BJP: 4 దశాబ్దాలుగా కమల వికాసం.. 2 నుంచి 303 దాకా.. మోదీని ఆపే మొనగాడే లేడా..!
ABN , First Publish Date - 2023-04-07T18:13:25+05:30 IST
2 నుంచి 303 దాకా బీజేపీ ప్రస్థానం... బీజేపీ సక్సెస్ స్టోరీ..
న్యూఢిల్లీ: 1980లో భారతీయ జనతా పార్టీ(BJP) ఆవిర్భవించింది. బీజేపీ మూలాలు 1951 నాటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో ఉన్నా ఎమర్జెన్సీ హయాంలో 1975-77 మధ్య ఇతర పార్టీలతో కలిసి జనతాపార్టీగా ఏర్పడింది. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసింది. ఆ తర్వాత మూడేళ్లకే జనతాపార్టీ ప్రభుత్వం పతనమైంది. దీంతో జనతాపార్టీలో పూర్వపు జన్‌సంఘ్ నేతలంతా బయటకు వచ్చి 1980 ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండే సీట్లు గెలిచింది. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాటి బీజేపీ తొలి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, అద్వానీ కూడా ఓటమి పాలయ్యారు. హనుమకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి, గుజరాత్ నుంచి ఏకే పటేల్ అనే అభ్యర్థులు మాత్రమే గెలిచారు. నాడు కేవలం రెండు సీట్లే వచ్చినప్పుడు ‘మేం ఇద్దరం మాకిద్దరు’ అంటూ రాజీవ్ గాంధీ బీజేపీని వెక్కిరించారు కూడా.
ఆ తర్వాత అయోధ్యలో రామమందిరం కట్టాలంటూ అద్వానీ చేపట్టిన రథయాత్రతో 1989లో బీజేపీ 88 సీట్లను గెలుచుకుంది. 1991లో 120 స్థానాలను గెలుచుకుంది. 1996లో 161 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా విశ్వాసం పొందలేక కేవలం 13 రోజుల్లో పతనమైంది. 1998లో బీజేపీ 182 స్థానాలతో మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిగతా మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం విశ్వాసం కోల్పోయి కూలిపోయింది. 1999 ఎన్నికల్లో 182 స్థానాలు నెగ్గి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాజ్‌పేయి ఐదేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. 1998లో అణ్వస్త్ర పరీక్షలను విజయవంతంగా నిర్వహించి సత్తా చాటింది. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌కు గట్టిగా గుణపాఠం కూడా నేర్పింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఫలితాలు-
1984-2
1989-85
1991-120
1996-161
1998-182
1999-182
2004 నాటికి సీన్ మారిపోయింది. ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలో విజయవంతమైన కాంగ్రెస్ (Congress) అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandi) తన విధేయుడైన మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేశారు. రెండుసార్లు యూపీఏనే పాలించింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన స్థానాలు
2004-138
2009-116
పదేళ్ల యూపిఏ(UPA) హయాంలో చివరి అంకంలో అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. పాలనలో ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజల్లో తీవ్ర నిరాశ ఏర్పడింది. సరిగ్గా ఆ సమయంలోనే నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి ఢిల్లీకి మారారు. మోదీ రాకతో బీజేపీకి ఊపు వచ్చింది. ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగింది. బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. పేరుకు ఎన్డీయే (NDA) అయినా మోదీ సారథ్యంలో బీజేపీ పాలన కొనసాగుతోంది.
మోదీ మేనియాతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం
2014- 282
2019- 303
మొదటి ఐదేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న మోదీ ఆ తర్వాత 2019లో బీజేపీకి ఏకంగా 303 స్థానాలు సంపాదించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో బీజేపీకి తిరుగులేకుండా పోయింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 7.74% ఉన్న ఓట్ షేర్ 2014 నాటికి 31.34 శాతానికి 2019 ఎన్నికల నాటికి 37.46 శాతానికి చేరుకుంది.
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మోదీ అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. నోట్ల రద్దు సమయంలో అనేక విమర్శలు వచ్చినా నేడు డిజిటల్ ఇండియా సూపర్ సక్సెస్ అయింది. కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులు కూడా డిజిటల్ మాధ్యమంలో లావాదేవీలు జరుపుతున్నారు. ప్రతిపైసా ప్రభుత్వానికి తెలుస్తోంది. అదే సమయంలో పేదలకు, రైతులకు, లబ్ధిదారులకు నేరుగా బ్యాంకుల ఖాతాల్లో ప్రభుత్వం నుంచి సాయం అందుతోంది. దీంతో లంచగొండితనం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
జమ్మూకశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 రద్దుతో మోదీ సంచలనం సృష్టించారు. జమ్మూకశ్మీర్‌లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సర్జికల్ దాడుల ద్వారా పాకిస్థాన్‌కు గట్టి గుణ పాఠం నేర్పారు. గల్వాన్ లోయ ఘటనతో చైనాకూ కొరకరాని కొయ్యలా మారారు. రక్షణ రంగాన్ని బీజేపీ ప్రభుత్వం బలోపేతం చేసింది. సరిహద్దుల వద్ద గట్టి పహారా ఏర్పాటు చేసింది.
