Modi Dictetor: ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సంచలన కామెంట్లకు కారణమైన మోదీ నిర్ణయాలు ఇవేనా?

ABN , First Publish Date - 2023-02-25T17:03:30+05:30 IST

'భారతదేశ సమకాలీన చరిత్ర-సవాళ్లు'' అనే అంశంపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ హైదరాబాద్‌లో కీలకోపన్యాసం చేస్తూ గతంలో ప్రధాని.. ఇందిరాగాంధీ

Modi Dictetor: ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సంచలన కామెంట్లకు కారణమైన మోదీ నిర్ణయాలు ఇవేనా?

ఇంటర్నెట్ డెస్క్: ''భారతదేశ సమకాలీన చరిత్ర-సవాళ్లు'' అనే అంశంపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ (Ramachandra Guha) హైదరాబాద్‌లో కీలకోపన్యాసం చేస్తూ గతంలో ప్రధాని ఇందిరాగాంధీ ఎలాంటి నియంతృత్వ ధోరణులు అవలంభించారో ఇప్పుడు నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా అంతకుమించి నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1947 నుంచి 1952 మద్య కాలంలో కొన్ని విపత్కర పరిస్థితులు చోటుచేసుకున్నాయని, అలాంటి మార్పులను గడిచిన ఐదేళ్లలోనూ (మోదీ పాలనలో) చూస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల్లో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో భారత్ నిలవడం, శక్తివంతమైన ప్రధానుల్లో ఒకరిగా మోదీని పలువురు ప్రపంచాధినేతలు, సర్వేలు పేర్కొంటున్న నేపథ్యంలో మోదీని ఇందిరాగాంధీని మించిన నియంత అంటూ రామచంద్ర గుహ వ్యాఖ్యానించడం వెనుక కారణాలు ఏమిటి? మోదీ నిర్ణయాల్లో అహేతుకంగా ఆయన భావిస్తున్న అంశాలు ఏమిటనేవి ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.

ఏక పార్టీగా చలామణి కావాలనుకోవడం...

ఒకప్పుడు కాంగ్రెస్ ఏక పార్టీగా చలామణి అయింది. అయితే ఇప్పుడు బీజేపీ అదే బాటలో నడుస్తోందనేది రామచంద్ర గుహ సూటి విమర్శ. కేంద్రంలో మోదీ సారథ్యంలోని బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో 'కాంగ్రెస్ రహిత భారత్' మోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే బలమైన ప్రతిపక్షం అవసరమని ఒకప్పటి ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి విశ్వసించేవారు. అదే మాట బహిరంగంగా ఆయన చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఇందుకు భిన్నంగా విపక్షం(కాంగ్రెస్) లేని ఏక పార్టీ ప్రభుత్వానికి మోదీ పిలుపునివ్వడం నియంతృత్వ ధోరణినే ప్రతిబింబిస్తుందనేది రామచంద్ర గుహ వంటి పలువురి చరిత్రకారుల అభిప్రాయంగా ఉంది.

ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా..

రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రంలోని ప్రభుత్వం పరిపుష్టమవుతుందనేది సమాఖ్య స్ఫూర్తి చెబుతుంది. కొన్ని ప్రత్యేక అంశాల విషయాలలో మినహాయిస్తే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాలతో సంప్రందించాల్సి ఉంటుంది. అయితే కొన్ని కీలక నిర్ణయాల విషయంలో రాష్ట్రాలను సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు మోదీ తీసుకుంటున్నారని, ఒక్కోసారి సొంత క్యాబినెట్ మంత్రులకు కూడా తెలియకుండానే ఆయన కీలక నిర్ణయాలు ప్రకటించడం ద్వారా అన్నీ తానే అన్నట్టు వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. అప్పట్లో రిపబ్లిక్ పరేడ్‌లో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ శకటాల ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు. ఇవి బీజేపీ పాలిత ప్రాంతాలు కాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ అంశం ఆ తర్వాత పార్లమెంటు సమావేశాల్లోనూ చర్చకు దారితీసింది.

356వ అధికరణ విషయంలో...

కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు 356వ అధికరణను1959లో తొలిసారిగా విధించారు. భారత సమాఖ్య స్ఫూర్తిపై తొలి దాడిగా అప్పట్లో దీనిని అభివర్ణించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అప్పుడు ప్రధానిగా ఉన్నారు. నెహ్రూ హయాంలో 8 సార్లు ఆర్టికల్-356ను ఉపయోగించారు. ఇందిరాగాంధీ తరచు ఈ అధికరణను ఉపయోగించుకునే వారు. ఆమె హయాలో సుమారు 50 సార్లు ఈ అధికరణ ఉపయోగించినట్టు గణాంకాలు చెబుతాయి. అంటే.. యావరేజ్‌గా ఏడాదికి మూడుసార్లు అని చెప్పుకోవచ్చు. 2014, 2019లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సమాఖ్య వ్యవస్థ ఆటుపోట్లు ఎదుర్కొందనే అభిప్రాయం ఉంది. మోదీ గడచిన ఎనిమిదేళ్ల హయాంలో ఎనిమిది సార్లు ఆర్టికల్ 356 ఉపయోగించారు. అంటే కనీసం ఏడాదికి ఒకసారి ఈ ఆర్టికల్‌ను ఉపయోగించుకున్నారని చెప్పవచ్చు. ఇందిరాగాంధీ హయాంలో కంటే రాష్ట్రాలకు తన హయాంలోనే ఎంతో గౌరవం దక్కినట్టు మోదీ చెబుతుంటారు. అయితే, గత ప్రధానులతో పోల్చుకుంటే ఆయన హయాంలోనే రాష్ట్రాలతో సంబంధాలు బలహీనపడ్డాయనే వాదన కూడా ఉంది.

రాష్ట్రాలతో సంబంధాలలో క్షీణత?

రాష్ట్రాలతో మోదీ సర్కార్ సంప్రదించకుండానే కీలక విధానాలు రూపొందించి, చట్టాలు అమలు చేస్తూ, రాష్ట్రాలను అమలు చేయాలని చెబుతుంటారనేది పలు రాష్ట్రాల అభియోగం. విద్య, కో-ఆపరేటివ్స్, బ్యాంకింగ్ వంటి కీలక అంశాల్లో కేంద్రం ముందుగానే నిర్ణయాలు తీసుకుని, రాష్ట్రాలను అమలు చేయాలని కోరిన సందర్భాలున్నాయని చెబుతారు. శాంతిభద్రతలు అనేవి రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. రాజకీయ అసమ్మతులను అణిచివేసేందుకు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని ఆయా రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం, ఎన్ఐఏ‌ను రాష్ట్రాలకు పంపడం వంటి నిర్ణయాలు ఆయన అవలీలగా తీసుకున్నారనేది విపక్షాల అభియోగం.

కోవిడ్‌ విషయంలో...

రాష్ట్రాలను కలుపుకొని వెళ్లే మహత్తర అవకాశం కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్రానికి వచ్చింది. అయితే మోదీ ప్రభుత్వం మొదట్నించీ ఏకపక్షంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారం చేసేంత వరకూ వేచిచూసిన తర్వాతే కోవిడ్‌ను మహమ్మారిగా కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలను సంప్రదించకుండానే కేవలం నాలుగు గంటల నోటీసుతో లాక్‌డౌన్‌ను మోదీ ప్రకటించారు. కేంద్ర కేబినెట్‌ కూడా ఆయన ముందుగా చెప్పలేదనే ప్రచారం కూడా ఉంది. పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ క్యాబినెట్‌ను సంప్రదించకుండా, రాష్ట్రాలకు ఏమాత్రం ముందస్తు సమచారం లేకుండా ఆయన ఏకపక్ష ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. కోవిడ్ లాక్‌డౌన్‌తో పాటు, రాష్ట్రాలతో సంప్రదించకుండానే నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ యాక్ట్‌ను మోదీ సర్కార్ ఇంపోజ్ చేసింది. రెండేళ్ల తర్వాత కూడా ఆ చట్టం కొనసాగుతూ వచ్చింది.

ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు...

కేంద్రంతో విభేదించే రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలను బెదరించేందుకు మోదీ ప్రభుత్వం తరచు విచారణా సంస్థలైన సీబీఐ, ఈడీలను ఉసిగొలుపుతుంటారనే విమర్శలు ఉన్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట తమకు విధేయులైన ఐఏఎస్, ఐపీఎస్‌లను పంపుతున్నారనే అపప్రద కూడా కేంద్ర హోం శాఖపై ఉన్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు గవర్నర్ల నియామకాన్ని కేంద్రం ఉపయోగించుకుంటోందనడానికి తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ ఉదాహరణలు. అక్కడ గవర్నర్లు-ప్రభుత్వాల మధ్య తరచు విభేదాలు తలెత్తిన సందర్భాలు, గవర్నర్ల మార్పు వంటివి చోటుచేసుకున్నాయి. ఫెడరల్ రిపబ్లిక్‌లో రాష్ట్రాలు, కేంద్రం సమాన భాగస్వాములే అయినప్పటికీ విద్య, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం వంటి పలు పథకాల్లో నరేంద్ర మోదీ ఫోటోలను బ్రాండింగ్ కోసం ఉపయోగించడం వంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్రాల అధికారాలను మరుగుపరచి అంతా తామే అనే విధంగా మోదీని ప్రెజెంట్ చేయడం, ఏకపక్ష పోకడలు, నియంతృత్వ ధోరణని ప్రస్ఫుటం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. రామచంద్ర గుహ గతంలోనూ తన వ్యాసాల్లో ఈ అంశాలను ప్రస్తావించారు.

Updated Date - 2023-02-25T17:03:31+05:30 IST