Safe seat: విమానం టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా.. ?
ABN , First Publish Date - 2023-02-20T20:38:43+05:30 IST
విమానంలో ఏ సీటు భద్రమైనదో అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా..? మీ డౌట్స్‌కు సమాధానమే ఈ ఆర్టికల్..
ఇంటర్నెట్ డెస్క్: బస్సుల్లో వెళ్లేటప్పుడు కిటికీ పక్క సీటులోనే కూర్చోవాలని ఆశపడతాం. ఇక రైళ్ల విషయానికి వస్తే కొందరికి లోయర్ బెర్త్.. మరి కొందరికి అప్పర్ బెర్త్..ఇంకొందరు సైడ్ బెర్త్..ఇలా ఎవరి టేస్టు వారిది. విమానాల్లోనూ అనేక మంది కిటికీ పక్క సీటులోనే కూర్చోవాలని కోరుకుంటారు. మరికొందరేమో ముందు వరుసల్లోని సీట్లలో కూర్చోవడానికి ఇష్టపడతారు. విమానం ల్యాండవగానే కిందకు దిగిపోవచ్చనేది వారి ఆశ. కాళ్లు జాపుకునేందుకు వీలు ఎక్కువగా ఉండే సీట్లను మరికొందరు కోరుకుంటారు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో చాలామంది తమకు నచ్చిన సీటు దొరుకుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తుంటారు. ఏ సీటు భద్రమైనదో అనే ఆలోచన చాలా తక్కువ శాతం మందికి కలుగుతుంది.
అయితే.. గతంలో జరిగిన పలు విమాన ప్రమాదాలను పరిశీలించిన నిపుణులు.. కొన్ని సీట్లు మిగతా వాటికంటే భద్రమైనవని(Safest seat on an Airplane) తేల్చారు. ఆయా సీట్లల్లో కూర్చున్న వారు ప్రమాదం నుంచి గట్టెక్కే అవకాశాలు ఎక్కువ చెప్పారు. వాస్తవానికి విమానప్రమాణం సురక్షితమైనదే. అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా అరుదుగా మాత్రమే ప్రమాదాలు జరుగుతాయి. ఇలా జరిగిన ప్రమాదాల తీవ్రతను విశ్లేషించిన నిపుణులు సీట్ల భద్రత విషయంలో ఓ అంచనాకు వచ్చారు.
దీని ప్రకారం.. ప్రమాద సమయాల్లో విమానం వెనుక వైపు వరుసల్లోని సీట్లల్లో కూర్చునే వారు మరణించే 32 శాతమట. ఇక విమానం మధ్యవరుసల్లోని సీట్లల్లో మరణించే అవకాశాలు 39 శాతం కాగా.. ముందు వరుసల్లోని వారు మరణించే అవకాశం 38 శాతం. అంతేకాకుండా.. విమానం వెనుకవైపు వరుసల్లోని మధ్య సీట్లలో కూర్చున్న వారు ప్రమాదాల్లో మరణించే అవకాశం కేవలం 28 శాతమేనట. అదే సమయంలో సీట్లవరుసల మధ్యలోని నడవాకు(Aisle) ఇరువైపులా కూర్చుంటే మరణించే అవకాశం ఏకంగా 44 శాతమని నిపుణులు తేల్చారు. విమానం కూలిన సందర్భాల్లో తలుపులు పక్కనున్న సీట్లల్లో కూర్చునే వారికి విమానం నుంచి వేగంగా బయటపడే అవకాశం ఉంటుందని 2008లో గ్రీన్ విచ్ యూనివర్శిటీ జరిపిన అధ్యయనంలో తేలింది. అయితే.. ప్రమాదం జరిగిన తీరు, తీవ్రత బట్టి అంతిమంగా ఎవరు ప్రాణాలతో మిగులుతారనేది తెలుస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.