పదేళ్లలో ఏపీ అగ్రగామి
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:46 AM
రానున్న పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
అభివృద్ధికి అవసరమైన వనరులు రాష్ట్రంలో పుష్కలం
పీ-4 విధానం అమలుతో పేదరిక నిర్మూలన సాధ్యం
నదుల అనుసంధానంపై రోడ్‌మ్యాప్ రూపొందించాలి
అధిక జనాభా దేశ బలహీనత కాదు.. అదే మన బలం
మన దేశానికి ఉన్న అతిపెద్ద వనరు యువత
నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
న్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి):రానున్న పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జల వనరులు, ఖనిజ వనరులు, సువిశాలమైన కోస్తా తీరం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సారవంతమైన భూమి వంటి అభివృద్ధికి అవసరమైన వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అందరికంటే ముందు చంద్రబాబు మాట్లాడారు. దాదాపు ఏడు నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో గత కొంతకాలంగా తాను చేస్తున్న వినూత్న ప్రతిపాదన పీ-4 గురించి చంద్రబాబు ప్రస్తావించారు. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కోరినప్పుడు సమావేశంలో సానుకూల ప్రతిస్పందన లభించింది. ఇప్పటి వరకూ అమలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) వల్ల వచ్చే లాభాలేమిటో దేశానికి తెలుసని, కానీ ఇందులో ప్రజల భాగస్వామ్యం ఉండేలా నాలుగో ‘పీ’ కూడా చేరితేనే పేదరిక నిర్మూలన సాధ్యమని వివరించారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన సున్నా పేదరికం లక్ష్యాన్ని సాధించాలంటే పీ-4 అమలు చేయాలని తెలిపారు. సాంకేతికతను పేదల అభ్యున్నతికి ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పారు. నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
గతంలో స్వర్ణ చతుర్భుజి ద్వారా రహదారుల అనుసంధానం చేసి ఫలితాలు సాధించామని, ఇప్పుడు నదుల అనుసంధానం దేశానికి చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో రోడ్‌మ్యా్‌పను రూపొందించాలని సూచించారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం ఫలితాలను ఏపీ అనుభవిస్తోందని చంద్రబాబు వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా వైద్య సదుపాయాలు అందించాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. అధిక జనాభా దేశ బలహీనత కాదని, బలమని తెలిపారు. యువత మన దేశానికున్న అతిపెద్ద వనరుగా అభివర్ణించారు. యువతను సరిగ్గా వినియోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చన్నారు. 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధించడం ఏమంత కష్టం కాదని, మన దేశ సంపదను సక్రమంగా వినియోగించుకుంటే 50 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధించడం ఆసాధ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నీతిఆయోగ్ సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమావేశంలో దాదాపు పది అంశాలు ప్రస్తావించానని, ఏపీలో ఉన్న అవకాశాలను వివరించానని చెప్పారు. పోలవరం, అమరావతికి తోడ్పాటు అందిస్తునందుకు, విభజన హమీలను త్వరితగతిన పరిష్కరిస్తున్నందుకు కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మీలా జగన్ ఎప్పుడూ మాట్లాడలేదు: వేమిరెడ్డి
శనివారం రాత్రి ఎంపీలతో చంద్రబాబు విందు సమావేశం సరదాగా, ఛలోక్తుల మధ్య సాగింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో తామెప్పుడూ ఈ విధంగా కలసి కూర్చొని భోజనం చేయలేదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జగన్‌ను కలుసుకోవడమే కష్టంగా ఉండేదని చెప్పారు. ‘‘మీరు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ మీతో కూర్చుని భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మీరు మా నియోజకవర్గం గురించి, పార్లమెంట్‌లో జరుగుతున్న పరిణామాల గురించి అడగడం మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది’ అని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్పందిస్తూ... ‘ఢిల్లీ అంటే నాకు మీరే కదా, ఇక్కడ మీరే రాష్ట్రానికి కళ్లూ, చెవులు’ అని అన్నారు. ప్రతి ఎంపీతోనూ ఆయన పార్లమెంట్ సమావేశాల గురించి చర్చించారు. ఎంపీలు అందరూ అల్పాహారం తీసుకోవడం చూసి.. ‘డైటింగ్ చేస్తున్నారా?’ అని ఛలోక్తి విసిరారు. ‘ఇదీ మంచిదే.. తక్కువ తినాలి.. ఎక్కువ పనిచేయాలి’ అని నవ్వుతూ అన్నారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలు అధునాతనంగా అభివృద్ధి జరిగేలా చూడాలని తన పక్కనే కూర్చున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుకి చంద్రబాబు సూచించారు.