Share News

Budget 2025: హామీలకు గ్యారెంటీ!

ABN , Publish Date - Mar 20 , 2025 | 04:43 AM

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం రూ.86 లక్షల కోట్లు. పదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేస్తాం. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలంగాణ నమూనా.

Budget 2025: హామీలకు గ్యారెంటీ!
Telangana Budget 2025

  • మొత్తం బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లు.. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకే రూ.లక్ష కోట్లు

  • ఆరు హామీలతోపాటు యువ వికాసానికి నిధులు

  • 5 లక్షల మంది యువతకు ఒక్కొక్కరికి 3 లక్షలు

  • సమీకృత గురుకులాలకు 2900 కోట్లు

  • ఇందిర గిరి జల వికాసానికి 600 కోట్లు

  • ఇటీవల ప్రారంభించిన పథకాలకు కేటాయింపులు

  • బడ్జెట్లో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యం

  • కూలీలకు 600 కోట్లతో ఆత్మీయ భరోసా

  • ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యం.. 12,571 కోట్లు

  • విద్యా రంగానికి పెద్దపీట.. ఎమ్మెల్యేలకూ నిధులు

  • అంచనాలకు దూరంగా పన్ను, పన్నేతర రాబడి

  • కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, వాటాల్లో ఊరట

  • 2025-26 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం రూ.86 లక్షల కోట్లు. పదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేస్తాం. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలంగాణ నమూనా. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ‘తెలంగాణ రైజింగ్‌-2050’ ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాం. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించాం. రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపేందుకు అందరూ సహకరించాలి.

- ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రైతుకు భరోసా, బోనస్‌! రైతు కూలీలకు చేయూత! మహిళలకు మహాలక్ష్మి.. గృహ జ్యోతి! యువతకు రాజీవ్‌ యువ వికాసం! నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. కల్యాణ లక్ష్మి.. ఆరోగ్యశ్రీ! వెరసి.. ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు ప్రభుత్వం బడ్జెట్లో నిధుల గ్యారెంటీ ఇచ్చింది! ఆయా పథకాలకు తగినన్ని నిధులు కేటాయించింది! విద్యకు పెద్దపీట వేసింది! ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికే ఐదో వంతు నిధులను కేటాయించింది! యువతకు ఉపాధి చూపుతూ.. రైతుకు ‘భరోసా’ కల్పిస్తూ.. మహిళల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను తీర్చిదిద్దింది. సంక్షేమానికి, అభివృద్ధికి జోడు గుర్రాల తరహాలో ప్రాధాన్యమిచ్చింది! 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ వ్యయ పట్టిక (బడ్జెట్‌)ను శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క; శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం ప్రవేశపెట్టారు. మొత్తం వ్యయాన్ని రూ.3,04,965 కోట్లుగా ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. అలాగే, జీతాలు, పింఛన్లు, ఇతరత్రా ఖర్చుల వంటి నిర్వహణ పద్దు రూ.1,30,154 కోట్లు కాగా.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులిచ్చే ప్రగతి పద్దు రూ.1,74,811 కోట్లు!! ప్రస్తుత (2024-25) ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం గత ఏడాది రూ.2,91,159 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆశించిన మేర ఆదాయం రాకపోవడం, వ్యయాన్ని కూడా తగ్గించుకోవాల్సి రావడంతో ఈ బడ్జెట్‌ను రూ.2,65,934 కోట్లకు కుదించింది. అయినా.. రూ.39,030 కోట్ల (14.67ు)ను పెంచి ఈ ఏడాది బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. బడ్జెట్‌లో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, సాగునీటి పారుదల, పురపాలక- పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ రంగాలకు ప్రాధాన్యమిచ్చింది.


గ్యారెంటీలకే లక్ష కోట్లు!

