AP Politics: సజ్జల మాయ.. బయటపెట్టిన సూర్య నారాయణ!
ABN , Publish Date - Jun 23 , 2024 | 03:54 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జుడీషియల్ ప్రివ్యూ కమిషన్ (Judicial Review Commission)ను నియమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్య నారాయణ (Surya Narayana) ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఈనెల 24న జరిగే ఏపీ క్యాబినెట్ మెుదటి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జుడీషియల్ ప్రివ్యూ కమిషన్(Judicial Review Commission)ను నియమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్య నారాయణ(Surya Narayana) ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఈనెల 24న జరిగే ఏపీ క్యాబినెట్ మెుదటి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు పడ్డ ఇబ్బందులను వివరించారు. ఈ నేపథ్యంలోనే జుడీషియల్ ప్రివ్యూ కమిషన్‌ను కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్య నారాయణ మాట్లాడుతూ.." వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నానని నన్ను అణచి వేయాలని చూశారు. ఏ కేసు పెట్టారో కూడా చెప్పకుండా విచారణకు పిలిచి నన్ను, నా కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారు. నా భార్య మెడలోని నల్లపూసల గొలుసు తీయించి పోలీసులు దారుణంగా వ్యవహరించారు. వైసీపీ పాలనలో నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులు మోహరించేవారు.. నేనేమైన్నా సంఘ విద్రోహ శక్తినా?. హైదరాబాద్‌లో బంధువుల ఇళ్లకు వెళ్లి మరీ వారిని భయందోళనలకు గురి చేశారు. రాత్రి సమయంలోనూ పోలీసులు అక్కడే ఉండేవారు. నా ఇంటికి సీల్ వేసే అధికారం పోలీసులకు ఎక్కడిది?" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నన్ను చంపమని సజ్జల పోలీసులకు చెప్పారు..
తన కుటుంబాన్ని వేధించిన పోలీస్ అధికారులు రావి సురేశ్ రెడ్డి, భాస్కరరావులపై ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూర్య నారాయణ అభ్యర్థించారు. గత సీఎస్ జవహర్ రెడ్డి ఒక దినపత్రికలో తనపై వచ్చిన వార్త ఆధారంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డారని, మరి జవహర్ రెడ్డి మీద వచ్చిన వార్తలకు ఆయన మీద ఏం చర్యలు తీసుకోవాలంటూ ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాప్ చేసి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును కలిస్తే నిన్ను దేవుడు కూడా కాపాడలేడని బెదిరించారని సూర్యనారాయణ చెప్పుకొచ్చారు.
చంద్రబాబును కలిసిన తర్వాత పోలీసులు తన డ్రైవర్‌ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యనారాయణ దొరికాడా అంటూ పోలీసులకు సజ్జల రామకృష్ణ రెడ్డి ఫోన్ చేయడం తన డ్రైవర్ విన్నాడని వెల్లడించారు. సూర్యనారాయణ దొరికితే "చంపేయండి" అంటూ సజ్జల పోలీసులను ఆదేశాలు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన వారికి చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయాలని సూర్యనారాయణ కోరారు. అందుకే తొలి మంత్రివర్గ సమావేశంలోనే జుడీషియల్ ప్రివ్యూ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి:
Minister Subhash: ఎన్నికల్లో ఓడిపోయినా జగన్‌కు జ్ఞానోదయం కాలేదు: మంత్రి వాసంశెట్టి