YS Sharmila : వారు రాజీనామా చేయాలి.. షర్మిల సవాల్
ABN, Publish Date - Nov 26 , 2024 | 06:25 PM
బీజేపీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం రచించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని వైఎస్ షర్మిల తెలిపారు.
విజయవాడ: ‘‘భారత రాజ్యంగం మార్చ్’’ పేరుతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం నుంచి.. ఎంజీరోడ్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. రాజ్యాంగం పుస్తకం చేతపట్టి షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందంటే మన రాజ్యాంగమే కారణమని తెలిపారు. ఇవాళ(మంగళవారం) విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ...దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తగా, నేతగా, సీఎంగా ఎదిగారని కొనియాడారు. ఆయన బిడ్డగా తాను ఇలా చెప్పడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఆరోజు రాజ్యాంగం రచించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా.. రాజ్యాంగం రక్షణ కోసం కాంగ్రెస్ పని చేస్తుందని వైఎస్ షర్మిల ఉద్ఘాటించారు.
ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధం..
‘‘అధికారంలో లేనప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుని మోస్తుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ తన ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. భారత రాజ్యాంగం ఇంత గొప్పది అయితే.. అధికారంలో ఉన్న బీజేపీ విలువనివ్వడం లేదు. బీజేపీ వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మీడియాతో సహా వారి గొంతు నొక్కేస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసేలా బీజేపీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తుంది. ఇప్పుడు ఉన్నది భారత రాజ్యంగమా.. లేక బీజేపీ రాజ్యాంగం అనాలా. పవర్ మొత్తం మోదీ చేతుల్లోనే ఉండాలి.. అందరూ డమ్మీలే. వారి పార్టీ అధికారం లేని రాష్ట్రాలకు బీజేపీ చాలా అన్యాయం చేస్తుంది’’ అని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీకి మోదీ తీవ్ర అన్యాయం..
‘‘ ఏపీకి మోదీ తీవ్ర అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నమోదీ పదేళ్ల నుంచి రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. విభజన హామీల్లో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. మోదీ అనుసరిస్తున్న రాజ్యాంగం కాబట్టి దేశంలో ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఒక మతాన్ని అవమానించాలి.. మరో మతాన్ని రెచ్చగొట్టాలి.. ఈ మంటలో బీజేపీ నేతలు చలి కాచుకోవాలి. ఇదే ఆర్‌ఎస్ఎస్. , బీజేపీ అమలు చేసే రాజ్యాంగం. కులగణన జరగాలని చాలాసార్లు కాంగ్రెస్ డిమాండ్ చేసినా ఆ దిశగా బీజేపీ అడుగులు వేయడం లేదు. ఇప్పుడైనా కులగణన చేపట్టి.. వర్గాల వారీగా న్యాయం చేయాలి. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు మేమంతా సిద్ధం.రాహుల్ గాంధీతో కలిసి పోరాడతాం.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం’’ అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
జగన్‌పై షర్మిల సెటైర్లు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై షర్మిల సెటైర్లు గుప్పించారు. ‘‘ఎమ్మెల్యేగా గెలిచిన వారు అసెంబ్లీకి వెళ్లాలని భారత రాజ్యాంగం చెబుతుంది. అంతటి బాధ్యతను, నమ్మకాన్ని ప్రజలు వారికి ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన సమస్యలపై అడగాలి. మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్లారని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలు రాజ్యాంగ బద్దంగా ఇచ్చిన హక్కులను వినియోగించుకోవాలి. అధికారం లేకపోతే అసెంబ్లీకి వెళ్లనని అంటే రాజీనామాలు చేయాలి. రాజ్యాంగం ప్రకారం లంచం తీసుకోవడం తప్పు. అమెరికాలో కూడా దర్యాప్తు సంస్థలు అదానీ, జగన్‌ల మధ్య లంచాలను నిర్ధారించాయి. కేంద్రం స్థాయిలో సీబీఐ, ఈడీ ద్వారా అదానీ అక్రమాలపై విచారణ చేయాలి. ఈడీ, సీబీఐ మోదీ చేతుల్లో ఉన్నాయి కాబట్టే వారు విచారణ చేయరు. బీజేపీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. జాయింట్ పార్లమెంటరి కమీటీ వేసి విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇంత అవినీతి జరిగిందని తెలిసి కూడా సీఎం చంద్రబాబు ఎందుకు విచారణకు ఆదేశించలేదు. కూటమితో కలిసి ఉన్నారు కాబట్టి.. బీజేపీకి అదానీ దగ్గర కాబట్టి.. జగన్‌పై విచారణ చేయాలంటే చంద్రబాబు భయపడుతున్నారు. మరి ఇక దేశంలో, రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఎక్కడ ఉంది. రూ.1750 కోట్లు లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు తెలిసి కూడా వారిని శిక్షించరా. వారి స్వార్ధం కోసం ఒప్పందాలు చేసుకుని లక్షా యాభై వేల కోట్ల భారం ప్రజలపై మోపారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేసి, అదానీ, జగన్ లంచాల బాగోతంపై విచారణ వేయాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP: ఇలాంటి వారిని అస్సలు వదలద్దు.. కఠినంగా శిక్షించండి..
AP News: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు..
Chevireddy : మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు
Read Latest AP News and Telugu News
Updated Date - Nov 26 , 2024 | 06:47 PM