TS Elections : రాజీనామా చేశాక రేవంత్‌పై రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-25T18:15:40+05:30 IST
తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు నేతలు జంపింగ్‌లు తెగ చేసేస్తున్నారు. ఇవాళ ఉదయం బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..
తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు నేతలు జంపింగ్‌లు తెగ చేసేస్తున్నారు. ఇవాళ ఉదయం బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాజీనామా అనంతరం మొదటిసారి మొయినాబాద్‌లోని తన ఫామ్ హౌస్ వేదికగా మీడియా మీట్ నిర్వహించి.. అసలు తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఎందుకు కాంగ్రెస్‌లోకి మళ్లీ ఎందుకు చేరాల్సి వచ్చిందనే విషయాలను నిశితంగా వివరించారు. ఇదే మీడియా ముఖంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు.
నాకు ఇంకేం కావాలి..!
‘ అవును.. అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో 27వ తేదీన కాంగ్రెస్‌లో చేరుతున్నాను. మునుగోడు, ఎల్బీ నగర్ టికెట్ ఇస్తానని బీజేపీ చెప్పింది. బీజేపీకి నేను పనికిరాను అని అధిష్ఠానానికి చెప్పాను. నాకు టికెట్ వద్దని అధిష్ఠానానికి క్లియర్‌కట్‌గా చెప్పాను. కమ్యూనిస్టులను మోసం చేసింది కేసీఆర్. టికెట్ కోసం కాంగ్రెస్‌లోకి రావడం లేదు. రాష్ట్రంలో నియంత పాలన పోవాలంటే కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలి. నేను ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మేల్యే అయ్యాను.. ఇంకేం పదవులు కావాలి నాకు..?. బీజేపీ- బీఆర్ఎస్ ఒకటే. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అంటే ఇప్పటికీ గౌరవం ఉంది. కాంగ్రెస్ మహా సముద్రం. బీజేపీలోనే ఉండాలని నిన్నటి వరకు అనుకున్నాను. సర్వేలు, ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నాయి. ప్రజల మనిషిని కాబట్టి ప్రజలు చెప్పినట్టే వింటాను’ అని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రేవంత్ గురించి..!
‘రాజగోపాల్‌రెడ్డి పార్టీలోకి వస్తానంటే ఒక మెట్టు దిగుతా అని రేవంత్ రెడ్డి చాలా సార్లు అన్నారు.నా జీవితంలో ఇది అతిపెద్ద నిర్ణయం. రేవంత్ నాకేమైనా శత్రువా?. కొన్ని సందర్భాల్లో బేధాభిప్రాయాలు ఉంటాయి. పీసీసీ పదవి శాశ్వతం కాదు. మునుగోడులో గెలిచామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకొగలుగుతున్నారా?. కేసీఆర్‌ని తప్పుకుండా జైలుకు పంపుతాం’ అని రాజాగోపాల్ చెప్పుకొచ్చారు.
రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..
‘కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్‌లో కేసీఆర్ పై పోటీ చేస్తాను. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడులో పోయి చేసి గెలవాలని సవాల్ విసురుతున్నాను. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. మునుగోడులో ఓడిపోయినప్పుడు బాధపడలేదు. ఏ తప్పు చేయకుండా, మచ్చ లేకుండా నిజాయితీగా పనిచేశాను. నేను అమ్ముడు పోయానని కొందరు అన్నప్పుడు బాధపడ్డాను. దిగజారి నాపై విమర్శలు చేసినందుకు మనసులో ఏడ్చాను. నాపై విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు..?. నాపై ఆరోపణలు చేసిన వారు గుండెపై చేయి వేసుకొని సమాధానం చెప్పాలి. నన్ను కొనగలిగే శక్తి పుట్టలేదు.. పుట్టబోదు. నేను ఎక్కడ రాజీ పడలేదు. నా జీవిత ఆశయం కేసీఆర్‌ను గద్దె దించడమే. చేతిలో చిల్లిగవ్వ లేని కేసీఆర్ ఇప్పుడు లక్షల కోట్లు దోచుకున్నాడు. కేసీఆర్ మొహంలో రక్తం లేదు. ఓడిపోతామనే భయం కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఉద్యమంలో పని చేసిన వాళ్ళని కలిసి తప్పు చేశామని కాళ్ళు పట్టుకుంటున్నారు. బావ బామ్మర్థులు కలిసి చిన్న చిన్న నాయకులను కూడా కొనే ప్రయత్నం చేస్తున్నారు’ అని కేసీఆర్‌పై రాజగోపాల్ విమర్శల వర్షం కురిపించారు.