హమ్మయ్య..!
ABN , First Publish Date - 2023-06-28T00:22:25+05:30 IST
అంత్యంత వెనుకబడిన జిల్లాల్లో భూపాలపల్లి ఒకటి. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఏడేళ్ల క్రితం చేపట్టిన జిల్లా ల పునర్విభజనలో భాగంగా ఇది ఏర్పాటైంది.

భూపాలపల్లి జిల్లాకు తరలి వస్తున్న కార్యాలయాలు
సబ్ రిజిస్ర్టార్ ఆఫీసును మంజూరు చేసిన సర్కారు
ప్రజలకు రిజిస్ట్రేషన్లకు తప్పిన దూరభారం
ఇప్పటికే సీసీఎఫ్, ఆర్‌అండ్‌బీ సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు
భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వేర్వేరుగా ‘ఆర్టీవో’
భూపాలపల్లి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): అంత్యంత వెనుకబడిన జిల్లాల్లో భూపాలపల్లి ఒకటి. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఏడేళ్ల క్రితం చేపట్టిన జిల్లా ల పునర్విభజనలో భాగంగా ఇది ఏర్పాటైంది. కొత్త జిల్లాగా ఆవిర్భవించినా ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మాత్రం ఆలస్యమైంది. అన్ని ఒకేసారి కాకుండా కార్యాలయాలు ఒక్కొక్కటిగా భూపాలపల్లిలో ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే కొన్ని తరలిరాగా ఇటీవలే ఆర్‌అండ్‌బీ కార్యాలయాన్ని ప్రభుత్వం మం జూరు చేసింది. తాజాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాట్జుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భూములు, ఇళ్లు తదితర రిజిస్ర్టేషన్ల కోసం ములుగు జిల్లా కేంద్రానికి వెళ్తున్న వారికి దూరభారం తగ్గనుం ది. అలాగే భూపాలపల్లి, ములుగుకు ఉమ్మడిగా ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ప్రభుత్వం విభజన చేసింది. రెండు జిల్లాలకు వేర్వేరుగా కార్యాలయాలను ఏర్పాటు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 2016 అక్టోబరు 11న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో భూపాలపల్లి కేంద్రంగా జిల్లా ఆవిర్భవించింది. భూపా లపల్లి, ములుగు రెవెన్యూ డివిజన్లతో కలిసి 20 మండ లాలతో ఏర్పడింది. అదే సమయంలో ములుగును కూడా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఉద్యమా లు తీవ్రంగా జరిగాయి. దీంతో అక్కడి ప్రజలను శాం తింపజేసేందుకు ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూ ఎస్, సబ్ రిజిస్ట్రార్ తదితర జిల్లా కార్యాలయాలను ములుగు కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 19న ములుగు రెవెన్యూ డివిజన్‌లోని తొమ్మిది మండలాలతో కలిపి ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. అప్పటి నుంచి ములుగులో అన్ని జిల్లా కార్యాలయాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. కానీ, గతంలో ములుగులోనే ఉన్న ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు, భూపాలపల్లిలో ఉన్న జిల్లా రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు ఉమ్మడిగానే కొనసా గుతున్నాయి. దీంతో ప్రజలు ఆయా కార్యాలయాలకు వెళ్లాలంటే దూరభారంతో ఇబ్బంది పడుతున్నారు.
భూపాలపల్లికి సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం..
పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లేకపోవ టంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2016లో భూపాలపల్లి జిల్లా కొత్తగా ఏర్పడిన సమ యంలోనే పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని భూపాలపల్లికి తరలించారు. అక్కడి నుంచి ఈ కార్యా లయం ఫర్నిచర్‌ను మొత్తం తీసుకొచ్చారు. అయితే.. ఏమైందో ఏమో గానీ, ప్రారంభం కాకముందే తిరిగి పరకాలకు తరలించారు. అప్పటి నుంచి రిజిస్ర్టేషన్ల కోసం ములుగుకు వెళ్లాల్సి వస్తోంది. 2019లో ములు గు జిల్లా కేంద్రంగా మారటంతో భూపాలపల్లి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలోనే రిజిస్ట్రార్ కార్యాలయం లేని ఏకైక జిల్లాగా భూపాలపల్లి నిలిచింది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రిజిస్ర్టేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిం ది. దీంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఏడేళ్లుగా ఎదురుచూ స్తున్నా సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం జిల్లాకు మంజూ రు కావటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోనే సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది.