సర్కారు ఆరు గ్యారెంటీలతోపాటు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకే రూ.1,04,329 కోట్లను కేటాయించింది. మొత్తం బడ్జెట్లో ఇది 34.21 శాతం కావడం గమనార్హం. ఇందులో ఆరు గ్యారెంటీ (రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్న ధాన్యానికి బోనస్‌, ఆరోగ్యశ్రీ, సబ్సిడీ సిలిండర్‌, ఆత్మీయ భరోసా)లకే రూ.56,084 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. వీటితోపాటు రాజీవ్‌ యువ వికాసం, యంగ్‌ ఇండియా గురుకులాలు, 100 శాతం సౌర శక్తి గ్రామాలు, ఇందిరా గిరి జల వికాసం, టూరిజం ప్రాజెక్టులు, నగరాభివృద్ధి పథకాలకూ నిధులు కేటాయించింది. నిజానికి, ఇవన్నీ కొత్త పథకాలే అయినా.. బడ్జెట్‌కు ముందే వీటిని ప్రారంభించేసింది. అందుకే, ఈ బడ్జెట్లో తొలిసారిగా నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించే ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 5 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఈ బడ్జెట్లో ఆయా సంక్షేమ శాఖల ద్వారా రూ.6000 కోట్లు ఖర్చు చేస్తామని స్పష్టం చేసింది. అలాగే, అన్ని కులాల విద్యార్థులూ ఒకే చోట చదువుకునేలా నియోజకవర్గానికో యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సర్కారు.. ఇటీవల కొన్నిటికి శంకుస్థాపనలు కూడా చేసిన విషయం తెలిసిందే. అందుకే, వీటి నిర్మాణానికి ఏకంగా రూ.2,900 కోట్లను కేటాయించింది. గ్రామాల్లో నూటికి నూరు శాతం సౌర వెలుగులు విరజిమ్మే పథకానికి రూ.1500 కోట్లు కేటాయించింది. సీఎం రేవంత్‌ రెడ్డి గ్రామం కొండారెడ్డిపల్లి, కేసీఆర్‌ గ్రామం ఎర్రవల్లి వంటి గ్రామాలను 100 శాతం సౌరశక్తి గ్రామాలుగా మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక, గిరిజన రైతులకు సోలార్‌ పంపు సెట్లను అందించే ‘ఇందిర గిరి జల వికాసం’ పథకానికి ఈసారి నిధులు కేటాయించింది. అయితే, రాబోయే నాలుగేళ్లలో రూ.12,600 కోట్ల ఖర్చుతో 2.1 లక్షల పంపుసెట్లను అందించే ఈ పథకానికి ఈ ఏడాది కేవలం రూ.600 కోట్లనే కేటాయించడం గమనార్హం. ఇక, బడ్జెట్‌కు ముందే అమల్లోకి తెచ్చిన మరో పథకం ‘ఇందిర ఆత్మీయ భరోసా’! దీనిని ఫిబ్రవరి 26న ప్రారంభించింది. ఈ పథకం కింద వ్యవసాయ రైతు కూలీలకు ఏడాదికి రెండు విడతల్లో రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. మొదటి దశలో 18,180 మంది లబ్ధిదారులకు రూ.6000 చొప్పున అందజేసింది. ఈ పథకానికి బడ్జెట్లో తొలిసారిగా రూ.600 కోట్లను కేటాయించింది. అంటే, రాబోయే ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఈ పథకాన్ని వర్తింపజేయనుందని తెలుస్తోంది!!


విద్యకు, ఇంటికి పెద్దపీట

బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల ఇంటి నిర్మాణానికి, విద్యకు పెద్దపీట వేసింది. నిరుపేదలకు ఇంటిని నిర్మించి ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.12,571 కోట్లను కేటాయించింది. బడ్జెట్లో విద్యకు రూ.23,108 కోట్లు ఇచ్చింది. యంగ్‌ ఇండియా స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలకు కేటాయించిన నిధులు, డైట్‌ చార్జీలు దీనికి అదనం. అలాగే, యువతకు నియోజక వర్గానికో అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇక, రూ.2000 ఆసరా పింఛనును 4000కు పెంచుతామని ప్రకటించినా.. ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెద్దగా పెంచలేదు. ఈసారి ‘నగరాభివృద్ధి’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి.. దానికి వెయ్యి కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ఎమ్మెల్యేలకూ భారీగానే నిధులు రానున్నాయి. స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద బీఆర్‌ఎస్‌ హయాంలో కేవలం 800 కోట్లు మాత్రమే కేటాయించగా.. ఈసారి బడ్జెట్లో ఏకంగా 3,300 కోట్లు కేటాయించడం గమనార్హం.


మెట్రో, మూసీ, ఫ్యూచర్‌ సిటీ.. పీపీపీలే!

ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన మెట్రో విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్‌, మూసీ నది సుందరీకరణ, ఫ్యూచర్‌ సిటీ తదితర పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ, ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం భూ సేకరణ పరిహారానికి రూ.1,525 కోట్లు మినహా మిగిలిన వాటికి ఒక్క పైసా కేటాయించలేదు. దాంతో, వాటిని రుణాలు, పీపీపీ పద్ధతిలోనే చేపట్టనున్నారని అర్థమవుతోంది. మెట్రో రెండో దశ కింద 76.4 కి.మీ పొడవుతో 6 కారిడార్లను రూ.24,269 కోట్లను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో 30ు నిధులను తాను సర్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ... దీనికీ పైసా కేటాయించకపోవడం విశేషం. ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీకి ఎక్కువ నిధులు ఇస్తారనుకుంటే.. కేవలం రూ.100 కోట్లతో ప్రభుత్వం సరిపెట్టడం గమనార్హం.


