OU Student JAC: ఓయూ రణరంగం

ABN , First Publish Date - 2023-03-25T05:21:28+05:30 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ఆవరణలో చేపట్టిన ‘నిరుద్యోగుల మహా నిరసన దీక్ష’ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

OU Student JAC: ఓయూ రణరంగం

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ఆవరణలో చేపట్టిన ‘నిరుద్యోగుల మహా నిరసన దీక్ష’ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక వైపు ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు.. మరోవైపు బీఎర్ఎస్‌వీ విద్యార్థి సంఘం నాయకుల ‘గో బ్యాక్‌ రేవంత్‌’ నినాదాలతో ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ఆవరణ దద్దరిల్లింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే మంత్రి కేటీఆర్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని, లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు, వందలాది మంది విద్యార్థులు శుక్రవారం ఉదయమే ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట దీక్ష చేపట్టారు.

ఈ దీక్షకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి హాజరు కావాల్సి ఉండగా, పోలీసులు ఆయన్ను గృహనిర్బంధం చేశారు. అయితే, ఓయూలో దీక్షకు రేవంత్‌ రావడానికి యత్నించడంపై ఓయూ బీఆర్ఎస్‌వీ నేతలు భగ్గుమన్నారు. ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలోనే, నిరుద్యోగ దీక్ష జరుగుతున్న ప్రదేశానికి సమీపంలోనే ‘గో బ్యాక్‌ రేవంత్‌’ అంటూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో.. ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్‌ఎస్‌వీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరు వర్గాల విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతను మరింత పెంచింది.

ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలువురు విద్యార్థి నాయకులు పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అయినప్పటీకీ పోలీసులు వెనక్కి తగ్గకుండా ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల నినాదాలు, పోలీసులతో ఓయూ రణరంగాన్ని తలపించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని సీబీఐ చేత విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఓయూ జేఏసీ, టీఎస్‌ జేఏసీ విద్యార్థి నాయకులు డిమాండ్‌ చేశారు. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి గన్‌పార్కు వరకు నిరుద్యోగ మార్చ్‌ను నిర్వహించేందుకు యత్నించారు. వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే మంత్రి కేటీఆర్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. లీకేజీ వ్యవహారాన్ని సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అదేవిధంగా టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌తో పాటు, బోర్డు సభ్యులను తొలగించి, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌.. విద్యార్థులను రెచ్చగొట్టి నిరుద్యోగ దీక్షల పేరుతో వర్సిటీలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తే సహించేది లేదని బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.

Updated Date - 2023-03-25T05:21:28+05:30 IST