తగ్గనున్న దూరభారం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యా లయం మంజూరుతో ప్రజలకు కష్టాలు తప్పనున్నా యి. భూములు, ఇళ్లు, పెళ్లిళ్లు, సంఘాలు తదితర రిజి స్ర్టేషన్లకు కోసం ములుగుకు వెళ్లాల్సి వస్తోంది. కాళేశ్వ రం, పలిమెల లాంటి సుదూర ప్రాంతాల నుంచి రిజిస్ర్టే షన్ల కోసం ములుగుకు వెళ్లాలంటే సుమారు వంద కిలో మీటర్లు ప్రయాణించాల్సిందే. అంతేకాకుండా ఈ ప్రాం తాల నుంచి ములుగు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేదు. దీంతో ప్రయాణం ఇబ్బందిగా మారింది. అలాగే భూపాలపల్లి జిల్లా కేంద్రం తోపాటు కాటారం, కాళేశ్వరం, చెల్పూరు, రేగొండ తదితర ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతున్న నేపథ్యం లో రోజుకు పదుల సంఖ్యలో రిజిస్ర్టేషన్ల కోసం ములుగుకు వెళ్లాల్సి వస్తోంది. భూపాలపల్లి జిల్లా నుంచి రిజిస్ర్టేషన్ల శాఖకు భారీగా ఆదాయం వస్తున్నా ఇన్నాళ్లు జిల్లా కేంద్రంలో రిజిస్ర్టేషన్ల కార్యాలయాన్ని ఏర్పాటు చేయకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు ఉత్తర్వ్లులు జారీ చేయటంతో త్వరలోనే జిల్లా వాసులకు దాని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
తరలి వస్తున్నాయ్..
భూపాలపల్లి జిల్లాకు ఒక్కొక్కటిగా కార్యాలయాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కొత్తగా ఏడు జోన్లు ఏర్పాటు చేయగా, వాటిలో మొదటి జోన్‌కు ‘కాళేశ్వరం’ అని నామకరణం చేశారు. ఈ జోన్‌లో భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ ఐదు జిల్లాలు కూడా గోదావరి పరీవాహక ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో కాళేశ్వరం జోన్ పరిధిలో కార్యాలయాలను కూడా భూపాలపల్లి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అటవీ శాఖలోని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) కార్యాలయాన్ని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేశారు. వరంగల్ కేంద్రంగా ఉన్న సీసీఎఫ్ కార్యాలయం భూపాలపల్లికి రావటంతో ఇక్కడి నుంచి అటవీ శాఖ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అలాగే కొత్తగా కాళేశ్వరం రేంజ్ డీఐజీ కార్యాలయం ప్రస్తుతం పెద్దపల్లిలో ఉన్నప్పటికీ దానిని కూడా భూపాలపల్లికి తరలించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలాగే ఇటీవలే ఆర్‌అండ్‌బీ శాఖను ప్రభుత్వం పునర్విభజన చేసింది. కొత్తగా భూపాలపల్లి కేంద్రంగా ఆర్‌అండ్‌బీ సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆర్‌అండ్‌బీ సర్కిల్ కేంద్రం భూపాలపల్లి నుంచే పని చేయనుంది. అలాగే భూపాలపల్లిలో ఉమ్మడిగా ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని కూడా ఇటీవలే విభజన చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆర్టీవో కార్యాలయాన్ని ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. త్వరలోనే ములుగులో ఆర్టీవో సేవలు స్థానికులకు అందనున్నాయి. మొత్తానికి కొత్త జిల్లాలు ఏర్పడిన ఏడేళ్లకైనా పౌర సేవలు అందుబాటులోకి వస్తున్నాయని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
కలెక్టరేట్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
భూపాలపల్లి కలెక్టరేట్, జూన్ 27: జిల్లాకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరైంది. భూపాలపల్లి పట్టణ పరిధి మంజూర్‌నగర్‌లో ఉన్న ప్రస్తుత కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ సైదారెడ్డి మంగళవారం కలెక్టరేట్‌ను సందర్శించారు. మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన గదితోపాటు మరో గదిని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం కోసం పరిశీలించారు. ఈ ఆఫీసులో సమకూర్చాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమాలోచన చేశారు. జూలై 1న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఐజీ వెంట భూపాలపల్లి, ములుగు జిల్లాల సబ్ రిజిస్ట్రార్లు రవి, తస్లీమా తదితరులు ఉన్నారు.