TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ సెటైరికల్ పోస్టర్... ఎక్కడంటే..

ABN , First Publish Date - 2023-03-22T10:18:01+05:30 IST

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ సెటైరికల్ పోస్టర్...  ఎక్కడంటే..

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు (Posters) కలకలం రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఓయూ జేఏసీ చైర్మన్‌ అర్జున్‌బాబు పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్నాపత్రాలు లభిస్తాయంటూ సెటైర్లు విసురుతూ పోస్టర్లు అతికించారు.

పోస్టర్‌లో ఏముందంటే...

‘‘తప్పు చేసిన టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా కేవలం పరీక్షను రద్దు చేయం ఏంటి? శిక్ష ఎవరికి బోర్డుకా, విద్యార్థులకా?. ఇది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పనితీరు.

  • ముఖ్యమంత్రి గారు.. మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి

  • ప్రశ్నాప్రతాల లీకేజీలో మీ కుటుంబసభ్యుల పాత్రలేదని చెప్పడానికి వెంటనే సీబీఐకి అప్పగించి టీఎస్‌పీఎస్సీ బోర్డును, సంబంధిత శాఖ మంత్రిని భర్తరఫ్ చేయండి.

  • నష్టపోయిన విద్యార్థులకు ఈనెల నుంచే నెలకు రూ.10000 చొప్పున మళ్లీ పరీక్ష నిర్వహించే వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి’’ అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.

కాగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓవైపు పరీక్ష రాసిన అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గతకొద్దిరోజులుగా టీఎస్‌పీఎస్సీ వ్యవహారం అభ్యర్థులను విస్మయానికి గురిచేస్తోంది. టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలంటూ డిమాండ్‌లు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులను ఐదో రోజు సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. మరికాసేపట్లో హిమాయత్‌నగర్ సిట్‌ఆఫీస్‌లో విచారణ జరుగనుంది. గ్రూప్ 1 రాసిన వారిలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు కొందరున్నట్లు సిట్ గుర్తించింది. కమిషన్‌లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 8 మంది గ్రూప్ 1 రాసినట్లు గుర్తించింది. ఈ 8 మందికి నోటీసులు ఇచ్చి.. సిట్ విచారించనుంది. ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో పెన్ డ్రైవ్‌లను సిట్ స్వాధీనంచేసుకుంది. అయితే పెన్‌డ్రైవ్‌లకు కూడా వీరు పాస్‌వర్డ్ పెట్టినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మిని సిట్ అధికారులు విచారించారు.

Updated Date - 2023-03-22T10:29:14+05:30 IST