Budget 2025: భట్టికి సీఎం ఆలింగనాలు!
ABN , Publish Date - Mar 20 , 2025 | 06:09 AM
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి అసెంబ్లీలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా మరోమారు ఆలింగనం చేసుకున్నారు.

బడ్జెట్‌కు ముందు.. తర్వాత కౌగిలింత
బల్లలు చరుస్తూ భట్టి ప్రసంగానికి అధికార పార్టీ సభ్యుల మద్దతు..
సిగ్గు.. సిగ్గు.. గోవిందా.. నినాదాలు
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి అసెంబ్లీలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా మరోమారు ఆలింగనం చేసుకున్నారు. బుధవారం ఉదయం 11:06 గంటలకు బడ్జెట్ ప్రతులతో భట్టి సభలోకి రాగానే మంత్రులంతా భట్టిని అభినందించారు. ఉదయం 11:07 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవ్వగా.. ప్రసంగానికి సమర్థనగా బల్లలు చరుస్తూ అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. ఇటు ఆకుపచ్చ కండువాలతో సభకు వచ్చిన బీఆర్‌ఎస్ సభ్యులు బడ్జెట్ ప్రసంగం జరుగుతున్నంత సేపు ‘షేమ్.. షేమ్.. సిగ్గు.. సిగ్గు..’ నినాదాలు చేశారు. పలు సందర్భాల్లో బీఆర్‌ఎస్ పదేళ్ల వైఫల్యాలపై అధికార పార్టీ సభ్యులు కూడా అవే నినాదాలతో బదులిచ్చారు. వైద్య రంగంపై భట్టి మాట్లాడుతుండగా.. గోవిందా.. గోవిందా.. అంటూ బీఆర్‌ఎస్ నినదించగా.. బీఆర్‌ఎస్ గోవిందా.. బీఆర్‌ఎస్ గోవిందా.. అంటూ అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. రుణమాఫీపై మాట్లాడుతుండగా.. బోగస్.. బోగస్ అంటూ బీఆర్‌ఎస్ నినాదాలు చేయగా.. దానికి ప్రతిగా కాంగ్రెస్ కూడా నినాదాలు చేసింది. మధ్యాహ్నం 12:48 గంటలకు బడ్జెట్ ప్రసంగం పూర్తవ్వగా.. సీఎంతో పాటు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు భట్టిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్‌కుమార్ శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
స్వీట్లు పంచిన వేముల వీరేశం..
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం లభించడంపైౖ కాంగ్రెస్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సభలో అఽధికార, విపక్ష సభ్యులకు స్వీట్లు పంచారు. సభ్యులందరి వద్దకు వెళ్లి.. ప్రత్యేకంగా స్వీట్లు అందించారు.