TSPSC Paper Leak: ప్రవీణే పేపర్ ఇచ్చాడు
ABN , First Publish Date - 2023-03-24T06:57:36+05:30 IST
‘‘మా ఆవిడ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి. ఆమె ద్వారా ప్రవీణ్ పరిచయం. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రవీణే అందజేశాడు.
సిట్ దర్యాప్తులో వెల్లడించిన షమీమ్.. షమీమ్ భార్య టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి
వారి ఇంట్లో సోదాలు.. ఆధారాలు లభ్యం!.. షమీమ్, సురేశ్, రమేశ్‌కు 14 రోజుల రిమాండ్
12కు చేరుకున్న అరెస్టులు.. సిట్ రాడార్‌లో మరో ముగ్గురు.. వారిని విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ(ఆంధ్రజ్యోతి): ‘‘మా ఆవిడ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి. ఆమె ద్వారా ప్రవీణ్ పరిచయం. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రవీణే అందజేశాడు. అయితే.. అందుకు సంబంధించి ఎలాంటి సొమ్ము చెల్లించలేదు’’ అని టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 10వ నిందితుడిగా ఉన్న షమీమ్ సిట్ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసుతో ప్రమేయమున్న నిందితుల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో షమీమ్‌కే అత్యధికంగా 127 మార్కులు వచ్చినట్లు ఇప్పటికే సిట్ నిర్ధారించింది. షమీమ్ శంషాబాద్‌లోని ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య 2013 గ్రూప్-2లో ఉద్యోగం సాధించి, ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో గ్రూప్-4 పరీక్షల విభాగం సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు. దాంతో సిట్ అధికారులు ఎల్‌బీనగర్‌లోని గుంటి జంగయ్య కాలనీలోని షమీమ్ ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. షమీమ్‌తోపాటు..
ఈ కేసులో 11, 12వ నిందితులుగా ఉన్న సురేశ్, రమేశ్‌లను గురువారం సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ ముగ్గురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కాగా.. సురేశ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా టెక్నికల్ విభాగంలో పనిచేసేవాడు. రమేశ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా.. ఓ టీఎస్‌పీఎస్సీ సభ్యుడి వద్ద పీఏగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది. బుధవారం అదుపులోకి తీసుకున్న నలుగురిలో.. వెంకటేశ్ అనే ఉద్యోగికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సిట్ గుర్తించింది. దాంతో ఆయనను వదిలిపెట్టినట్లు సమాచారం. కాగా.. షమీమ్, సురేశ్, రమేశ్ విచారణలో సిట్ మరో ముగ్గురు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్రను గుర్తించినట్లు తెలిసింది. దాంతో వారిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మంది అరెస్టవ్వగా.. మరో మూడు అరెస్టులు జరగనున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు.. గ్రూప్-1, ఇతర పరీక్షలు రాసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను గుర్తించేందుకు సిట్ కసరత్తు ప్రారంభించింది. గ్రూప్-1 తర్వాత ఏఈఈ, డీఏవో, తదితర పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
దర్యాప్తునకు సహకరించని రాజశేఖర్!
ఈ కేసులో సిట్ తొలుత అరెస్టు చేసిన 9 మందిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని, విచారించిన విషయం తెలిసిందే. వారి కస్టడీ గడువు గురువారంతో ముగియడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే.. ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి సిట్ దర్యాప్తునకు సహకరించలేదని తెలిసింది. ముఖ్యంగా రాజశేఖర్‌రెడ్డి వద్ద ఐదు పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకోగా.. అన్నీ పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ అని సిట్ గుర్తించింది. వాటి పాస్‌వర్డ్‌లను చెప్పాలని సిట్ కోరగా.. ‘‘గుర్తు లేదు..! !’’ అని సమాధానమిచ్చినట్లు తెలిసింది. దాంతో సిట్ అధికారులు ఫోరెన్సిక్ సాయంతో వాటిని క్రాక్ చేయించారు. ఆ పెన్‌డ్రైవ్‌లలో తుడిచిపెట్టుకుపోయిన డేటాను కూడా రికవరీ చేశారని, ఆ సమాచారాన్ని డిజిటల్ ఆధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ తొమ్మిది మందిలో రాజశేఖర్ సహా.. ఒకరిద్దరు విచారణకు సహకరించలేదని, వారిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని సిట్ నిర్ణయించినట్లు సమాచారం. . తాజాగా అరెస్టయిన ముగ్గురిని విచారించేందుకు సిట్ సిద్ధమవుతోంది. మరోవైపు ఈ కేసులో తొలి 9 మంది నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు బెయిల్‌కు నిరాకరించింది.