కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలోకి ఉత్తమ్‌ కుమార్‌

ABN , First Publish Date - 2023-09-05T04:29:05+05:30 IST

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలకమైన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలోకి ఉత్తమ్‌ కుమార్‌

దేశ వ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులను నిర్ణయించేది ఈ కమిటీనే

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలకమైన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులను నిర్ణయించే అత్యున్నతమైన ఈ కమిటీలో తెలంగాణకు చెందిన సీనియర్‌ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చోటు దక్కింది. ఈ కమిటీలో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీనియర్‌ నేతలు అంబికా సోనీ, అధిర్‌ రంజన్‌ చౌదరి, సల్మాన్‌ ఖుర్షిద్‌, మధుసూదన్‌ మిస్త్రీ, టీఎస్‌ సింగ్‌ దేవ్‌, కేజే జార్జి, ప్రీతమ్‌ సింగ్‌, మహ్మద్‌ జావేద్‌, అమె యాజ్నిక్‌, పీఎల్‌ పునియా, ఓంకార్‌ మక్రమ్‌, కేసీ వేణుగోపాల్‌తో కూడిన కమిటీ పదవీకాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. వాస్తవానికి రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఒక్క నేతకూ ఈ కమిటీలో చోటు దక్కలేదు. సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్‌కు చోటు దక్కింది. ప్రస్తుతం తెలంగాణ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏఐసీసీ నియమించిన స్ర్కీనింగ్‌ కమిటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఉత్తమ్‌ సభ్యుడిగా ఉన్నారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో అత్యున్నతమైన ఏఐసీసీ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలోనూ ఉత్తమ్‌కు చోటు దక్కడంతో తెలంగాణలో పార్టీ అభ్యర్థుల నిర్ణయంలో ఆయన కీలకంగా మారే అవకాశం ఉంది. గాంధీ కుటుంబానికి మొదటి నుంచీ సన్నిహితుడిగా ఉన్న ఉత్తమ్‌.. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-09-05T04:29:05+05:30 IST