Share News

Telangana Budget: మరోసారి అంకెల గారడీ

ABN , Publish Date - Mar 20 , 2025 | 06:16 AM

అంకెల గారడీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసింది. దున్నపోతుకు పాలు పిండినట్లుంది రాష్ట్ర బడ్జెట్‌. అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన ఉంది.

Telangana Budget: మరోసారి అంకెల గారడీ

  • కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ‘అంకెల గారడీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసింది. దున్నపోతుకు పాలు పిండినట్లుంది రాష్ట్ర బడ్జెట్‌. అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన ఉంది. 15 నెలల పాలన తర్వాత కూడా ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారు. వివిధ ప్రాజెక్టులకు భారీ ప్రకటనలు చేసినా.. కేటాయింపులు, ఆచరణ శూన్యమని ఈ బడ్జెట్‌తో సుస్పష్టమైంది. 2024-25 బడ్జెట్‌లో జీఎస్టీ ఆదాయం రూ.58,594 కోట్లుగా చూపితే. సవరించిన అంచనాల్లో రూ.53,665 కోట్లని తెలిపారు. దీంతో జీఎస్టీ వసూళ్లు దాదాపు 8.5 శాతం తగ్గడానికి కారణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. మద్యం వినియోగం పెంచడం ద్వారా ఆదాయం పెంపుపైనే దృష్టిపెట్టడం దురదృష్టకరం. రైతులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, మహిళలు సహా ప్రతి వర్గాన్ని మోసగిస్తూనే ఉన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో నిరుద్యోగ భృతి ఊసేలేదు. ఓట్లేసి గెలిపించిన రైతుల ఆకాంక్షలను తుంగలో తొక్కారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం, చెప్పింది చేయకుండా.. చేయనిది చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు‘ అని కేంద్ర మంత్రి జీ కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.


6 గ్యారెంటీలకు పాతరేసేలా బడ్జెట్‌: సంజయ్‌

కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు పాతరేసేలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. అప్పులు చేయడం, ఆస్తుల అమ్మకం, అబద్ధాలు, అంకెల గారడీలో కాంగ్రెస్‌ సర్కారు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మించిపోయిందని విమర్శించారు. అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా కాంగ్రెస్‌ పాలన ఉందన్నారు. ఆరు గ్యారెంటీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాటి అమలుకు కేటాయింపులు చేస్తూ సవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కంటే మైనారిటీలే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముఖ్యమని బడ్జెట్‌ తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. కుల గణన పేరుతో బీసీ రిజర్వేషన్లలో కోత విధించిన కాంగ్రెస్‌.. బడ్జెట్‌ కేటాయింపుల్లో కూడా బీసీల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు, పీఆర్‌సీ ప్రస్తావనే లేదని చెప్పారు. కాంగ్రెస్‌ తిరోగమన పాలనకు నిలువుటద్దంలా బడ్జెట్‌ ఉందన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసినట్లు స్పష్టమైపోయిందని తెలిపారు.

Updated Date - Mar 20 , 2025 | 06:16 AM