చిన్నయ్యా.. ఇదేం గోలయ్యా
ABN , First Publish Date - 2023-01-05T01:12:24+05:30 IST
టోల్ ప్లాజా సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి చేశారు. అక్కడి ఉద్యోగి ఒకరిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్న వీడియో

మంచిర్యాల, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): టోల్ ప్లాజా సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి చేశారు. అక్కడి ఉద్యోగి ఒకరిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నయ్య మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో మంచిర్యాల నుంచి బెల్లంపల్లిలోని నివాసానికి తన వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో మందమర్రి టోల్‌ప్లాజాలో మూసివున్న గేటు వద్ద ఆయన వాహనం నిలిచిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం ఎమ్మెల్యే అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఒకరిని చెంపపై కొట్టిన దృశ్యం వాట్సా్‌పలో చక్కర్లు కొడుతోంది. మంచిర్యాల- చంద్రాపూర్ జాతీయ రహదారి నం.363పై మందమర్రి వద్ద ఏర్పాటు చేసిన ఈ టోల్ ప్లాజాను గత నెల 30న కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించలేదు. ఈ విషయం మనుసులో పెట్టుకున్న ఎమ్మెల్యే ఆ దారి మీదుగా ప్రయాణించి, సిబ్బందిపై దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
నేను దాడి చేయలేదు: ఎమ్మెల్యే దుర్గం
టోల్‌ప్లాజా సిబ్బందిపై తాను దాడి చేయలేదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. దాడి చేశానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టోల్ ప్లాజా ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఆహ్వానించలేదని, రోడ్డు నిర్మాణం పూర్తికాకముందే ప్లాజా ఏర్పాటు చేశారని, ఆ రోజే ఈ విషయమై అధికారులతో మాట్లాడేందుకు యత్నించగా ఎవరూ స్పందించలేదని చెప్పారు. మంగళవారం రాత్రి మంచిర్యాల నుంచి వస్తూ ప్లాజా వద్ద సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నానే తప్ప దాడి చేయలేదని ఆయన వెల్లడించారు.