Vijayashanthi: ఎంత దారుణమో.. జూనియర్ మెడికోల పరిస్థితిపై విజయశాంతి స్పందన
ABN , First Publish Date - 2023-02-26T18:33:48+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాల (KMC) విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Dr. Preethi) ఘటనపై బీజేపీ నేత విజయశాంతి (Vijayashanthi) స్పందించారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాల (KMC) విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Dr. Preethi) ఘటనపై బీజేపీ (BJP) నేత విజయశాంతి (Vijayashanthi) స్పందించారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థగా పేరున్న వరంగల్ కేఎంసీలో జూనియర్ మెడికోల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రాణాలతో పోరాడుతున్న మెడికో ప్రీతి కాల్ డేటా స్పష్టం చేస్తోందని ఆమె మండిపడ్డారు. కేఎంసీలో ఆమెకెదురైన వేధింపులపై హెచ్ఓడీ, ప్రిన్సిపల్ తదితరులకు ఫిర్యాదులు వెళితే ఎదురయ్యే పరిణామాల గురించి తన తల్లిదండ్రులతో మాట్లాడిన కాల్స్ అన్నీ అక్కడ గాడి తప్పిన వ్యవస్థ తీరుతెన్నులను ఎత్తిచూపుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతికి ఎదురైన వేధింపులు మాత్రమే గాక... అసలు మొత్తంగా మెడికల్ కాలేజీల్లో పీజీ విద్యార్థులపై పనిభారం ఒత్తిడి పెరిగిపోయి దారుణ పరిస్థితులకు దారి తీస్తున్నట్టు తెలుస్తోందన్నారు.
పీజీ స్టూడెంట్స్‌కి వారానికి 48 పని గంటలే ఉండాలన్న జాతీయ వైద్యమండలి మార్గదర్శకాలకు భిన్నంగా ఏకబిగి వరుసపెట్టి 36 నుంచి 48 గంటల పాటు పనిచేసేలా వారిపై పనిభారం మోపడంతో వేధింపులు, ర్యాగింగులు, ఆత్మహత్యాయత్నాలు, గుండెపోట్లు వంటి రకరకాల బాధాకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. కాలేజీల్లో తగినంత మంది ప్రొఫెసర్లను నియమించడం లేదన్నారు. అలాగే ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థులకి 5 నెలలుగా స్టయిఫండ్ అందడం లేదన్నారు. ఈ పరిస్థితులపై తెలంగాణ సర్కారు ఏనాడూ దృష్టిపెట్టిన పాపాన పోలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులన్నీ అభివృద్ధి కోసమేనంటున్న పాలకులు ఈ పరిణామాలకు ఏం జవాబు చెబుతారు? అని విజయశాంతి ప్రశ్నించారు.
కాగా మరోవైపు.. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయ్యిందని నిమ్స్ వైద్యులు చెబుతున్నారని విద్యార్థిని తండ్రి (Preethi Father) కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రీతి బతికే అవకాశం ఒక్కశాతం కూడా లేదని వైద్యులు చెబుతున్నారని మీడియాకు చెబుతూనే బోరున ఏడ్చేశారాయన. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేపట్టాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ఆయన వేడుకున్నారు.