‘సుజలం’ సఫలమయ్యేది ఎన్నడో!
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:18 AM
ఎన్టీఆర్ సుజల.. కుప్పం ప్రజల దాహార్తిని తీర్చడంలో విజయవంతమైన పథకం. రెండు రూపాయలకే 20 లీటర్ల శుద్ధ జలాన్ని అందించడం ద్వారా ఖర్చు తగ్గించడంతోపాటు తాగునీటి కాలుష్య ప్రభావంనుంచి ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించిన పథకం. వైసీపీ అయిదేళ్ల పాలనలో 20 లీటర్ల శుద్ధ జలం అయిదు రూపాయలకు పెరగడంతో పాటు నిర్వహణ లేమితో కునారిల్లి, చివరకు నామమాత్రావశిష్టంగా మారిన ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి నేడు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

కుప్పం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ సుజల.. కుప్పం ప్రజల దాహార్తిని తీర్చడంలో విజయవంతమైన పథకం. రెండు రూపాయలకే 20 లీటర్ల శుద్ధ జలాన్ని అందించడం ద్వారా ఖర్చు తగ్గించడంతోపాటు తాగునీటి కాలుష్య ప్రభావంనుంచి ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించిన పథకం. వైసీపీ అయిదేళ్ల పాలనలో 20 లీటర్ల శుద్ధ జలం అయిదు రూపాయలకు పెరగడంతో పాటు నిర్వహణ లేమితో కునారిల్లి, చివరకు నామమాత్రావశిష్టంగా మారిన ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి నేడు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిధులు కేటాయించినా, అమలుకు వచ్చేసరికి ఏదో సాంకేతిక అడ్డంకి అడుగులు ముందుకు వేయనీయడంలేదు.
2014-2019 నడుమ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా ఎన్టీఆర్ సుజల పథకం అమలైంది. కుప్పంలోని డీకే పల్లె ఉద్యానవనంలో మదర్ ప్లాంటును అప్పటి మంత్రి లోకేశ్ ఘనంగా ప్రారంభించారు. ఇందుకోసం డీకే పల్లె చెరువులో అయిదు బోరుబావుల తవ్వకం అదనంగా జరిగింది. క్రమేణా పథకం నాలుగు మండలాలకూ విస్తరించింది. మొత్తం 9 మదర్ ప్లాంట్లు, 202 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఆర్డీయూ)లతో నియోజకవర్గ ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం రెండు రూపాయలకే 20 లీటర్ల శుద్ధఽ జలాన్ని అందించి వారి తాగునీటి ఎద్దడి తీర్చడంతోపాటు కలుషిత నీటితో వచ్చే ఆరోగ్య ప్రమాదాలనుంచి ఎన్టీఆర్ సుజల పథకం రక్షించింది. సుమారు ఇరవై ట్యాంకర్ల దాకా మదర్ ప్లాంట్లనుంచి ఆర్డీయూలకు శుద్ధజలాన్ని సరఫరా చేసేవి. లక్షలాది లీటర్ల శుద్ధ జలాన్ని ఆర్డీయూలనుంచి ఏటీఎం లాంటి కార్డులను ఉపయోగించి ప్రజలు తీసుకుని వాడేవారు. తాగునీటికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా గడిచిపోయిన రోజులవి.
వైసీపీ రావడంతోనే మంగళం
2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ సుజల పథకానికి గ్రహణం పడుతూ వచ్చింది. వైఎస్సార్ సుజలగా పథకం పేరు మార్చి వచ్చీరాగానే 20 లీటర్ల తాగునీటిని రూ.5కు పెంచేశారు. కనీసం ఆ అయిదు రూపాయలకైనా నీటిని పట్టుకుని వాడుకుందామంటే ముందుగా ఆర్డీయూలు, తర్వాత మదర్ ప్లాంట్లు మూతపడుతూ వచ్చాయి. చివరకు కుప్పం పట్టణంలో రెండుమూడు చోట్ల, గ్రామీణ ప్రాంతాలన్నింటికీ కలిపి ఒక పదీ పన్నెండు చోట్ల మాత్రమే ఆర్డీయూలు పనిచేశాయి. అప్పటిదాకా వినియోగంలో ఉన్న మదర్ ప్లాంట్లలోని యంత్రాలు, ఆర్డీయూలు పనికిరాకుండా పోయాయి. మరోవైపు పనిలేకపోవడంతో ట్రాక్టర్లు, ట్యాంకర్లు డీకే పల్లె ఉద్యానవనానికి చేరి తుప్పు పట్టాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం ఈ విధంగా నిరుపయోగంగా మారింది. ఒకప్పుడు ఎన్టీఆర్ సుజలతో మూతపడ్డ ప్రైవేటు శుద్ధ జల ప్లాంట్లు తిరిగి పుంజుకున్నాయి. గత్యంతరం లేక ప్రజలు అత్యధిక ధరలు పెట్టి, ఆ ప్రైవేటు ప్లాంట్లనుంచే నీటిని కొనుగోలు చేయక తప్పలేదు.
పునరుద్ధరణకు సాంకేతిక అడ్డంకి
మార్చి నెలలోనే వేసవి తీవ్రమవుతోంది. తాగునీటి ఎద్దడి పెరుగుతోంది. బోరు బావులు ఎండిపోతున్నాయి. నీటి సరఫరా సమస్య తలెత్తుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ సుజలను పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. ఇందుకోసం రూ.10.27 కోట్ల నిధులు కూడా ప్రభుతం మంజూరు చేసింది. అయితే నిధులు సిద్ధంగా ఉన్నాసరే, పునరుద్ధరణ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం వెనకాడుతోంది. ఏదో సాంకేతిక సమస్య ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈమధ్య జరిగిన విలేకరుల సమావేశంలో కడా పీడీ వికాస్ మర్మత్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకం అమలుకోసం ఏడు సంవత్సరాల కాలపరిమితితో ఒప్పందం కుదర్చుకుందని అంటున్నారు. ఆ ఒప్పందం ఈ ఏడాది అక్టోబరు నెలతో పూర్తవుతుంది. అంతేకాక, సదరు ప్రైవేటు కంపెనీకి ఏవో బకాయిలు కూడా చెల్లించాల్సి ఉందని తెలిసింది అధికారులు బహిరంగంగా చెప్పకపోయినా ఈ సాంకేతిక సమస్యవల్లే ఎన్టీఆర్ సుజల పథకం పునరుద్ధరణ సత్వరం చేయలేకపోతున్నారని సమాచారం. దీనిపై ఆర్‌డబ్ల్యుఎస్ డీఈఈ పురుషోత్తంను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా త్వరలోనే ఎన్టీఆర్ సుజల పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇందుకోసం అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు.