Share News

YS Jagan: వైఎస్ జగన్‌కు ఊహించని షాక్.. పాస్‌పోర్ట్ రద్దు

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:44 AM

ముఖ్యమంత్రి పదవి పోయాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పార్టీలోని పలు సమస్యలతో సతమతం అవుతున్న అధినేతకు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది...

YS Jagan: వైఎస్ జగన్‌కు ఊహించని షాక్.. పాస్‌పోర్ట్ రద్దు

అమరావతి: ముఖ్యమంత్రి పదవి పోయాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పార్టీకి సిట్టింగులు, కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారని సతమతం అవుతుండగా అధినేతకు తాజాగా మరో ఊహించని ఝలక్ తగిలింది. వైఎస్ జగన్‌ పాస్‌పోర్టు రద్దయ్యింది. దీంతో ఆయనకు పాస్‌పోర్టు కష్టాలూ వచ్చిపడ్డాయి. ముఖ్యమంత్రి పదవి పోవడంతో జగన్ డిప్లోమాట్ పాస్‌పోర్టును (Diplomatic Passport) రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.


ఆఖరికి ఇలా..!

దీంతో చేసేదేమీ లేక జనరల్ పాస్‌పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. 5 సంవత్సరాలు జనరల్ పాస్‌పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశించడం జరిగింది. ఈ వ్యవహారంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మాజీ సీఎం పిటీషన్ దాఖలు చేశారు. అయితే.. దీనిపై విచారించిన కోర్టు.. కేవలం ఒక సంవత్సరానికి పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే.. తనకు ఐదు సంవత్సరాలకు పాస్ పోర్టు ఇవ్వాలని హైకోర్టులో వైఎస్ జగన్ ఇవాళ.. లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ సోమవారానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో లండన్ ప్రయాణంను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు.


ఇలా అనుకున్నారు కానీ..

వాస్తవానికి వైఎస్ జగన్‌ సెప్టెంబర్-03న సతీసమేతంగా లండన్‌ బయల్దేరి వెళ్లాలని అనుకున్నారు. ఇందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల అనుమతి కూడా ఇచ్చింది. కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం 25 దాకా అక్కడే ఉండాలని భావించారు. ఈ క్రమంలో అక్రమాస్తుల కేసులు ఒకవైపు.. ముఖ్యమంత్రిగా పాలనా సమయంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలపై విచారణలు ఇంకోవైపు.. పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు సమాయత్తం కావడం, పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు తప్ప మిగతావారు పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారంతో భవిష్యత్‌పై వైసీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఈ తరుణంలో ఆయన విదేశీ పర్యటన వారిని ఇరకాటంలో పడేస్తోంది. దీనికి తోడు పాస్‌పోర్టు కూడా రద్దు కావడంతో చేసేదేమీ లేక వాయిదా వేసుకున్నారు. అంతేకాదు.. డిప్లోమాట్ పాస్‌పోర్టుకు బదులుగా జనరల్‌ పాస్‌పోర్టుకు అప్లయ్ చేసుకున్నారు. ఇందులోనూ ఏడాది మాత్రమే అని కోర్టు.. ఐదేళ్లు కావాలని జగన్ అడుగుతున్నారు. ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఏం తేలుస్తుందో చూడాలి మరి.

Updated Date - Sep 06 , 2024 | 12:21 PM