Share News

UP: పెళ్లై పాతికేళ్లు.. పెళ్లి రోజు నాడే అంతులేని విషాదం..

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:45 AM

పెళ్లై పాతికేళ్లు.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. ఈ వేడుకలో భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఉన్నట్లుండి కుప్పకూలాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వ్యక్తి సడెన్‌గా కుప్పకూలడంతో ప్రతి ఒక్కరు భయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అంతా అయిపోయింది. అతడు చనిపోయాడు. పాపం.. పెళ్లి రోజు నాడే.. పైలోకాలకు వెళ్లాడు.

UP: పెళ్లై పాతికేళ్లు.. పెళ్లి రోజు నాడే అంతులేని విషాదం..
UP Businessman Heart Attack

లక్నో: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.. ఈ పాట మనిషి జీవితానికి సరిగా సరిపోతుంది. అంతే కదా మరి.. మన జీవితంలో నెక్స్ట్ సెకన్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇక చావు గురించి అయితే మనిషికి కనీసం ఆలోచన కూడా ఉండదు. ప్రతి ఒక్కరు నిండు నూరేళ్లు బతుకుతామనే ఆశిస్తారు. కానీ విధిరాత మన చేతిలో లేదు కదా. మృత్యువు ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మనల్ని పలకరిస్తుందో అంచనా వేయడం కష్టం. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్న వారు.. మరు నిమిషంలో చనిపోవచ్చు.

ఇక మన సమాజంలో గత కొంత కాలంగా ఈ హఠాన్మరణాల సంఖ్య పెరుగుతోంది. అప్పటి వరకు ఏదో పని చేస్తూనో.. సంతోషంగా వేడుకల్లో పాల్గొన్న వారు.. ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. ఈ ఆకస్మిక మరణాలకు మూల కారణం గుండెపోటు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చిది. 25వ పెళ్లి రోజు సందర్భంగా.. కుటుంబంతో కలిసి సంతోషంగా వేడుకు చేసుకుంటున్నాడో వ్యక్తి. దానిలో భాగంగా డ్యాన్స్ చేస్తూ చేస్తూనే ఉన్నట్లుండి కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. ఆ వివరాలు..


ఈ సంఘటన ఉత్తరప్రదేశ్, బరేలీలో చోటు చేసుకుంది. చెప్పుల వ్యాపారం చేసుకునే బిజినెస్‌మాన్ వాసిం సరస్వత్(50) 25వ పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ఫిలిబిత్ బైపాస్ రోడ్డులో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా సరస్వత్, తన భార్య ఫారాతో కలిసి డ్యాన్స్ చేయసాగాడు. కుటుంబ సభ్యులంతా.. సంతోషంగా చప్పట్లు కొడుతూ అతడిని ఎంకరేజ్ చేయసాగారు.

ఎంతో ఆనందగా సాగుతున్న ఆ వేడుకల్లో ఉన్నట్లుండి విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు సరస్వత్ కుటుంబ సభ్యుల నవ్వులు, అల్లరితో సందడిగా ఉన్న ఆ ప్రాంతం.. ఒక్కసారిగా ఏడుపులు, ఆర్తనాదాలతో నిండిపోయింది. కారణం.. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉండి.. భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న సరస్వత్.. ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలాడు.


ఈ సంఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. సరస్వత్‌ను లేపేందుకు ప్రయత్నించారు. ఆయనకు స్పృహ రాకపోవడంతో.. వెంటనే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సరస్వత్‌ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. గుండెపోటు కారణంగా సరస్వత్ చనిపోయాడని తెలిపారు డాక్టర్స్. పెళ్లి రోజు నాడు ఈ విషాదం చోటు చేసుకోవడం విచారకరం. సరస్వత్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఆయన భార్య స్కూల్ టీచర్‌గా పని చేస్తుంది.

ఈ సందర్భంగా ఓ కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ.. కొన్ని సార్లు.. చికిత్సకు లొంగని గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. అకస్మాత్తుగా వచ్చే కార్డియాక్ అరెస్ట్ పరిస్థితిలో రక్త ప్రసరణ, లేదా గుండె పనితీరులో మార్పులు చోటు చేసుకుంటాయి. వీటిని కంట్రోల్ చేయడం మన చేతుల్లో లేదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా, గుండె పనితీరుకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది అనిపించినా.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి అని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలివే..

అయ్యో పాపం.. పది రోజుల క్రితమే నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే

Updated Date - Apr 04 , 2025 | 11:49 AM