీలకు భద్రత లేకుండా పోయిందని.. ధరలు సైతం నిరంతరం పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చంద్రయాన్-3 ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడంపై ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. మోదీని సూర్యుడిపై పంపాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేశారు. అప్పుడు మోదీ ఇంకా ఫేమస్ అవుతారని చురకలంటించారు.

Updated Date - 2023-09-01T20:34:15+05:30 IST