బీజేపీ విదేశాంగ విధానంపై అంతర్జాతీయంగా ప్రశంసలు కురుస్తున్నాయి. నిన్నటికి నిన్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం సమయంలో ముడి చమురు తక్కువ ధరకు కొనుగోలు చేసింది. అంతేకాదు ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా రాయితీ ధరలకు చమురును విక్రయిస్తోంది. ఆ చమురును కొనవద్దని అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాలు భారత దేశంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా భారత్ రష్యా చమురును చౌక ధరకు కొని శుద్ధి చేసి, అమెరికాతోపాటు యూరోపు దేశాలకు ఎగుమతి చేస్తోంది.
కోవిడ్ సమయంలో ప్రపంచమంతా వణికిపోతుంటే మోదీ నేతృత్వంలో భారత్‌లో వ్యాక్సిన్లు సొంతంగా అభివృద్ధి చేయడమే కాక ప్రజలందరికీ వ్యాక్సిన్లు వేసింది. ఇతర దేశాలకూ వ్యాక్సిన్లు సరఫరా చేయగలిగింది. కోవిడ్ సమయం నుంచి దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ సరుకులను అందజేస్తున్నారు. నేటికీ ప్రధానమంత్రి అన్న్ యోజన పథకం అమల్లో ఉంది. వందల ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి వివాదం మోదీ హయాంలో పరిష్కారమైంది. 2024 నాటికి అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణం కానుంది.
మోదీ ప్రస్తుతం 2024లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ చేశారు. కమలనాథులంతా ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు హిందుత్వపైనే ఫోకస్ చేసిన బీజేపీ నేడు అభివృద్ధి అజెండాపై దృష్టిపెట్టింది.
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బంధుప్రీతి, కుటుంబ పాలన, కులతత్వం, ప్రాంతీయవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, అవినీతి, బంధుప్రీతి నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకుగాను బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికీ వెనకాడదని ప్రధాని మోదీ చెబుతున్నారు. దేశంలో అవినీతితోపాటు వంశపారంపర్య రాజకీయాలపై పోరాడేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీకి దేశమే ముఖ్యమని, సర్వస్వమని చెప్పారు. పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన 2024లో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఏ మాత్రం అలసత్వాన్ని ప్రదర్శించవద్దని బీజేపీ శ్రేణులను హెచ్చరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినప్పటికీ ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని మోదీ కమలనాథులకు పిలుపునిచ్చారు. అవినీతిపై తమ పోరాటం కొనసాగుతుందంటూ సీబీఐ, ఈడీ పనితీరును ప్రధాని మోదీ ఇటీవలే మెచ్చుకున్నారు కూడా.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు ఒకేతాటిపైకి వచ్చేందుకు యత్నిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న ఆప్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కూడా ఇప్పుడు మనసు మార్చుకున్నాయి. మోదీ ఇంటిపేరు కలవారందరూ దొంగలే అని వ్యాఖ్యానించినందుకు రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష, ఎంపీగా అనర్హత వేటు పడటంతో ప్రతిపక్షాల్లో ఐక్యత పెరిగింది. సీబీఐ, ఈడీ దాడులతో కూడా ప్రతిపక్షనేతలు బెంబేలెత్తిపోతున్నారు. సుప్రీంకోర్టుకు పరుగులు తీసినా లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో 2024 లోక్‌సభ ఎన్నికల మహా సంగ్రామంపై అందరూ ఫోకస్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను సెమీ ఫైనల్‌గా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఈ ఏడాది జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీని అడ్డుకోవడం కష్టమేనంటున్నారు. అదే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రతిపక్షాలు అడ్డుకట్ట వేయగలిగితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి బ్రేకులు పడుతున్నట్లే భావించవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
AK Antony: తన కుమారుడు బీజేపీలో చేరడంపై ఏకే ఆంటొనీ రియాక్షన్
AAP: కాంగ్రెస్‌కు షాకిచ్చి ఆప్‌లో చేరిన 24 గంటల్లోనే..
BJP: కేరళలో బీజేపీకి కొత్త యువ నాయకుడు దొరికాడు