ప్రమాదంలో ప్రజారోగ్యం
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:11 AM
91570మందికి రక్తపోటు 81668మందికి మధుమేహం 614మందికి క్యాన్సర్ లక్షణాలు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే వ్యాధుల విస్తృతికి కారణం ఎన్‌సీడీ సర్వేలో తేలిన వైనం

గతి తప్పిన ఆహారపు అలవాట్లు...... కొరవడిన శారీరక శ్రమ..... పెరుగుతోన్న మానసిక ఒత్తిడి..... చాపకింద నీరులా ఆసంక్రమిత వ్యాధులు జనాన్ని చుట్టుముడుతున్నాయి. అదుపు చేయకుంటే ఆరోగ్యాన్ని కబళించేస్తాయి.
చిత్తూరు రూరల్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో అసంక్రమిత వ్యాధుల గుర్తింపు (ఎన్‌సీడీ) 3.0 సర్వే జిల్లాలో చేపట్టారు. దీనిని గతేడాది నవంబరులో ప్రాంభించారు. ఈ ఏడాది మే చివరిలోపు పూర్తి చేయాలని గడువు విధించారు. జిల్లాలో 18 ఏళ్లు దాటిన వారు 1564277 మంది ఉండగా... అందులో 954643 మందిని అంటే 65 శాతం మందిని ఇప్పటిదాకా చేసినట్లు డీఎంహెచ్‌వో సుధారాణి తెలిపారు. ప్రధానంగా మధుమేహం, రక్తపోటు ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తుండగా, రాకాసి క్యాన్సర్ బాధితులు పెరిగిపోతుండడం ఈ సర్వేలో బయటపడింది.
జిల్లాలో 91570 మంది రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. రక్తపోటును అదుపు చేయకపోతే మెదడు, మూత్రపిండాలు, గుండె పనితీరుపైౖ ప్రభావం చూపే అవకాశముంది. పక్షవాతం కూడా సోకే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.
జిల్లాలో 81668 మంది చక్కెరవ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది.రోజూ క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే రక్తంలో షుగర్ శాతం అదుపులో ఉంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ప్రాణాలు హరించే క్యాన్సర్‌తో జిల్లాలో 614 మంది బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇందులో ఓరల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు 239మంది కాగా, రొమ్ము క్యాన్సర్‌తో 194 మంది బాధపడుతున్నట్లు గుర్తించారు. 30 ఏళ్లు దాటిన 181 మంది మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ సోకినట్లు సర్వేలో తేలింది.
జిల్లాలో ఎక్కువ శాతం రక్తపోటు వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారని సర్వే ద్వారా గుర్తించడం జరిగింది. ప్రజలకు అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం. స్ర్కీనింగ్‌లో వ్యాధులు బయటపడిన వారికి ఏది తినొచ్చు...ఏది తినకూడదు అనే విషయంపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
---డీఎంహెచ్‌వో సుధారాణి