KCR: హైదరాబాద్ వస్తే ఎక్కడుండాలి? మాజీ సీఎంకు కొత్త సమస్య!
ABN , First Publish Date - 2023-12-08T03:33:18+05:30 IST
ప్రస్తుతం ఫామ్‌హౌ్‌సలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ వస్తే ఎక్కడుంటారు? ఈ ప్రశ్న ఆయన్నూ వేధిస్తోంది.
పాతిక కార్లు పట్టే ఇల్లు కావాలి!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్త సమస్య
నందినగర్‌లో సొంతిల్లున్నా భేటీలకు సరిపోదు
ప్రగతిభవన్, సచివాలయం కట్టించాను
సొంతానికి ఇంటిని కట్టుకోలేకపోయానని ఆవేదన
ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో హైదరాబాద్ ఎమ్మెల్యేలతో కేసీఆర్
నేతల వెతుకులాట.. తన ఇల్లు ఇచ్చేస్తానన్న ఓ ఎమ్మెల్యే
హైదరాబాద్ సిటీ బ్యూరో ప్రతినిధి, డిసెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఫామ్‌హౌ్‌సలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ వస్తే ఎక్కడుంటారు? ఈ ప్రశ్న ఆయన్నూ వేధిస్తోంది. బంజారాహిల్స్ నందినగర్‌లో ఆయనకు సొంతిల్లు ఉన్నా.. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించేందుకు ఏమాత్రం అనువుగా లేదు. కేసీఆర్‌కు అనువైన ఇంటి కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకబు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రగతిభవన్‌లో కేసీఆర్ నివాసం ఉన్న ఇంటి విస్తీర్ణం 15వేల చదరపు అడుగుల దాకా ఉండేది. పెద్ద సంఖ్యలో వచ్చే వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలం ఉండేది. ఇంట్లో.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల కోసం వెయ్యి మందితో కలిసి సమావేశం జరిపేందుకు వీలుగా అన్ని వసతులూ ఉండేవి.
నా ఇంటిని ఇచ్చేస్తా సార్
3 రోజుల క్రితం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి బీఆర్‌ఎస్ తాజా ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన ఇంటి కష్టాల్ని చెప్పుకొన్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ‘నా హయాంలో ప్రగతిభవన్ నిర్మించాను. సచివాలయాన్ని కట్టించాను. నా సొంతానికి మాత్రం ఓ ఇల్లు కట్టుకోలేపోయాను’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారని.. ఆ మాటలు విని పలువురు నేతలు తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. సెంట్రల్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే ఒకరు ఇటీవలే కట్టించిన తన కొత్త ఇంటిని ఇచ్చేస్తానని కేసీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది. అయితే.. కనీసం పాతిక కార్లు పార్కింగ్ చేసుకునేంత విశాలంగా ఉండాలి కదా? అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14లోని నందినగర్‌లో కేసీఆర్‌కు సొంతిల్లు ఉంది. 600 గజాలకు పైనే విస్తీర్ణంలో ఉన్న స్థలంలో 400 గజాల్లో జీప్లస్ వన్ భవనం ఉంది. అయితే, ఇరుకైన రోడ్డు, రాకపోకలకు అనువుగా లేకపోవడంతో అక్కడ ఉండేందుకు కేసీఆర్ ఇష్టపడటం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని అవసరాలకు సరిపోయే ఇంటి కోసం ఇప్పుడు వెతుకులాట మొదలైంది.