జైలులో పరిచయాలు.. దొంగతనాలకు వ్యూహరచనలు!
ABN , Publish Date - Dec 14 , 2024 | 01:36 AM
అమలాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు లోనై చిన్నతనం నుంచి చిన్నచిన్న చోరీలతో ప్రస్థానం ప్రారంభించిన దొంగలు అంతర్ జిల్లా స్థాయిలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ బీఆ
అంతర్ జిల్లాల దొంగల ముఠా అరెస్టు
రూ.24.65 లక్షల విలువైన
వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం
కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు వెల్లడి
పోలీసు అధికారులకు రివార్డులు
అమలాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు లోనై చిన్నతనం నుంచి చిన్నచిన్న చోరీలతో ప్రస్థానం ప్రారంభించిన దొంగలు అంతర్ జిల్లా స్థాయిలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీబి.కృష్ణారావు శుక్రవారం సాయంత్రం అమలాపురంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొత్తం 13 కేసులకు సంబంధించి రూ.24.65 లక్షల విలువైన 311 గ్రాముల బంగారం, 3.200 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం రూరల్ మండలం చిందాడగరువుకు చెందిన మండేల నాగభాస్కరావు అలియాస్ బాబి, ఐ.పోలవరం మండలం మురమళ్లకు చెందినబొడ్డు కిశోర్, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ముత్యాల పెద్దిరాజు అలియాస్ వీఆర్వో రాజులు ముఠాగా ఏర్పడ్డారు. వారు కోనసీమ జిల్లా పరిధిలో 11 పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారు. పశ్చిమ గోదావరిలో ఒకటి, కాకినాడ జిల్లాలో ఒక కేసు వెరసి 13 కేసుల్లో వారిని అరెస్టు చేశారు. ముఖ్యంగా ఆత్రేయపురం పోలీసుస్టేషన్ పరిధిలో 2 కేసులు, ఆలమూరు స్టేషన్ పరిధిలో 2, అంగరలో 1, అంబాజీపేట 1, అమలాపురం టౌన్ 1, సఖినేటిపల్లి, 1, కొత్తపేట 1, పి.గన్నవరం 1, కాకినాడ జిల్లా పరిధిలోని గొల్లప్రోలు పోలీసుస్టేషన్ పరిధిలో 1, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పోలీసుస్టేషన్ పరిధిలో ఒక కేసుల్లో వారిని అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒకడైన మండేల నాగభాస్కరరావు చిన్నతనం నుంచి వ్యసనాలకు లోనై దొంగతనాలకు పాల్పడడం ద్వారా అంతర్ జిల్లాల స్థాయిలో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోఅతడిపై 40కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్టు చెప్పారు. కేసులో మరో నిందితుడైన ముత్యాలపల్లి పెద్దిరాజు దొంగనోట్ల చెలామణి విషయంలో నర్సాపురం పోలీసుస్టేషన్‌లో అరెస్టు అయి 23 రోజులు జైలులో ఉండి బెయిల్‌పై వచ్చినట్టు తెలిపారు. బొడ్డు కిశోర్ అనే నిందితుడు అనతవరంలో అనిత అనే అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు. వారి ముగ్గురు జైలులో పరిచయమై వరుస దొంగతనాలకు వ్యూహరచనలు చేసుకున్నట్టు చెప్పారు. ఈ చోరీ కేసులను చేధించడంలో విశేషంగా కృషి చేసిన ఎస్డీపీవో వై.గోవిందరావు, రావులపాలెం సీఐ విద్యాసాగర్, ఆత్రేయపురం ఎస్‌ఐ రాము, క్రైమ్‌పార్టీ ఇన్‌చార్జి సీఐ ప్రశాంత్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది విశేష కృషి చేసి నిందితులను లొల్ల లాకుల వద్ద అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన పోలీసు సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందజేశారు. సమావేశంలో కొత్తపేట డీఎస్పీ గోవిందరావు, రావులపాలెం సీఐ విద్యాసాగర్, ఆత్రేయపురం ఎస్‌ఐ రాము ఉన్నారు.