Anganwadi : అరెస్టు చేసుకోండి
ABN , Publish Date - Jan 10 , 2024 | 04:44 AM
నిన్నటి వరకూ శిబిరాలకే పరిమితమైన అంగన్వాడీల ఆందోళన రోడ్డెక్కింది. సమ్మెను నిషేధించిన ప్రభుత్వం.. షోకాజ్ నోటీసులు ఇస్తుండటంతో ఆగ్రహోదగ్రులైన అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం అపర కాళికలయ్యారు.

అంగన్వాడీల జైల్‌భరో.. ఉద్రిక్తం
అండగా కార్మిక, ప్రజా సంఘాలు.. ఎస్మా ఎత్తేయాలంటూ నినాదాలు
రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన కార్యకర్తలు.. గంటల తరబడి రాస్తారోకోలు
ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్.. వేల మందిని అరెస్టు చేసిన పోలీసులు
పలుచోట్ల పోలీసులతో పెనుగులాట.. రాష్ట్రమంతటా ఉద్రిక్త పరిస్థితులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
నిన్నటి వరకూ శిబిరాలకే పరిమితమైన అంగన్వాడీల ఆందోళన రోడ్డెక్కింది. సమ్మెను నిషేధించిన ప్రభుత్వం.. షోకాజ్ నోటీసులు ఇస్తుండటంతో ఆగ్రహోదగ్రులైన అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం అపర కాళికలయ్యారు. ప్రధాన రోడ్లు.. పోలీసు స్టేషన్ల వద్ద బైఠాయించి ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలని నినదించారు. వారికి మద్దతుగా కార్మిక సంఘాలు జైల్‌భరో ఆందోళనకు పిలుపునివ్వడంతో రోజంతా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నంద్యాలలో దీక్షా శిబిరం నుంచి వందలాది మంది అంగన్వాడీలు జైల్‌భరో కార్యక్రమాన్ని చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంగన్‌వాడీలు పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించి, 2 గంటలపాటు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు 24 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజాసంఘాల రాస్తారోకోతో ట్రాఫిక్ పెద్దఎత్తున నిలిచిపోవటంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు జైల్‌భరో నిర్వహించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, అంగన్వాడీ యూనియన్ల నాయకులు పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు.
పార్వతీపురంలో నిరవధిక దీక్షను కొనసాగించారు. రాత్రికి శిబిరం వద్దే చలిలో పడుకున్నారు. తిరుపతి జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీలతోపాటు కార్మిక సంఘాల నాయకులనూ పోలీసులు అరెస్టు చేసి ఈస్ట్ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అక్కడ స్టేషన్ ఆవరణలోనే అంగన్వాడీలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గూడూరు, వెంకటగిరి నాయుడుపేట, సత్యవేడులోనూ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. చంద్రగిరి, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, పుత్తూరు, పిచ్చాటూరు తదితర చోట్ల కూడా జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆర్టీవో కార్యాలయంలోకి అధికారులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించడంతో అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో రహదారిపై అంగన్‌వాడీలు రెండు గంటలపాటు బైఠాయించారు. ఉంగుటూరులో శిబిరాన్ని ఎమ్మెల్సీ ఐవీ సందర్శించి మద్దతు తెలిపారు. నెల్లూరులో అంగన్‌వాడీలకు మద్దతుగా ప్రజాసంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. వీఆర్సీ కూడలిలో రాస్తారోకోతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అరెస్టు చేసి వాహనాలలో ఎక్కిస్తుండగా కార్యకర్తలు ప్రతిఘటించి పోలీసు వాహనాలకు అడ్డుగా కూర్చొన్నారు. దీంతో చేసేదిలేక నాయకులను విడిచిపెట్టారు. తిరిగి అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి అంగన్‌వాడీల దీక్షకు మద్దతు ప్రకటించారు. శ్రీకాకుళంలోనూ జైల్‌భరో నిర్వహించగా, నాయకులను అరెస్టు చేసి పోలీసుస్టేషనుకు తరలించారు. కడపలో మానవహారం, పోరుమామిళ్లలో జైల్‌భరో నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒంటికాలిపై నిరసన తెలిపారు.
మంత్రి బొత్స ఇంటి ముట్టడి
సమగ్రశిక్ష ఉద్యోగులు మంగళవారం విజయనగరంలోని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. ఆయన ఇంటికెదురుగా రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఆందోళనలు చేస్తున్నా ప్రబుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.