PRC : పీఆర్సీకి ఓకే

ABN , First Publish Date - 2023-10-03T03:03:07+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం రెండో వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

PRC : పీఆర్సీకి ఓకే

రాష్ట్ర రెండో వేతన సవరణ కమిషన్‌ ఏర్పాటు

ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి శివశంకర్‌ నేతృత్వం

కమిషన్‌లో సభ్యుడిగా విశ్రాంత ఐఏఎస్‌ రామయ్య

నివేదిక సమర్పించడానికి ఆరు నెలల గడువు

అప్పటి వరకూ 5 శాతం మధ్యంతర భృతి

ఐఆర్‌ అక్టోబరు 1 నుంచే.. నవంబరు వేతనాలతో

పార్లమెంటు ఎన్నికల తర్వాతే ఫిట్‌మెంట్‌కు చాన్స్‌

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం రెండో వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుత ఓఎస్డీ ఎన్‌.శివశంకర్‌ నేతృత్వంలో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విశ్రాంత ఐఏఎస్‌, భూ రికార్డుల నిపుణుడు బి.రామయ్య ఇందులో సభ్యుడిగా ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కమిషన్‌ ఆరు నెలల్లోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న వేతనాలపై అధ్యయనం చేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం ఇదివరకే ఇచ్చిన హామీల అమలుకు ప్రతిబంధకాలు లేకుండా, భవిష్యత్తు పథకాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని నివేదికను అందించాలని ప్రభుత్వం కమిషన్‌కు నిర్దేశించింది. నివేదిక తయారీకి అవసరమైన కసరత్తు చేయడానికి వీలుగా కమిషన్‌కు కావాల్సిన ఉద్యోగులు, నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. మరోవైపు, కమిషన్‌ నివేదిక వచ్చేలోపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది. అంటే, నవంబరు నెలలో తీసుకునే వేతనాల్లో మూలవేతనంపై 5 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగులు అందుకోనున్నారు.

తెలంగాణలో రెండో పీఆర్సీ

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండో వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ)ని ప్రభుత్వం తాజాగా నియమించింది. నిజానికి, 2018 జూలై ఒకటో తేదీ నుంచి తొలి వేతన సవరణ కమిషన్‌ నివేదిక అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో మే 18న ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది 7.5 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. చర్చల తర్వాత ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేసింది. వాస్తవానికి ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ జరగాలి. ఈ నేపథ్యంలో, 2023 జూలై ఒకటో తేదీకే తొలి వేతన సవరణ గడువు ముగిసింది. రెండో పీఆర్సీ, ఫిట్‌మెంట్‌ అప్పటి నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. ఫలితంగా, నివేదిక అనంతరం రెండో వేతన సవరణ కమిషన్‌ ప్రకారం వేతనాల పెరుగుదల ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానుంది.

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతే ఫిట్‌మెంట్‌

త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతుండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను తృప్తిపరచడానికే తెలంగాణ ప్రభుత్వం 5 శాతంమధ్యంతర భృతిని ప్రకటించింది. అదే సమయంలో, వేతన సవరణ నివేదికను అందించడానికి ఆరు నెలల గడువు ఇచ్చింది. కానీ, నిర్ణీత గడువులోగా నివేదిక సర్కారు చేతికందే అవకాశాల్లేవు. దాంతో, వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతే ఫిట్‌మెంట్‌ అమలుకానుందని ఉద్యోగ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - 2023-10-03T03:03:07+05:30 IST