TS Election: ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు
ABN , First Publish Date - 2023-11-14T11:43:23+05:30 IST
రాజకీయ నేతలు పార్టీలు మారడం, ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీ కండువా కప్పుకోవడం సాధారణమైపోయింది. అయినా ప్రజలు వారి వెంట నడుస్తూ.. గెలిపిస్తూ వస్తున్నారు. కానీ, రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల ప్రజలు మాత్రం
ఆ నియోజకవర్గాల ఓటర్ల తీరే వేరు
ఏ పార్టీకైనా ఒక్కసారే అవకాశం
27 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి
వీటిలో గత ఎన్నికల్లో 22 స్థానాలు బీఆర్‌ఎస్ గెలుపొందినవే
(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్): రాజకీయ నేతలు పార్టీలు మారడం, ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీ కండువా కప్పుకోవడం సాధారణమైపోయింది. అయినా ప్రజలు వారి వెంట నడుస్తూ.. గెలిపిస్తూ వస్తున్నారు. కానీ, రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల ప్రజలు మాత్రం ప్రతిసారీ భిన్నమైన తీర్పు ఇస్తున్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన పార్టీని ఓడిస్తున్నారు. అధికార పక్షం, విపక్షం అనే తేడా లేకుండా.. తిరస్కరిస్తున్నారు. రాష్ట్రంలోని 27 నియోజకవర్గాల్లో ఇలాంటి విలక్షణమైన ఓటర్లున్నారు. అక్కడ ఏ పార్టీకైనా ఒక్కసారే అవకాశం ఇస్తున్నారు. మరుసటి ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇంకా విశేషమేంటంటే.. గత మూడు ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల్లో ప్రతిసారీ వేర్వేరు పార్టీలు గెలిచాయి. ఆ 27 చోట్లా ప్రతిసారీ గెలిచే పార్టీ మారుతూ వస్తోంది. అయితే వీటిలో కొన్నిచోట్ల పార్టీ గుర్తు మారుతున్నా.. గెలిచిన అభ్యర్థి మాత్రం ఒక్కరే ఉంటున్నారు. ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఇలాంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆ జిల్లాలోని అశ్వారావుపేట నుంచి 2009లో కాంగ్రెస్ గెలవగా, 2014లో వైసీపీ, 2018లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక వైరాలో తొలుత సీపీఐ అభ్యర్థి చంద్రావతి, ఆ తర్వాత వైసీపీ నుంచి మదన్‌లాల్, 2018లో స్వతంత్ర అభ్యర్థి రాములునాయక్ గెలిచారు. కాగా, ఖమ్మం నుంచి 2004లో సీపీఎం, 2009లో టీడీపీ (తుమ్మల), 2014లో కాంగ్రెస్ (పువ్వాడ) అభ్యర్థులు గెలుపొందారు. 2018లో ఆ స్థానాన్ని బీఆర్‌ఎస్ (పువ్వాడ) కైవసం చేసుకుంది. ఇక కొత్తగూడెంలో 2009లో సీపీఐ, 2014లో బీఆర్‌ఎస్, 2018లో కాంగ్రెస్ గెలిచాయి.
మరికొన్ని చోట్లా ఇదే పరిస్థితి..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండ స్థానాన్ని 2009లో కాంగ్రెస్, 2014లో సీపీఐ, 2018లో బీఆర్‌ఎస్ గెలుచుకున్నాయి. ఇక్కడి నుంచి రవీంద్రకుమార్‌వరుసగా రెండుసార్లు గెలిచినా.. ఓసారి సీపీఐ నుంచి, మరోసారి బీఆర్‌ఎస్ నుంచి విజయం సాధించారు. వనపర్తిలోనూ ఇదే పరిస్థితి. 2009లో టీడీపీ గెలవగా, 2014లో కాంగ్రెస్, 2018లో బీఆర్‌ఎస్ (ఎస్.నిరంజన్‌రెడ్డి) గెలిచాయి. అలాగే మక్తల్‌లో తొలుత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్, గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపొందాయి. కల్వకుర్తిలోనూ గత మూడు ఎన్నికల్లో వరుసగా టీడీపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విజయం సాధించాయి. నిర్మల్, ముథోల్, రామగుండం, జగిత్యాల, ములుగు, డోర్నకల్, నర్సంపేట, ఉప్పల్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, తాండూరు, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోనూ ఇలాగే జరిగింది. ఇక హైదరాబాద్‌లో ఈ జాబితాలో జూబ్లీహిల్స్, సనత్‌నగర్, ముషీరాబాద్, కంటోన్మెంట్ స్థానాలున్నాయి. కాగా, ఈ 27 నియోజకవర్గాల్లో గత (2018) ఎన్నికల్లో 22 చోట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఐదు చోట్ల ఇతర పార్టీల అభ్యర్థులు గెలిచినా.. ఆ తరువాత వారు కూడా బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఇదిలా ఉండగా.. 2014లో ఇతర పార్టీల నుంచి గెలిచి బీఆర్‌ఎ్‌సలో చేరి.. తిరిగి 2018లో అదే స్థానం నుంచి అదే అభ్యర్థి గెలిచిన సందర్భాలూ ఉన్నాయి. ఉదాహరణకు ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కాంగ్రెస్ తరపున 2014లో గెలిచి, తిరిగి 2018లో బీఆర్‌ఎస్ తరపున విజయం సాధించారు. ఇలా జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, చేవెళ్ల, శేరిలింగంపల్లి, దేవరకొండ, మక్తల్, నిర్మల్, ముథోల్, డోర్నకల్ అభ్యర్థులున్నారు.