UAE Visit Visa: ఆ టూరిస్టులపై పరారీ కేసులు.. ట్రావెల్ ఏజెన్సీల వార్నింగ్

ABN , First Publish Date - 2023-02-04T13:34:52+05:30 IST

విజిట్ వీసాలపై దేశానికి వచ్చి, వాటి గడువు ముగిసిన తర్వాత అక్కడే ఉండే పర్యాటకులకు తాజాగా యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలు, ఇమ్మిగ్రేషన్ అథారిటీలు వార్నింగ్ ఇచ్చాయి.

UAE Visit Visa: ఆ టూరిస్టులపై పరారీ కేసులు.. ట్రావెల్ ఏజెన్సీల వార్నింగ్

అబుదాబి: విజిట్ వీసాలపై దేశానికి వచ్చి, వాటి గడువు ముగిసిన తర్వాత అక్కడే ఉండే పర్యాటకులకు తాజాగా యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలు, ఇమ్మిగ్రేషన్ అథారిటీలు వార్నింగ్ ఇచ్చాయి. ఇలా చేసే విజిటర్లపై పరారీ కేసులతో పాటు దేశ బహిష్కరణ (Deportation) ఉంటుందని హెచ్చరించాయి. విజిట్ వీసాల (Visit Visas) గడువు ముగిసిన తర్వాత ఐదు రోజుల కంటే ఎక్కువ కాలం దేశంలో ఉండే టూరిస్టు పేర్లను బ్లాక్‌లిస్ట్ చేసి, యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల్లో కూడా ప్రవేశించకుండా నిషేధం విధించడం జరుగుతుందని ఈ సందర్భంగా ట్రావెల్ ఏజెన్సీలు (Travel Agencies) పేర్కొన్నాయి. ఈ మేరకు గడిచిన కొన్ని రోజులుగా టూరిస్టులకు వార్నింగ్ అలెర్ట్ సందేశాలు పంపిస్తున్నాయి కూడా.

రూహ్ టూరిజయం (Rooh Tourism) ఆపరేషనల్ డైరెక్టర్ లిబిన్ వర్గీస్ మాట్లాడుతూ.. 30రోజులు లేదా 60రోజుల వ్యవధితో కూడిన విజిట్ వీసాపై యూఏఈకి వచ్చే పర్యాటకులు (Visitors) తమ స్పాన్సర్షిప్ కింద ఉంటారని తెలిపారు. ఒకవేళ తమ ద్వారా యూఏఈకి వచ్చిన విదేశీ టూరిస్టులు (Foreign Tourists) గడువు దాటి ఇక్కడే ఉండిపోతే తాము ఇబ్బందుల్లో పడి తీవ్రంగా నష్టపోతామని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ భద్రత కోసం వీసా కాలపరిమితి దాటి దేశంలో ఉండే విజిటర్లపై పరారీలో ఉన్నట్లు నివేదిక ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక పర్యాటకుడు వీసా గడువు దాటి దేశంలో ఉన్నట్లయితే తమపై కూడా జరిమానా పడుతుందని చెప్పారు. చివరకు ఇలా కాలపరిమితి ముగిసిన వ్యక్తి ఎక్కువ కాలం దేశంలో ఉన్నందుకు ఫైన్ కట్టడడంతో పాటు కంట్రీ నుంచి నిష్క్రమించేందుకు ఔట్‌పాస్ కూడా పొందాలి. ఇలాంటి సందర్భాల్లో అది ట్రావెల్ ఏజెన్సీలకు తలకుమించిన భారంగా పరిణమిస్తుందని చెప్పారు. ట్రావెల్ ఏజెంట్లు తాము స్పాన్సర్ చేసిన సందర్శకులు యూఏఈ (UAE)లో ఎక్కువ కాలం గడిపినట్లయితే కొత్త వీసాల కోసం దరఖాస్తులను తమ పోర్టల్ అంగీకరించదని తెలిపారు.

Updated Date - 2023-02-04T13:54:06+05:30 IST

News Hub