TS Assembly Polls : 2023 ఎన్నికల్లో ఊపిరిపీల్చుకున్న కాంగ్రెస్.. ప్లాన్ అదిరిపోయిందిగా..!!
ABN , First Publish Date - 2023-11-10T16:40:20+05:30 IST
Telangana Congress : అవును.. తెలంగాణలో జరగబోతున్న 2023 సార్వత్రిక ఎన్నికల్లో (TS Assembly Polls) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) భారీ ఊరట లభించింది. ఎందుకంటే.. ఎన్నికల షెడ్యూల్ మొదలుకుని నామినేషన్ల గడువు ముగిసే వరకూ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు...
అవును.. తెలంగాణలో జరగబోతున్న 2023 సార్వత్రిక ఎన్నికల్లో (TS Assembly Polls) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) భారీ ఊరట లభించింది. ఎందుకంటే.. ఎన్నికల షెడ్యూల్ మొదలుకుని నామినేషన్ల గడువు ముగిసే వరకూ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎంత మంది తిరుగుబావుటా ఎగురవేస్తారో.. ఇంకెంతమంది టికెట్ల దక్కక రెబల్స్ (Rebels) మారుతారో లెక్కే ఉండదు. మునుపటితో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌కు ఆ తిప్పలు లేవు. ఎందుకంటే.. గతంతో పోలిస్తే ఒకట్రెండు నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా రెబల్స్ అయితే ఇప్పటి వరకూ కనిపించలేదు. అయితే.. నామినేషన్ల ఉపసంహరణ నాటికి కాంగ్రెస్ నుంచి సింగిల్ అభ్యర్థులు మాత్రమే ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి.. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని బీఫామ్‌లు అందజేసి, నామినేషన్లు ఇచ్చేవరకూ హైకమాండ్ తీవ్ర కసరత్తులు చేసి పక్కా ప్లాన్‌తోనే ముందుకెళ్లింది. పైగా.. స్వయంగా ఢిల్లీ పెద్దలు కలుగజేసుకోవడం, ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Sivakumar) రంగంలోకి దిగి అసంతృప్తులందరికీ నచ్చజెప్పారు. అటు ఢిల్లీ పెద్దలతో.. ఇటు కీలక నేతలు.. ఎన్నికల వ్యూహకర్తతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఒకట్రెండు చిన్న చిన్న వివాదాలు మినహాయించి అన్నీ పక్కాగా అమలు చేసుకుంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ముందుకెళ్లారు. ఇలా ఒక అంఖం అయితే ముగిసింది.
ఎక్కడా పొరపచ్చాల్లేకుండా..?
వాస్తవానికి.. ఐదారు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో ఆఖరి నిమిషం వరకూ కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) హైరానా పడింది. ఎందుకంటే తమ అనుచరులకు.. కుటుంబ సభ్యులకే టికెట్లు ఇవ్వాలని కొందరు సీనియర్లు గట్టిగానే పట్టుబట్టారు. దీంతో అటు ఆయనకు.. ఇటు ఈయనకు ఇద్దరికీ ఏమీ చెప్పలేక హైకమాండ్ ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో అభ్యర్థులను ప్రకటించడం.. బీఫామ్‌లు ఇవ్వడం, ఇంకొందరికి ఇవ్వలేకపోవడం.. ఆఖరి నిమిషంలో అభ్యర్థిని మార్చడంతో ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ కాస్త గందరగోళానికి గురైన పరిస్థితి నెలకొంది. పఠాన్ చెరు, తుంగతుర్తి, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో మల్లగుల్లాలు పడిందని చెప్పుకోవచ్చు. ఇలా జరిగినప్పటికీ ఎక్కడా పొరపచ్చాలు లేకుండా అసంతృప్తులందరికీ సర్దిచెప్పినప్పటికీ పఠాన్ చెరు నుంచి అభ్యర్థిగా ప్రకటించిన నీల మధు ముదిరాజ్ ఆఖరికి బీఎస్సీ కండువా కప్పుకొని నామినేషన్ దాఖలు చేశారు. కొన్ని అసెంబ్లీ స్థానాల్లో సీనియర్లను సైతం పక్కనెట్టి కొత్తవారికి, బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన వారికి సర్వేలు చేసి మరీ టికెట్లు ఇచ్చిన పరిస్థితి. ఇంకా ఒకట్రెండు చోట్ల టికెట్లు దక్కి.. బీఫామ్ రానివారు రెబల్స్‌గా మారిన పరిస్థితి. అయితే.. బీజేపీలోనూ ఇదే పరిస్థితి.. నామినేషన్ వేసుకోవచ్చు ఇక బయల్దేరండని చెప్పి ఆఖరికి ఇవ్వకపోవడం అల్లకల్లోల్లం అయ్యింది. కాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సాయంత్రం వరకూ 2028 నామినేషన్లు వచ్చాయని తెలిసింది.
ఎప్పుడేం జరుగుతుంది..?
నవంబర్-10తో ముగిసిన నామినేషన్ల పర్వం
నవంబర్ -13న నామినేషన్ల పరిశీలన
నవంబర్ - 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
నవంబర్-30న పోలింగ్
డిసెంబర్ -03న కౌంటింగ్