డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలి

ABN , First Publish Date - 2023-09-05T04:07:36+05:30 IST

హైకోర్టు ఆదేశాల మేరకు గద్వాల ఎమ్మెల్యేగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను గుర్తిస్తూ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది.

డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలి

కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌

కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని

అసెంబ్లీ కార్యదర్శి, సీఈవోలకు లేఖ

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి

ఆహ్వానించండి: డీకే అరుణ

సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

హైదరాబాద్‌/న్యూఢిల్లీ/గద్వాల, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల మేరకు గద్వాల ఎమ్మెల్యేగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను గుర్తిస్తూ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ వికా్‌సరాజ్‌కు లేఖ రాసింది. నోటిఫికేషన్‌తో పాటు కోర్టు ఉత్తర్వుల కాపీని కూడా పంపించింది. తప్పుడు అఫిడవిట్‌ సమర్పణకు సంబంధించి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని హైకోర్టు.. గత నెల 24న అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో, ఆయన ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డీకే అరుణ.. మూడ్రోజుల కిందట అసెంబ్లీ కార్యదర్శిని, చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ వికా్‌సరాజ్‌ని కలిసి అభ్యర్థించారు. అంతకుముందే డీకే అరుణ సీఈసీ వద్దకు కూడా వెళ్లారు. తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలన్న కోర్టు ఉత్తర్వుల కాపీని అందజేశారు. ఇక సీఈసీ నోటిఫికేషన్‌ జారీతో అరుణను గద్వాల ఎమ్మెల్యేగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ ప్రచురించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, తక్షణమే డీకే అరుణతో అసెంబ్లీ స్పీకర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలంటూ బీజేపీ సీనియర్‌ నేత ఎన్‌.రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-09-05T04:09:02+05:30 IST