రాష్ట్రంలో నిరాశ.. కేంద్రంపై ఆశ

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆశ, నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతోంది! రాష్ట్ర సొంత ఆదాయం అంచనా వేసిన మేరకు రావడంలేదు. ఉదాహరణకు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం రూ.1,38,181 కోట్లు అని అంచనా వేస్తే.. సవరించిన అంచనాలకు వచ్చేసరికి అదికాస్తా రూ.1,29,406 కోట్లకు తగ్గిపోయింది. అయినా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,45,419 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇందుకు ప్రధాన కారణం రిజిస్ట్రేషన్‌ ఆదాయమే. ఈ ఒక్క శాఖలోనే దాదాపు రూ.4,400 కోట్ల ఆదాయాన్ని పెంచేశారు. తద్వారా, భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీల్లో భారీ పెరుగుదల ఉండనుందని స్పష్టమవుతోంది. అలాగే, మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా దాదాపు రూ.2000 కోట్లు పెంచారు. ఇందుకు కొత్త బ్రాండ్లు రానుండడం, మద్యం వినియోగం పెరగనుండడం ఒక కారణం. వీటికితోడు చార్జీల పెంపు ఉండే అంశాన్ని కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. ఇక, పన్నేతర ఆదాయం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35,208 కోట్లు వస్తుందని అంచనా వేశారు. కానీ, సవరించిన అంచనాల్లో దానిని రూ.25,814 కోట్లకు కుదించారు. కానీ, రాబోయే ఆర్థిక సంవత్సరానికి మాత్రం రూ.31,618 కోట్లకు పెంచేశారు. దాంతో, ఈ ఏడాది భూముల అమ్మకాలు భారీగానే ఉండనున్నాయని అర్థమవుతోంది. రాష్ట్రంలో ఆదాయం తగ్గినా కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరుగుతుండడం సర్కారుకు కాస్త ఊరట. ఉదాహరణకు, బీఆర్‌ఎస్‌ సర్కారు ఉన్నప్పుడు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద భారీగా అంచనాలు వేసినా.. నిధులు తక్కువగానే వచ్చేవి. 2023-24లో వచ్చింది కేవలం రూ.9,933 కోట్లే! కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.21,636 కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటే.. రూ.19,836 కోట్లు వచ్చాయి. గత బడ్జెట్లతో పోలిస్తే ఈ విభాగంలోనే పది వేల కోట్ల వరకూ అదనంగా రావడం విశేషం. అలాగే, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు 2024-25 సవరించిన అంచనా 27,050 కోట్లు కాగా.. ఈసారి రూ.29,899 కోట్లు రావచ్చని అంచనా వేశారు. ఇక, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా సర్కారు భారీగానే అప్పులు చేయనుంది. బహిరంగ మార్కెట్‌ రుణాలుగా రూ.64,539 కోట్లు సేకరిస్తామని పేర్కొంది. ఫలితంగా.. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు ఎప్పట్లాగే రూ.8 లక్షల కోట్లకుపైనే ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం తగ్గడంతో ఖర్చూ తగ్గిపోయింది. అయినా.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి దాదాపు 15 శాతం అధికంగానే బడ్జెట్‌ను అంచనా వేయడం విశేషం!!


స్వల్పంగా మూలధన వ్యయం కేటాయింపులు పెంపు

రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మూలధన వ్యయం కింద కేటాయింపులు స్వల్పంగా పెంచింది. గతేడాది (2024-25)తో పోలిస్తే రూ.3,018 కోట్లు అదనం. 2025-26లో మూలధన వ్యయం కింద బడ్జెట్‌లో రూ.36,504 కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో మూలధన వ్యయం కోసం 33,486.50 కేటాయిస్తూ ప్రతిపాదనలు చేసినా దాన్ని రూ.33,087.85 కోట్లకు సవరించింది. 2024-25లో గత జనవరి వరకూ 29,081.33 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. గతేడాది కంటే అదనంగా రూ.3,018 కోట్లు పెంచి, తాజా బడ్జెట్‌లో మూలధన వ్యయం కింద రూ.36,504 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించింది.

Updated Date - Mar 20 , 2025 | 07:03 AM