Liquor: ధరలు పెంచితేనే లక్ష్యాన్ని చేరేది..!
ABN , Publish Date - Mar 20 , 2025 | 06:14 AM
ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకుగాను ఆదాయాన్ని తెచ్చే కీలకమైన ఎక్సైజ్, రిజిస్ర్టేషన్ శాఖల పరిధిలో ధరలు పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి 46,710.62 కోట్ల ఆదాయమే లక్ష్యం.
ఏప్రిల్ తర్వాత భూముల విలువలు, మద్యం ధరలు పెరిగే చాన్స్
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకుగాను ఆదాయాన్ని తెచ్చే కీలకమైన ఎక్సైజ్, రిజిస్ర్టేషన్ శాఖల పరిధిలో ధరలు పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. భూముల విక్రయంతోపాటు మద్యం అమ్మకాలు, స్టాంపులు, రిజిస్ర్టేషన్ శాఖల నుంచి అత్యధిక మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోనున్నట్లు 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు రిజిస్ర్టేషన్ శాఖ నూతన భూముల విలువలను అమలు చేయడం,ఆబ్కారీ శాఖలో మద్యం ధరలను పెంచాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలిసింది. బడ్జెట్‌లో ఎక్సైజ్ శాఖ నుంచి రూ.27,623.36 కోట్లు, రిజిస్ర్టేషన్ శాఖ నుంచి రూ.19,087.26 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖకు రూ.25,617.53 కోట్ల లక్ష్యం నిర్దేశించగా.. జనవరి వరకు సాధించినది రూ.15,585.35 కోట్లే. ఇందులో దరఖాస్తుల రుసుము రూ.2,600 కోట్లు ఉంది. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టే శాఖల్లో మూడో స్థానంలో ఉన్న రిజిస్ర్టేషన్ శాఖకు రూ.18,229 కోట్ల లక్ష్యం నిర్దేశించగా.. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వచ్చిన ఆదాయం రూ.12,867.13 కోట్లుగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.14,588.06 కోట్ల లక్ష్యాన్ని కూడా చేరలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, రిజిస్ర్టేషన్ శాఖల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఏప్రిల్ తర్వాత భూముల విలువలు, మద్యం ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.