Share News

Tirupati Laddu: తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై స్పందించిన రమణదీక్షితులు

ABN , Publish Date - Sep 20 , 2024 | 10:54 AM

వైసీపీ సర్కారు హయంలో లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలిసారి స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యార పేర్కొన్నారు.

Tirupati Laddu: తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై స్పందించిన రమణదీక్షితులు

తిరుమల: శ్రీవారి లడ్డూలో (Tirupati Laddu Row) కొవ్వు నిజమేనని, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారణ కావడం ప్రకంపనలు రేపుతోంది. భక్తులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రగడ రాజేస్తున్న ఈ వ్యవహారంపై శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitulu) తొలిసారి స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యార పేర్కొన్నారు.


మహాపాపం జరిగింది

‘‘అన్నం పెట్టే దేవుడికి రుచిగా, సుచిగా నివేదనలు పెట్టాలి. నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరం. స్వామివారికి సరైన రీతిలో నివేదనలు జరగడం లేదు. ఇవన్నీ చూసే పాపం మనం చేశామా అని బాధ కలుగుతోంది. గతంలో చాలా సార్లు టీటీడీ చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లాను. గత కొద్ది సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నాను. గత 5 సంవత్సరాలు తిరుమలలో మహాపాపం జరిగింది. నెయ్యిలో కొవ్వు పదార్ధాలు కలవడం వల్ల అపచారం జరిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతోంది’’ అని రమణ దీక్షితులు అన్నారు.

‘‘ప్రస్తుతం శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చెయ్యడం హర్షణీయం. ఆగమంపైన పట్టు ఉన్న వారికి స్వామివారి సేవ చేసే అవకాశాన్ని సీఎం కల్పించాలి. నెయ్యి కల్తీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో నన్ను హింసలు పెట్టారు. నాపైన పెట్టిన కేసులు ఎత్తి వేయాలి. పోటులో సంప్రోక్షణ చేసి లడ్డూ తయారీని పునః ప్రారంభించాలి. ప్రస్తుత ఆగమ కమిటీని ఉద్యోగులతో భర్తీ చేశారు. వాళ్లు ఎలాంటి నిర్ణయాలు అమలు చేయలేరు. ఆగమ సలహాదారులుగా ఇతర రాష్ట్రాల వారిని నియమించాలి. నన్ను ఆలయానికి దూరంగా పెట్టారు’’ అని రమణ దీక్షితులు పేర్కొన్నారు.


నాకు అవకాశం మార్పులు తెస్తాను: రమణ దీక్షితులు

తన పరిధిలో ఎలాంటి అపచారం జరిగినా అధికారులు దృష్టికీ తీసుకెళ్తానని, అర్చకుడిగా, భక్తుడిగా ఇది తన ధర్మమని ఆయన వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాలను స్వామి వారికీ నివేదించడం దురదృష్టకరమని రమణదీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్చకులపై అధికారులు ఒత్తిడి తెచ్చి స్వామి వారికి కైంకార్యాలు, నివేదనలు సరిగ్గా చేయనివ్వడంలేదని ఆయన మండిపడ్డారు. ‘‘కొవిడ్ సమయం నుంచి స్వామి వారికి నివేదనలను తగ్గించారు. తిరిగి పాత దిట్టాన్ని పునరుద్దరించలేదు. వందల సంవత్సరాల ఆచారాన్ని మార్చకూడదు. సేంద్రియ బియ్యంతో నివేదనలు సమర్పించడాన్ని శాస్త్రం ఒప్పుకోదు. నాకు అవకాశం ఇస్తే పాడైన అర్చక, అధికార వ్యవస్థల్లో మార్పులు తెస్తాను. సీఎం అవకాశం కల్పిస్తే ఆయనను కలిసి తిరుమలలో జరుగుతున్న అపచారాలను దృష్టికి తీసుకెళ్తాను. అన్నప్రసాదాలు భక్తులకు అందడం లేదు. నా పై బనాయించిన తప్పుడు కేసులు ఎత్తి వేస్తే తిరిగి స్వామివారి సేవ చెయ్యడానికి వస్తాను’’ అని రమణ దీక్షితులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

తిరుమల లడ్డూ వ్యవహారం... జగన్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు

బాబోయ్.. వీడు మామూలోడు కాదుగా.. ఏకంగా 50మంది మహిళల్ని..

Updated Date - Sep 20 , 2024 | 12:38 PM