TS News: అంచనాల నడుమ అందుకు తగ్గట్లుగానే ముమ్మర ఏర్పాట్లు
ABN , First Publish Date - 2023-01-28T18:41:43+05:30 IST
మహారాష్ట్రపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) నాందేడ్ పర్యటనను విజయవంతం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
హైదరాబాద్: మహారాష్ట్రపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) నాందేడ్ పర్యటనను విజయవంతం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లా ముఖ్య నేతలు అక్కడే పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో నాయకులను కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న (Joguraamanna) నాందేడ్‌లో పర్యటించి సభ స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి సభకు భారిగా ప్రజలు అభిమానులు రానున్నారన్న అంచనాల నడుమ అందుకు తగ్గట్లుగానే ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన వెంట చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎంపీ గోడం నగేష్ లతో పాటు స్థానిక నేతలు, BRS ముఖ్య నాయకులూ ఉన్నారు.
కాగా మరోవైపు తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు కిన్వట్ తాలుకా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. నాందేడ్ సభ సన్నాహకాల్లో భాగంగా శనివారం కిన్వట్ తాలూకాలోని అప్పారావు పేట గ్రామంలో మంత్రి పర్యటించి, బీఆర్ఎస్ పార్టీ మద్ధతుదారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్‌ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారని వారికి వివరించారు. ఇందులో భాగంగా పార్టీ లక్ష్యాలను మహరాష్ట్రవాసులకు వివరించేందుకు బహిరంగ సభను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ తో కలిసి నడిచేందుకు ముందుకు రావాలని కోరారు. 5న నిర్వహించే సభకు ముందు నాందేడ్ లోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వార్ ను సీఎం కేసీఆర్ దర్శించుకుంటారని మంత్రి వెల్లడించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇక్కడి ప్రజలకు రక్త సంబంధీకులు, బంధుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ప్రాధాన్యత పెరగనుందని వెల్లడించారు. దేశ ప్రజలు సైతం బీఆర్‌ఎస్‌ను కోరుకుంటూ బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.